ఆస్పత్రిలో మృతి చెందిన వీరాస్వామి సంఘటన స్థలంలో రఫీ మృతదేహం
కందుకూరు(ప్రకాశం): ఎదురెదురుగా వచ్చిన కట్టెల లోడు ట్రాక్టర్.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందడంతో పాటు మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డ రోడ్డు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండలం ఓగూరుకు చెందిన కందూరు కృష్ణారెడ్డి (20) సింగరాయకొండ వద్ద మలినేని కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన షేక్ రఫీ (17) ఒంగోలు ఉమామహేశ్వర కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరితో పాటు మర్రిపూడి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాణికొండ వీరాస్వామి (17) ఒంగోలు ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు.
వీరు ముగ్గురూ స్నేహితులు. ద్విచక్ర వాహనంపై మలినేని కాలేజీ నుంచి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓగూరు వస్తున్నారు. అదే సమయంలో పొగాకు చెక్కుల లోడ్‌తో ట్రాక్టర్ సింగరాయకొండ వైపు వెళ్తోంది. పలుకూరు అడ్డ రోడ్డు వద్ద వాహనాలు సైడ్ ఇచ్చి వెళ్లే సమయంలో ట్రాక్టర్.. ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు విద్యార్థులు రోడ్డుపై పడటంతో షేక్ రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వీరాస్వామిని 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది సేపటికే వీరాస్వామి మృతి చెందాడు. తీవ్రగాయాలైన కృష్ణారెడ్డిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment