
నిందితుడిని ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి
మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు.. కలహాల కాపురంతో కక్ష పెంచుకుంటాడు.. మితిమీరిన ఆవేశంతో ఏకంగా ప్రాణాలే తీస్తాడు.. అలా మూడు రాష్ట్రాల్లో ముగ్గుర్ని హతమార్చాడు.. ఆఖరికి శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కాడు.. ఎడాపెడా వివాహేతర సంబంధాలు, చివరకు వారినే చంపడాలు చూస్తుంటే సైకో కిల్లర్‌ను తలపిస్తున్నాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి శనివారం అతని వివరాలను మీడియాకు వెల్లడించారు.
శ్రీకాకుళం : నిందితుడు సవర రమేష్‌ది ఒడిశా రాష్ట్రం జగపతి జిల్లా వలకభద్ర పంచాయతీ. భార్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అతని కళ్లు అందరి ఆడవాళ్లపై పడ్డాయి. 2016లో దాసేటి దమయంతి అనే మహిళకు దగ్గర కావాలని ప్రయత్నించాడు. నిరాకరించడంతో ఆమెను అంతమొందించాడు. తెలంగాణ పారిపోయి 2017లో ముచ్చిక కోసమ్మ అనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏ వివాదం వచ్చిందో గానీ ఆమెను కూడా హత్య చేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పుట్టపురం గ్రామం వచ్చి తలదాచుకున్నాడు. అక్కడ దండు జయంతి అనే మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. చివరకు ఆమెనూ 2019 డిసెంబర్‌లో హతమార్చాడు. ( అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య )
ఆమెతో సఖ్యంగా ఉన్నప్పుడు కొంత నగదు ఇచ్చాడని, తర్వాత తిరిగి ఇవ్వాలని గొడవ పడ్డాడని, ఈ విషయంలో తగాదా వచ్చి జయంతిని హత్యచేసి, సమీపంలో ఉన్న కాల్వలో పడేసి పరారయ్యాడనీ ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో మృతురాలి సెల్‌ఫోన్ తీసుకువెళ్లాడు. నాలుగు నెలల తర్వాత ఫోన్ స్విచాన్ చేయడంతో సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ తెలుసుకున్న జిల్లా పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. నేర పరిశోధనలో ప్రతిభ కనబరిచిన పాతపట్నం సీఐ ఆర్.రవిప్రసాద్, సారవకోట ఎస్సై వై.రవికుమార్, హెచ్‌సీ జె.సింహాచలం, పీసీలు శ్రీను, రవికుమార్‌లకు ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment