భూత్పూర్ : తీవ్రంగా గాయపడిన వెంకటయ్య
భూత్పూర్ (దేవరకద్ర): మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజు(32) అనే వ్యక్తి అమిస్తాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై యూటర్న్ తీసుకొని మహబూబ్‌నగర్ వెళ్తుండగా.. భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్ వైపు పత్తి లోడ్‌తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రాజుది నాగర్‌కర్నూల్ జిల్లా అవురాస్‌పల్లికి చెందినవాడిగా గుర్తించారు. అయితే రాజు అమిస్తాపూర్‌లో గ్యార్మీ పండగకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మరో ప్రమాదంలో మున్సిపాలిటీలోని శేరిపల్లి(బి) వద్ద తాటిపర్తి నుంచి భూత్పూర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటయ్య అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. సమాచారం తెలుసుకున్న భూత్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తాపడి..
మహబూబ్‌నగర్ క్రైం: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగంగా ఆటో నడపటం వల్ల అదుపు తప్పి బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఫతేపూర్ మైసమ్మ ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. గండీడ్ మండలం కొంటెపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య(21) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఫతేపూర్ మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు.
అక్కడ మొక్కులు చెల్లించాక రాత్రి 8 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడపడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు వెంకటయ్య అన్న అంజిలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు, ఆటో ఢీకొని..
పెబ్బేరు (కొత్తకోట): మండలంలోని తోమాలపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట నుంచి పెబ్బేరు వైపు వస్తున్న ఆటోను తోమాలపల్లి గ్రామ సమీపంలో కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో బీసన్నకు చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనం తరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌కు తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరా లు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment