మాట్లాడుతున్న ఓఎస్డీ విఠలేశ్వరరావు
గూడూరు: అంతర్రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్ చేసినట్లు జిల్లా క్రైమ్ ఓఎస్డీ టీపీ విఠలేశ్వరరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబు, పట్టణ, రూరల్ సీఐలు సుబ్బారావు, అక్కేశ్వరరావులతో కలసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలుగొండ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ దుంగలను వాహనాల్లో తరలించే ప్రయత్నం చేస్తుండగా జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బందితోపాటు వెంకటాచల సత్రం, చిల్లకూరు, నాయుడుపేట ఎస్సైలు నాగరాజు, శ్రీనివాసరావు, రవినాయక్‌లు సిబ్బందితో కలసి ఏకకాలంలో దాడులు చేశారు. 40 దుంగలు, మూడు వాహనాలు, 11 సెల్‌ఫోన్లు, రూ.5,250 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు రూ.75 లక్షల వరకూ ఉంటుందన్నారు.
అరెస్టైన వారు..
వెంకటాచలం మండల పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన అఫర్‌ఖాన్, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బుక్కా నాగేశ్వరనాయక్, కర్నూలు జిల్లాకు చెందిన కత్తి ఏడుకొండలు, చిల్లకూరు మండల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన నవాజ్ షరీఫ్, కడప జిల్లాకు చెందిన బాదిచర్ల శివకుమార్, నంద్యాలకు చెందిన తులసి చిన్నిలను అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన అజాద్ అహ్మద్, నెల్లూరు జిల్లా రాపూరు గ్రామానికి చెందిన రేవూరి సురేష్, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన వి.రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు, ఒక మినీ లారీ, మరో ట్రక్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరచనున్నట్లు విఠలేశ్వరరావు తెలిపారు. ఎక్కడైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9390777727కు మెసేజ్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment