పద్మమ్మ మృతదేహం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిగా పక్క జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి నర్సింగ్‌హోంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణిని చిదిమేసింది. అనుభవజ్ఞులైన వైద్యులు లేనప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న సదరు అధికారి ఫోన్లో ఇచ్చిన సూచనలు గర్భిణి పాలిట మృత్యుపాశమైంది. వివరాలిలా.. ఏడు నెలల గర్భంతో ఉన్న బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన పద్మమ్మ కడుపునొప్పితో బాధపడుతుండగా భర్త శివశంకర్ వైద్యం కోసం పట్టణంలోని సత్యసాయి నర్సింగ్ హోంకు బుధవారం రాత్రి తీసుకువచ్చారు.
ఆమెకు వైద్యాన్ని ప్రారంభించిన ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విపరీతమైన వాంతులు అయ్యాయి. ఇంజెక్షన్ వికటించిందంటూ గుర్తించిన బాధితులు అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం, అనుభవజ్ఞులైన డాక్టర్లెవరూ మహిళను చూడకపోవడంతో ఆ రోజు అక్కడే కాలం గడిపారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది.
కుటుంబ సభ్యుల ఆందోళన
గర్భిణి మృతితో ఆగ్రహించిన బంధువులు శుక్రవారం ఉదయం సత్యసాయి నర్సింగ్ హోం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో దిగి వచ్చిన నర్సింగ్‌హోం యాజమాన్యం తమపై కేసు నమోదు చేయకుండా చూసుకున్నారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం అందించేందుకు ఒప్పుకుని రాజీపడ్డారు. గతంలోనూ ఇక్కడ నిర్లక్ష్యంగా వైద్యం నిర్వహించారంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరగా ఇందులో తమ తప్పేమీ లేదన్నారు. రోగికి రక్తం తక్కువగా ఉండటం వల్లే అనుకోకుండా ప్రాణం మీదకి వచ్చిందన్నారు. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఇక మీదట జరగకుండా చూసుకుంటామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment