మృతి చెందిన పసలపూడి సత్యనారాయణ, గూడూరి రాధిక
ఉంగుటూరు/తాడేపల్లిగూడెం రూరల్ : ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన పసలపూడి శివ సత్యనారాయణ (46) ఇటికల బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడికి భార్య అనంతలక్ష్మి, కుమార్తె సంధ్య, కుమారుడు కిషోర్‌కుమార్ ఉన్నారు. భీమడోలులో జరిగే ఫంక్షన్ నిమిత్తం సత్యనారాయణ వదిన కుమార్తె గూడూరి రాధిక (32) (హైదరాబాద్) ఆమె కుమార్తె గీతిక (4), కుమారుడు తాన్విక్ (సంవత్సరం)తో కలిసి నీలాద్రిపురం వచ్చింది.
శనివారం శివసత్యనారాయణ రాధిక, ఆమె పిల్లలతో కలిసి తన మోటార్ బైక్‌పై భీమడోలులో జరిగే ఫంక్షన్‌కు బయలుదేరారు. నీలాద్రిపురం నుంచి పెదతాడేపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారిని చేరుకుని అక్కడి నుంచి భీమడోలు వెళ్తుండగా బాదంపూడి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద వారి బైక్‌ను వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివ సత్యనారాయణ, రాధికకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శివసత్యనారాయణ మృతి చెందాడు.
రాధికతో పాటు ఆమె కుమార్తె, కుమారుడిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో రాధిక మృతిచెందింది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి రాధికకు తీవ్రగాయాలు కావడంతో చిన్నారులు ఘటనాస్థలంలో రోదించడం చూపరులను కన్నీరు తెప్పించింది. శివ సత్యనారాయణ, రాధికల మృతితో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. భీమడోలు నుంచి కూడా పలువురు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చేబ్రోలు ఎస్సై తాడి నాగ వెంకటరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment