హాల్‌టికెట్ చూపిస్తున్న విద్యార్ధులు అశ్విన్, ఉదయ్ , న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
చైతన్యపురి: వారిద్దరూ కష్టపడి చదివారు.. పాఠశాల నుంచి పదో తరతగి హాల్ టికెట్ తీసుకున్నారు.. గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి హాల్‌టికెట్ నంబర్ చూసుకుని మరీ సీట్లో కూర్చున్నారు.. ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు.. పరీక్ష రాస్తుండగా వచ్చిన స్క్వాడ్.. ‘మీ హాల్‌టికెట్లు ఫేక్‌వి.. పరీక్ష రాయటానికి వీల్లేదు’ అంటూ పేపర్ తీసేసుకున్నారు. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ పదో తరగతి విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటన గురువారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
♦ ఉదయ్‌కుమార్, ఏదులకంటి అశ్విన్‌కుమార్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలోని న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివారు. అయితే, ఈ స్కూలుకు పదో తరగతికి అర్హత లేదు. కానీ స్కూలు యాజమాన్యం మాత్రం పదోతరగతి విద్యార్థులను నగరంలోని వివిధ స్కూళ్ల విద్యార్థులుగా ఫీజులు కట్టించి పరీక్షలకు పంపిస్తుంటారు.
♦ ఈ క్రమంలోఏదులకంటి అశ్విన్‌కుమార్, ఉదయ్‌కుమార్‌ను ‘అల్కాపురి శ్రీద్వారకామయి ఎంహెచ్‌ఎస్ పాఠశాల’ విద్యార్థులుగా ఫీజులు కట్టించారు. వీరిలో అశ్విన్‌కుమార్‌కు మన్సూరాబాద్‌లోని జడ్‌పీహెచ్ స్కూల్ సెంటర్ కేటాయించారు. ఉదయ్‌కుమార్‌కు రామకృష్ణాపురంలోని సెయింట్ మార్టిన్ స్కూల్ సెంటర్ ఇచ్చారు. వాస్తవానికి అల్కాపురి శ్రీ ద్వారకామయి ఎంహెచ్‌ఎస్ పాఠశాల’ మూడేళ్ల క్రితమే మూతపడింది.
♦ న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాత్రం విద్యార్థుల హాల్‌టికెట్లపై ‘న్యూ మారుతీనగర్ శ్రీ ద్యారకామాయి స్కూల్ స్టాంపు’ వేసి పరీక్షకు పంపించారు. చదివిన స్కూల్‌కు అనుమతిలేక పోవడం.. లేని స్కూల్ నుంచి ఫీజుల కట్టడం, సంబంధం లేని స్కూల్ స్టాంపులు వేసి అటెస్ట్ చేసి ఇవ్వడంతో చివరి క్షణంలో బోర్డు అధికారులు గుర్తించి ఇద్దరు విద్యార్థులను ‘ఫేక్’గా తేల్చి పరీక్షలు రాయనీకుండా బయటకు పంపించివేశారు.
పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు...
హాల్‌టికెట్ ఉన్నా పరీక్షలేక పోయిన విద్యార్థులు అశ్విన్‌కుమార్, ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో న్యూరెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్‌ఎస్‌వీ నాయకులు మహేందర్‌యాదవ్, శివరామకృష్ణ, ప్రవీణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయని, ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment