
హైదరాబాద్: రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ ఓ యువకుడిని బలి తీసుకుంది. క్యూనెట్‌లో పెట్టుబడి పెట్టిన బాధితుడు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన అడపు అరవింద్ (31) చందానాయక్ తండాలోని సీఎస్‌ఆర్ ఎస్టేట్‌లో రెండేళ్లుగా నివాసం ఉంటున్నాడు. లిగిన్ ఫెర్నాండేజ్ అనే అతనితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఫెర్నాండేజ్ డ్యూటీ కి వెళ్లగా అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన ఫెర్నాండేజ్ డోర్ కొట్టగా స్పందించలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా అరవింద్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద క్యూనెట్ ఐడీ కార్డు లభించింది. కాగా, అరవింద్ అసెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 2017లో ఉద్యోగం మానేశాడు. క్యూనెట్‌లో 2017లో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న అరవింద్‌కు పెట్టిన డబ్బులు రాకపోగా ఉద్యోగం కూడా లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment