సాక్షి బెంగళూరు: ఐటీ సిటీలో కొన్ని రహదారుల్లో వెళ్లాలంటే మళ్లీ క్షేమంగా తిరిగివస్తామా? అనే సందేహం రాకమానదు. బెంగళూరు సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డులో వచ్చే బెట్టహలసూరు క్రాస్, ఎంవీఐటీ క్రాస్, సౌదహళ్లి క్రాస్‌లో నిరంతరం ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆగస్టులో జరిగిన ప్రమాదాలే దీనికి నిదర్శనమని చెప్పవచ్చు.
ఈ నెలలో జరిగిన ప్రమాదాలు..
♦ 5వ తేదీ రాత్రి 7.20: బెట్టహలసూరు క్రాస్ జంక్షన్‌లో రోడ్డు దాటుతుండగా ఎయిర్‌పో ర్టుకు వెళ్లాల్సిన వాహనం వచ్చి ఢీకొనడంతో నరసింహమూర్తి అనే వ్యక్తి మరణించాడు.
♦ 6న ఉదయం 5.50: ఎంవీఐటీ జంక్షన్‌లో హౌస్ కీపింగ్ కంపెనీలో పని చేసే ముగ్గురు ఓమ్నీ వాహనంలో వెళ్తున్నారు. అయితే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
♦ 12న ఉదయం 5.15 గంటలకు: బెంగళూరు నుంచి బైక్‌పై నందికొండకు వెళ్తూ సౌదహళ్లి గేట్ సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలోబైక్ నడుపుతున్న విజయ్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
♦ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు: ఎంవీఐటీ కాలేజీ దగ్గరలో వస్తున్న కారు అటుగా నడుచుకుంటూ వెళ్తున్న సూర్యబాబు, లచ్చయ్యను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
అతివేగం, రోడ్ల డిజైనింగ్ లోపాలు
బళ్లారి రోడ్డులోని బెట్టహలసూరు క్రాస్, ఎంవీఐటీ క్రాస్ జంక్షన్, సౌదహళ్లి క్రాస్‌లు పాదచారులు, ద్విచక్రవాహనదారులకు యమదారులుగా మారాయి. గత పదిరోజుల్లో జరిగిన ఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ జంక్షన్ సమీపంలో నిర్మించిన అండర్‌పాస్, పాదచారుల ఫుట్‌పాత్ ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. క్రాస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి వాహనాలు వేగంగా రావడం, పాదచారులు నడిచేందుకు ప్రత్యేక బారికేడ్లు లేకపోవడం ప్రమాదాలను పిలుస్తోంది.
ఎంవీఐటీ జంక్షన్‌లో..
హుణసమారనహళ్లి సమీపంలో గ్రామాలు, కాలేజీలు, ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. దీంతో ఆయా పనులకు వెళ్లే వారు ఎంవీఐటీ జంక్షన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. జంక్షన్‌లోని బస్టాండులో రోడ్డు విశాలంగా ఉంది. కానీ పాదచారులు నడిచేందుకు ప్రత్యేక బారికేడ్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అర కిలోమీటరు దూరంలో అండర్‌పాస్ ఉంది. ప్రజలు అక్కడికి వెళ్లకుండా బస్టాండు సమీపంలోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
బెట్టహలసూరు క్రాస్‌లో..
బెట్టహలసూరు క్రాస్‌కు 100 మీటర్ల దూరంలో అండర్ పాస్ ఉంది. అయితే జనాలు అక్కడికి వెళ్లకుండా జంక్షన్‌లోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా రోడ్డుపై వేగంగా వాహనాలు ఢీకొంటున్నాయి. ప్రమాదంలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దారికి రెండువైపులా డౌన్‌ర్యాంపు ఉంది. కానీ ప్రజలు రోడ్డు గుండా దాటుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సౌదహళ్లి గేట్ వద్ద.. ఎయిర్‌పోర్టు టోల్‌గేట్‌కు సమీపంలో సౌదహళ్లి గేట్ సమీపంలో తరచూ ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కాగా రాత్రి వేళల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment