ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని సరితా విహార్‌లో గల ఓ బిర్యానీ సెంటర్ ఎంతో పాపులర్. ఆ బిర్యానీ సెంటర్ కౌంటర్‌లో కట్టలకొద్దీ డబ్బు ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఇద్దరు దొంగలు కూడా అలాగే అనుకున్నారు. దొరికినంత దోచుకెళ్దామని మంగళవారం అర్ధరాత్రి పక్కా ప్లాన్‌తో మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. కానీ, వారికి ఊహించని షాక్ తగిలింది. బిర్యానీ సెంటర్‌లోకి ప్రవేశించిన రాజు సింగ్ (19), బాబీ రాజు (22)లకు ఖాళీ క్యాష్ కౌంటర్ దర్శనమిచ్చింది. గల్లా పెట్టె మొత్తం వెతికారు.
కానీ, చిల్లగవ్వ కూడా దొరకలేదు. చివరికి ఉట్టి చేతులతో పోవడం ఇష్టం లేక శుష్టుగా బిర్యానీ తిన్నారు. పైగా డబ్బు చెల్లించి భోజనం చేసినట్టు తెగ బిల్డప్ కొట్టి బిర్యానీ మెక్కడం పూర్తయ్యాక మిగిలిన బిర్యానీ వంక చిరాగ్గా ఓ లుక్కేశారు. అనంతరం క్యాష్ కౌంటర్ పైన గల ఓ ల్యాప్‌టాప్‌ను తీసుకుని ఉడాయించారు. అయితే, అదే ల్యాప్‌టాప్ వారిని పట్టిస్తుందని ఆ దొంగబాబులు ఊహించలేకపోయారు. మర్నాడు ఉదయం రెస్టారెంట్ తెరచిన యజమానికి విషయం అర్ధమైంది. ఆయన పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు మొదలైంది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ల్యాప్‌టాప్ అమ్ముతుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. చివరికి రాజు, బాబీ కథ.. అనుకున్నదొక్కటీ అయిందొక్కటీ చందంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment