సంధ్య(ఫైల్)
బడంగ్‌పేట్: పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేటకు చెందిన ఎల్లయ్య, స్వప్న దంపతులు మీర్‌పేటలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్న కుమార్తె సంధ్య మీర్‌పేటలోని తీగల రాంరెడ్డి పాల్‌టెక్నిక్ (టీఆర్‌ఆర్) కాలేజీలో ఫైనలియర్(సీఎంఈ) చదువుతోంది. అదివారం తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లడంతో సంధ్య, ఆమె తాత మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాత హాల్‌లో నిద్రిస్తుండగా, సంధ్య బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ఆమె తల్లితండ్రులు సంధ్యను పిలిచినా తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టి చూడగా సంధ్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.
హడావిడిగా అంత్యక్రియలు: దీంతో తల్లిదండ్రులు సమీపంలో బంధువులకు సమాచారం అందించారు. వారితో కలిసి హడావుడిగా సాయంత్రం బడంగ్‌పేట స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సివుంది. ఈ విషయంపై మీర్‌పేట పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
విద్యార్థుల ధర్నా
సంధ్య ఆత్మహత్యపై సమాచారం అందడంతో సోమవారం కళాశాలలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. లెక్చరర్ పార్వతి వేధింపుల కారణంగా సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా లెక్చరర్ పార్వతిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల యాజమన్యం ప్రకటించింది. సంధ్య కుటుంబానికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment