ఆసుపత్రి ఆవరణలో దుఃఖసాగరంలో బంధువులు, భార్య మహేశ్వరితో బసవరాజు (ఫైల్)
కుమారుడు పుట్టాడన్న ఆనందాన్ని దేవుడు ఆ యువకుడికి లేకుండా చేశాడు. కుమారుడిని చూసేందుకని బయల్దేరిన అతడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు బలిగొంది. కుమారుడిని చూడకుండానే పరలోకాలకు చేరిన హృదయ విదారక ఘటన బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో జరిగింది.
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్: బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటకు చెందిన బసవరాజు (25) స్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. తండ్రి హనుమంతు చిన్నప్పుడే మృతి చెందగా తల్లి శివమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఏడాదిక్రితం బెళుగుప్ప మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. గత నెల 23వ తేదీ రాత్రి అత్తగారింటి నుంచి ‘నీ భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి...అర్జంటుగా బెళుగుప్ప ఆస్పత్రికి రా..’ అంటూ ఫోన్ చేశారు.
ఉన్నఫలంగా బసవరాజు ద్విచక్రవాహనంలో ముప్పులకుంట నుంచి బెళుగుప్పకు బయల్దేరాడు. మార్గమధ్యంలో కళ్యాణదుర్గం మండలం చాపిరి వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్థానికులు గుర్తించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో కళ్యాణ దుర్గం ఆసుపత్రిలో బసవరాజు, బెళుగుప్ప ఆస్పత్రిలో పురిటినొప్పులతో భార్య ఉండటంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణానాతీతంగా మారింది. ఆ మరుసటి రోజే మహేశ్వరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆనందం.. అంతలోనే విషాదం
తనకు కుమారుడు పుట్టాడన్న సమాచారం బంధువుల ద్వారా తెలుసుకున్న బసవరాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే అక్కడే దేవుడు ఆ కుటుంబంపై చిన్నచూపు చూశాడు. బసవరాజు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే బెంగుళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. ఈ మేరకు బెంగుళూరుకు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో శనివారం బసవరాజు కన్నుమూశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మిత్రులు, బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలివచ్చారు. కుమారుడు లేడన్న చేదు వార్తను విన్న బసవరాజు తల్లి శివమ్మ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment