సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగివస్తున్న జంటపై దోపిడీ ముఠా దాడిలో 18 ఏళ్ల నవవధువు ప్రాణాలు కోల్పోయింది. దౌరెలా ప్రాంతంలోని మథోర్ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఊరేగింపుగా తిరిగివస్తున్న క్రమంలో వారి వాహనంపై దుండగులు దాడి చేశారు. అతిసమీపం నుంచి కాల్పులు జరపడంతో వధువు మెహ్వీష్ పర్వీన్ ఘటనా స్థలంలోనే మరణించారు. భర్త మహ్మద్ షజెబ్, ఇతర కుటుంబ సభ్యులు దాడి నుంచి తప్పించుకున్నారు. దుండగులు కారు, నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు.
తాము జాతీయ రహదారి 58పై ప్రయాణిస్తుండగా ఘజియాబాద్ సమీపంలో దోపిడీదారుల ముఠా తమ వాహనాన్ని ఆపి తనపై తుపాకీ గురిపెట్టిందని, దీంతో తన భార్య భయంతో కేకలు పెట్టగా దుండగులు ఆమె ఛాతీపై కాల్పులు జరిపారని బాధితురాలి భర్త షజిబ్ చెప్పారు. రెండు కార్లలో ఆరుగురు సాయుధ దుండగులు వివాహ బృందం వాహనాన్ని అడ్డగించి దోపిడీకి యత్నించారని, వారిని ప్రతిఘటించిన పర్వీన్‌ను కాల్చిచంపారని సీనియర్ ఎస్‌పీ మంజిల్ సైనీ తెలిపారు. పెళ్లి బృందం నుంచి కారుతో పాటు రూ లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారని చెప్పారు. సాక్షుల స్టేట్‌మెంట్లతో పాటు టోల్‌ప్లాజాల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment