బాధితుడు రాజన్నను విచారిస్తున్న సీఐ
చిత్తూరు, కలకడ : పట్ట పగలు దుండగులు విశ్రాంత ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. రూ.10 లక్షలు వెంటనే ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తర్వాత రోడ్డుపై వదిలేశారు. ఈ సంఘటన బుధవారం కలకడ మండలం కోన గ్రామంలో జరిగింది. బాదితుడు, పోలీసుల కథనం మేరకు.. కోనకు చెందిన గుడ్ల రాజన్న(75) విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆయనకు బుధవారం గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. బొప్పాయి పంటను కొనుగోలు చేస్తామని బుధవారం ఉదయం 8 గంటలకు కోనలోని పొలం వద్దకు రావా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన రాజన్నను దుండగులు మాటల్లో పెట్టి కారులో బలవంతంగా ఎక్కించారు. కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు.
రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గుర్రంకొండకు, అక్కడి నుంచి చెర్లోపల్లె వద్దకు తీసుకువచ్చారు. దీంతో హతాశుడైన రాజన్న నగదు కలకడ బ్యాంకులో ఉందని, అక్కడికి తీసుకెళితే ఇస్తానని చెప్పాడు. కలకడ సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్దకు చేరుకోగానే తమ గ్రామానికి చెందిన వ్యక్తి నగదు తీసుకువచ్చాడని రాజన్న చెప్పడంతో దుండగులు వాహనం నిలపకుండా చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలోని మహల్ క్రాస్ వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు అతన్ని దించేశారు. తాము తిరిగి గురువారం వస్తామని, నగదు సిద్ధంగా ఉంచాలని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు తన కుమారులకు సమాచారం అందించగా పోలీసులు ఫిర్యాదు చేశారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, కలకడ ఎస్‌ఐ చాన్‌బాష కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment