వివాహితపై సామూహిక అత్యాచారం | Rape On Married Women In Kalvakurthy | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Published Wed, Jun 20 2018 1:49 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

Rape On Married Women In Kalvakurthy - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఎల్‌సీ నాయక్‌ 

కల్వకుర్తి : పట్టణంలో ఓ వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న వరుస నేరాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

 పూర్తి వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నివాసముంటున్న ఓ వివాహిత సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తోంది.

ఆ సమయంలో అక్కడే ఉన్న జిలానీ, సల్మాన్‌ ఖాన్, ఆబేద్‌ ఖాన్, మన్సూర్‌ ఆమెను పిలిచి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. వివాహిత గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న కొందరు యువకులు వచ్చేసరికి పారిపోయారు.

ఆమె ఏడుస్తూ వచ్చి విషయాన్ని అక్కడున్న వారికి వివరించింది. వెంటనే ఆ యువకులు 100 నంబర్‌కు డయల్‌ చేసి సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.

ఇలా చిక్కారు 

వివాహితను అత్యాచారం చేసి పారిపోయిన యువకులను పోలీసులు రెండు గంటల్లోపే పట్టుకున్నారు. నిందితుల అన్వేషణలో భాగంగా సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు విచారణ చేస్తుండగా అక్కడ ద్విచక్రవాహనాలు పార్క్‌చేసి ఉన్నాయి. వాటి నంబర్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అత్యాచారం జరిగిన ప్రదేశంలో సిగిరెట్లు, అగ్గిపెట్టె, లైసెన్స్‌ ఇతర వస్తువులు కూడా లభించాయి.  

ఎస్పీ, కలెక్టర్‌ విచారణ 

అత్యాచారం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టరు శ్రీధర్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ మంగళవా రం ఉదయం కల్వకుర్తికి వచ్చారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితులు, బాధితురాలి తో మాట్లాడారు. అనంతరం అత్యాచారం జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. డీ ఎస్పీ ఎల్‌సీ నాయక్, ఇన్‌చార్జ్‌ సీఐ గిరికుమా ర్, ఎస్‌ఐ రవి పూర్తి వివరాలు ఎస్పీకి వివరించారు.

 కఠినంగా శిక్షిస్తాం : డీఎస్పీ

కల్వకుర్తి: అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్‌సీనాయక్‌ అన్నారు. మంగళవారం కల్వకుర్తి సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం పట్టణంలో జరి గిన అత్యాచార వివరాలను విలేకరులకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నలుగురు యువకులు మహిళను అడ్డగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.

స్థానికులు గమనించి అక్కడికి వెళ్లగా జేపీనగర్‌ వైపు పారిపోతుండగా పట్టుకున్నా మని చెప్పారు. నేరం జరిగిన 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో కల్వకుర్తి ఇన్‌చార్జి సీఐ గిరికుమార్, ఎస్‌ఐలు రవి, బాలకృష్ణ పాల్గొన్నారు.

బాధితురాలికి అండగా ఉంటాం

కల్వకుర్తి టౌన్‌: అత్యాచారం జరిగిన బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టరు శ్రీధర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని, వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో పోలీసుల  గస్తీ పెంచుతామని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగనివ్వమని స్పష్టం చేశారు.   

నిఘా కట్టుదిట్టం  

ప్రతి పట్టణంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. చట్ట విరుద్ధ పనులు ఎవరు చేసినా వదిలిపెట్టమని హెచ్చరించారు. అనంతరం వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. బస్టాండ్‌ సమీపంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దగ్గరలో మద్యం దుకాణాలు ఉన్నాయని, అక్కడ తాగేవారితో ప్రజలకు, విద్యార్థులకు, గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి ఆర్డీఓ రాజేష్‌ కుమార్, డీఎస్పీ ఎల్‌సీ నాయక్, కల్వకుర్తి ఇన్‌చార్జి సీఐ గిరికుమార్, ఎస్‌ఐలు రవి, బాలకృష్ణ, రామ్మూర్తి తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement