సాక్షి, మానకొండూర్ : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడ్ని తప్పించబోయి అదుపుతప్పింది. బాలుడ్ని.. రోడ్డు పక్కనే ఉన్న ఓ రాజకీయపార్టీ జెండాగద్దెను ఢీకొట్టి సమీపంలోని కిరాణాషాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడి కాలు విరిగింది. కారులో ఏడుగురు ఉండగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు.. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదా వరిఖనికి చెందిన నర్సింగ్‌భూషణ్ అతడి తండ్రి వెంకటాచారి, తల్లి సరోజ, భార్య స్వరూప, కుమారుడు సంచీద్రచారీ, మామ ఉప్పుల రామబ్రహ్మం, అత్త విజయలతో హైదరాబాద్‌లోని ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు.
సోమవారం వేకువజామున తిరుగుపయనమయ్యారు. ఉదయం ఏడుగంటలకు గుండ్లపల్లికి చేరుకున్నారు. రాజీవ్ రహదారి పక్కన స్టేజీ మూలమలుపు వద్ద సైకిల్‌పై కారీలు విక్రయించే సుబ్‌ఖాన్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బాలుడితో పాటు ఓ రాజకీయపార్టీ జెండా గద్దెను ఢీకొట్టింది. కారువేగంగా ఉండటంతో పక్కనే ఉన్న కిరాణషాపులోకి దూసుకెళ్లింది. బాలుడు సుబ్‌ఖాన్ కాలు విరిగింది. కారులోని నర్సింగ్‌భూషణ్‌తో పాటు భార్య స్వరూప, ఆత్త విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన కారును కిందకు దించారు. క్షత్రగాతులను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కిరాణాషాపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో షాపు తెరవకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపు నిర్వాహకుడు పబ్బతి ఆంజనేయులు ఫిర్యాదుతో ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment