biryani house
-
Hyderabad: చికెన్ బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఓ బిర్యానీ హౌజ్ నిర్వాహకులకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీచేసినట్లు బాధితుడు బస్వరాజుల రాజేష్ బుధవారం వివరించారు. ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో చదువుతున్న రాజేష్ గత ఏడాది అక్టోబర్ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేస్తున్న సమయంలో ఈగ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అయితే నిర్వాహకులు పట్టించుకోకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు. దీంతో రాజేష్ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం వారు కేసును విచారణ చేపట్టి ఫిర్యాదుదారుడికి నష్టపరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్ పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
బిరియానీ కోసం కక్కుర్తి
బిరియానీ కోసం కక్కుర్తి పడిన ఇద్దరు సూడో అధికారులను అనంతపురం రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఎస్టీ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. మూడ్రోజులుగా నగరంలోని ఓ హోటల్ నిర్వాహకుడిని బెదిరించి బిరియానీ పార్శిళ్లు పట్టుకెళ్లడం గమనార్హం. సాక్షి, అనంతపురం క్రైం: బిరియానీ కోసం కక్కుర్తిపడి ఫుడ్ ఇన్స్పెక్టర్, కారు డ్రైవర్‌గా అవతారమెత్తిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్‌బాబునాయక్ పెన్నార్‌భవన్‌లోని ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు రామాంజనేయులునాయక్. బిరియానీలపై మక్కువ పెంచుకున్న వెంకటేష్‌బాబునాయక్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌గాను, రామాంజనేయులు నాయక్ ఇతని కారు డ్రైవర్‌గాను అవతారమెత్తారు. మూడు రోజుల క్రితం క్లాక్‌టవర్ సమీపంలోని హైదరాబాద్ బిరియానీ హౌస్‌కు వెళ్లి ఏడు బిరియానీ ప్యాకెట్లు పార్సిళ్లు కట్టించుకున్నారు. చదవండి: (రైతు ఇంట్లో ఐటీ దాడులు.. అపార సంపద) ఈ నెల 27వ తేదీన మరోసారి వచ్చి నాలుగు పార్సిళ్లు తీసుకున్నారు. ప్రతిసారీ ఇక్కడకు రావడమేంటని అనుమానం వచ్చిన బిర్యానీ హౌస్ నిర్వాహకుడు అబ్దుల్‌ఖలీల్‌బాషా కారు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లనే ఎదిరించి మాట్లాడుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. నిర్వాహకుడు వీరిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టగా వారు నకిలీ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్, కారు డ్రైవర్ అని తేలింది. శనివారం ఉదయం పీటీసీ సమీపంలో వెంకటేష్‌బాబునాయక్, రామాంజనేయులునాయక్‌లను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చదవండి: (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!) -
‘జొమాటో మోసాలకు పాల్పడుతోంది’
సాక్షి సిటీబ్యూరో: తమతో పాటు పలు చిన్న హోటళ్ల అకౌంట్స్ వ్యవహారంలో జొమాటో మోసాలకు పాల్పడుతోందని ముస్తఫా బిర్యానీ హౌస్ నిర్వాహహకుడు హసన్ బులుకీ అరోపించారు. సోమవారం గన్‌ఫౌండ్రీలోని మీడియా ప్లెస్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ ఫుడ్‌డెలివరీ సంస్థ జుమాటో హోటళ్లకు సమయానికి డబ్బులు చెల్లించకపోగా, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్నారు.. గత ఏడాది జుమాటోతో బిర్యానీ డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గత డిసెంబర్లో తమకు ఎలాంటి సమాచారం అందించకుండా బిర్యానీ సరఫరాపై డిస్కౌంట్లు ప్రకటించారన్నారు. దీనిపై సంస్థ ప్రతినిధులు అడగ్గా సదరు మొత్తాన్ని తమ సంస్థ భరిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అయితే అందుకు భిన్నంగా తమకు రావాల్సిన డబ్బుల్లో నుంచి తగ్గించి ఇచ్చినట్లు తెలిపారు. హోటళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడు రోజుల్లో చెల్లించాల్సి డబ్బులను 15 రోజులైన చెల్లించడం లేదని అరోపించారు. -
షాక్‌కు గురైన దొంగలు.. ఏం చేశారో తెలుసా..!
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని సరితా విహార్‌లో గల ఓ బిర్యానీ సెంటర్ ఎంతో పాపులర్. ఆ బిర్యానీ సెంటర్ కౌంటర్లో కట్టలకొద్దీ డబ్బు ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఇద్దరు దొంగలు కూడా అలాగే అనుకున్నారు. దొరికినంత దోచుకెళ్దామని మంగళవారం అర్ధరాత్రి పక్కా ప్లాన్‌తో మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. కానీ, వారికి ఊహించని షాక్ తగిలింది. బిర్యానీ సెంటర్లోకి ప్రవేశించిన రాజు సింగ్ (19), బాబీ రాజు (22)లకు ఖాళీ క్యాష్ కౌంటర్ దర్శనమిచ్చింది. గల్లా పెట్టె మొత్తం వెతికారు. కానీ, చిల్లగవ్వ కూడా దొరకలేదు. చివరికి ఉట్టి చేతులతో పోవడం ఇష్టం లేక శుష్టుగా బిర్యానీ తిన్నారు. పైగా డబ్బు చెల్లించి భోజనం చేసినట్టు తెగ బిల్డప్ కొట్టి బిర్యానీ మెక్కడం పూర్తయ్యాక మిగిలిన బిర్యానీ వంక చిరాగ్గా ఓ లుక్కేశారు. అనంతరం క్యాష్ కౌంటర్ పైన గల ఓ ల్యాప్‌టాప్‌ను తీసుకుని ఉడాయించారు. అయితే, అదే ల్యాప్‌టాప్ వారిని పట్టిస్తుందని ఆ దొంగబాబులు ఊహించలేకపోయారు. మర్నాడు ఉదయం రెస్టారెంట్ తెరచిన యజమానికి విషయం అర్ధమైంది. ఆయన పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు మొదలైంది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ల్యాప్‌టాప్ అమ్ముతుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. చివరికి రాజు, బాబీ కథ.. అనుకున్నదొక్కటీ అయిందొక్కటీ చందంగా ముగిసింది. -
బిర్యానీ హౌస్‌పై దాడులు
కరీంనగర్: నగరంలో ఓ ఐస్‌క్రీం కంపెనీ, ఓ బిర్యానీ హౌస్‌పై టాస్క్ఫోర్సు పోలీసులు, శానిటరీ విభాగం అధికారులు దాడులు చేశారు. రాంనగర్లో గల దారపునేని కృష్ణకు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ, నాసిరకపు ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేయగా ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. బిర్యానీ హౌస్‌లో... కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గల దూలం శివశంకర్‌కు చెందిన ఈ బిర్యానీ హౌస్‌లో కుళ్ళిన, దుర్వాసన వస్తున్న మాంసంతో బిర్యానీ, ఇతర పదార్ధాలు తయారు చేసి వడ్డిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు చేశారు. పది రోజులనాటి మాంసం, కుళ్ళిన, పాచిన కూరలకు దుర్గంధం రాకుండా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి వేడి చేసి వండి వడ్డిస్తున్నారు. అలాగే మిగిలిపోయిన బిర్యానీ నుంచి మాంసం ముక్కలు తీసి మళ్ళీ ఉపయోగిస్తూ వేడి బిర్యానీతో వడ్డిస్తున్నారు. వంట గది కూడా అపరిశుభ్రంగా ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అక్కడినుంచి నివేదిక రాగానే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్సు సీఐ గౌస్ బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృత శ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.