bride died
-
ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశల మధ్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న జంటపై విధికి కన్ను కుట్టిందేమో.. వారి సంతోషం ఎంతసేపు నిలవలేదు నిండైన మనసుతో మనువాడి గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో వధువు మరణించగా.. వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంతా హచిన్సన్, ఆరిక్ హచిన్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. కొత్త జంట సంతోషంగా వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్ కార్టులో(మోటరైజ్డ్ వాహనం) ఊరేగింపుగా బయల్దేరారు. ఇంతలోనే వేగంగా దూసుకువచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గోల్ఫ్కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఈ ఘటనలో వధువు అక్కడికక్కడే మరణించింది. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని తేలింది. వరుడి మెదడుకు గాయమైందని, ఎముకలు విరిగిపోయాయని, రెండు బలమైన శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చిందని అతని తల్లి తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. పెళ్లైన అయిదు గంటల్లోనే ఇదంతా జరిగిపోయిందని, అరిక్ తన జీవితంతో ప్రేమను కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప.. కోడలు అంత్యక్రియలకు, కొడుకు వైద్య బిల్లులను చెల్లించడానికి సహాయం కోసం ఫండ్ రైసింగ్ మొదలు పెట్టింది.. ఇప్పటి వరకు 385,053 డాలర్ల కంటే ఎక్కవే లభించాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ జామీ కొమెరోస్కి(25)ను అరెస్ట్ చేశారు. కాగా పెళ్లైన తరువాత కొత్త జంట బంధువుల మధ్య సంతోషంగా నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి రోజే ఇంతటి ఊహించని ఘోరం జరగడంతో రెండు కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగాయి. చదవండి: ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్! -
పెళ్లిలో కుప్పకూలి వధువు మృతి.. సోదరితో వివాహం
విధి రాతను ఎవరూ మర్చలేరని అంటుంటారు. మనిషి జీవితంలో కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే విధి మరోలా తలుస్తుంది. ఒక్క ఘటన మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే పెళ్లింట విషాదాన్ని నింపింది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది.. అయినా పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడుకి వధువు కుటుంబం మరో ఆఫర్ ఇవ్వడంతో ముహుర్తం సమాయానికి వివాహం జరిగింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన జినాభాయ్ భాకాభాయ్ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, వివాహ వయసు రాగానే తన పెద్ద కూతురుకు హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌తో పెళ్లి ఫిక్స్ చేశారు. కాగా, ముహుర్తం ప్రకారం.. వీరికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని గంటల్లో పెళ్లి అనగా వరుడు విశాల్.. వధువు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరాడు. వరుడు విశాల్ ఎంతో ఆనందంలో ఎన్నో ఆశలతో బంధువులతో కలిసి బ్యాండ్ మేళాల మధ్య పెళ్లి వేడుకకు వద్దకు చేరుకున్నాడు. దీంతో, పెళ్లి ఇంట అందరూ ఎంతో ఆనందంగా ఉన్నవేళ.. పెళ్లి కూతురు ఒక్కసారిగా స్పృహ తప్పి కూప్పకూలింది. దీంతో, కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. వధువు అప్పటికే మృతిచెందినట్టు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, వధువుకు గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉన్న సమయంలో వధువు కుటుంబం.. తన కూతురు చనిపోయిన బాధను దిగమింగుకుంది. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్‌కు తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని వరుడు కుటుంబం కూడా ఒప్పుకుంది. దీంతో, హేతల్ డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచి.. మరో ముహుర్తం పెట్టించి శుక్రవారం పెళ్లి జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
వైరల్ వీడియో: పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కుప్పకూలిన వధువు.. షాక్‌లో వరుడు!
-
వీడియో: పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కుప్పకూలిన వధువు.. షాక్‌లో వరుడు!
పెద్దలు వారిద్దరికీ వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుకకు బంధువులందరూ విచ్చేశారు. అటు మండపంలో పూజరి పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. తన పెళ్లి తంతు కోసం వరుడు ఎంతో సంతోషంతో ఎదురుచూస్తున్నాడు. తీరా తాళి కట్టే సమయానికి వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. భద్వానా గ్రామానికి చెందిన రాజ్‌పాల్ కూతురు శివాంగికి వివేక్‌తో పెద్దలు పెళ్లి ఖయం చేశారు. పెళ్లి జరుగుతున్న క్రమంలో వధువు.. వరుడి మెడలో పూలమాల వేస్తున్న సందర్బంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో, అక్కడున్న వారంతా టెన్షన్‌కు గురయ్యారు. ఏం జరిగిందో.. అని అటు వరుడు కూగా కంగారుపడ్డారు. అనంతరం, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శివాంగిని పరిశీలించిన వైద్యులు మార్గమధ్యంలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా, గుండెపోటు కారణంగా వధువు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, వధువు మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వధువు మృతి తర్వాత దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఘటనా ప్రాంతానికి పంపామని మలిహాబాద్ స్టేషన్ అధికారి సుభాస్ చంద్ర సరోజ్ తెలిపారు. Heart-breaking news coming in from Lucknow, Uttar Pradesh. Daughter of Rajpal of Bhadwana village, Shivangi Sharma, the 21-year-old bride, collapsed during her wedding in Malihabad and dies of cardiac arrest. pic.twitter.com/y5eWHrAmbM — Sanjay (@sanjaykumarpv) December 4, 2022 -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు దుర్మరణం.. తల్లి కళ్లెదుటే ఘోరం
యడ్లపాడు: మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్ద జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీరత్న(24) బీకాం పూర్తిచేసి స్థానికంగా బీఎస్ఎన్ఎల్ ఆధార్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమెకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. మంగళవారం మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి తల్లి నాగలక్ష్మితో కలిసి స్కూటీపై సాయిలక్ష్మీ రత్న బయలుదేరింది. యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్దకు వచ్చేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు కింద, స్కూటీకి మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సాయిలక్ష్మీరత్న అక్కడే దుర్మరణం చెందింది. వెనుక కూర్చున్న తల్లి నాగలక్ష్మి తల, నుదురు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. కళ్లముందే రక్తపు మడుగులో కూతురు పడి ఉండడాన్ని చూసి నాగలక్ష్మి అపస్మారక స్థితికి వెళ్లింది. పోలీసులు చేరుకుని బస్సుకింద ఇరుక్కుపోయిన సాయిలక్ష్మీరత్నను క్రేన్ సాయంతో వెలికితీశారు. నాగలక్ష్మిని 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్ఐ పైడి రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. హైవేపే దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొని ఉండవచ్చని భావిస్తున్నారు. -
కల్యాణ మండపంలో నవ వధువు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు టెస్టులు నిర్వహించిన తర్వాత వైద్యులు రిపోర్టు అందించారు. ఈ రిపోర్టు అందిన తర్వాత పీఎం పాలెం సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. సృజన పాయిజన్ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని తెలిపారు. అయితే, పాయిజన్ ఎందుకు తీసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విశాఖ నార్త్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాము. సృజన అన్నౌన్ పాయిజన్ తీసుకొని చనిపోయినట్లు ఇండస్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు లభించింది. అది ఎలా వచ్చింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నాము. ఇప్పటికే కొంతమందిని విచారించాం. సృజనా మృతిలో వాస్తవాలు తెలియాలంటే ఆమె తల్లిదండ్రులు కూడా వాస్తవాలు చెప్పాలి. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము’’ అని అన్నారు. అయితే, బుధవారం రాత్రి పెళ్లి సందర్భంగా నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతకు ముందు వధువు మృతిపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం -
డెంగీతో పెళ్లికూతురు మృతి
-
పెళ్లి కూతురును కబళించిన డెంగీ
సాక్షి, పాలసముద్రం(చిత్తూరు): కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతిని డెంగీ జ్వరం బలితీసుకుంది. మూడుముళ్ల బంధంతో నూరేళ్లు సంసార జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవాల్సిన వేళ...పెళ్లికూతురిని డెంగీ జ్వరం కబళించింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళ అలియాస్ కావ్య (18) గత నెల 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగీ సోకింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు బంధుమిత్రులు, గ్రామస్థులు బుధవారం పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఎలాగైనా ఆసుపత్రి నుంచి వధువును తీసుకొచ్చి తాళి కట్టించాలని పెద్దలు ప్రయత్నించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి ఆగింది. శుక్రవారం ఆమె మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానానికి పంపించాల్సి వచ్చిందంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే అధికారులు మాత్రం అది డెంగీ కాదని జ్వరం కారణంగా చనిపోయిందని చెబుతున్నారు. బాలుడిని మింగిన డెంగీ మదనపల్లె టౌన్: డెంగీతో బాలుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం మదనపల్లెలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు, పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న మణికంఠరెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి (5) మూడు రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా జ్వరం తగ్గలేదు. గురువారం నుంచి జ్వరం తీవ్రం కావడంతోపాటు కడుపు నొప్పితో వాంతులు, విరేచనాలు చేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. కన్నుమూసిన బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అయ్యో.. హారికా..!
సుల్తానాబాద్(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్‌కు వెళ్లింది. పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ ఢీకొని నవ వధువు దుర్మరణం
మోహిద్దీన్‌పురం (అర్థవీడు): ట్రాక్టర్ ప్రమాదంలో నవ వధువు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మోహిద్దీన్‌పురం–నాగులవరం మధ్య ఆదివారం జరిగింది. వివరాలు.. అర్థవీడు మండలం బొల్లుపల్లికి చెందిన షేక్ ఇబ్రహీం సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ రషీద (19)తో గత నెల 15వ తేదీన వివాహం జరిగింది. కంభంలోని బంధువుల ఇంట విందుకు హాజరయ్యేందుకు భార్యతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. బొల్లుపల్లె నుంచి మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ వెనుక వైపు నుంచి బైకును ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చొని ఉన్న రషీద ట్రాక్టర్ కింద పడింది. తీవ్రంగా గాయపడిన రషీద అక్కడికక్కడే మృతి చెందింది. ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నవ దంపతుల ఇంట విషాదం పెళ్లి జరిగి 20 రోజులు కాక ముందే నవ వధువును మృత్యువు కబళించింది. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో భర్త గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు మూడో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి పంపించారు. నవ దంపతులు తమ ఇంటికొస్తారని వారి కోసం వంటల వండి సిద్ధం చేసిన బంధువులకు వధువు చనిపోయిందన్న వార్త తెలియడంతో వారి ఇంట విషాదం నెలకొంది. మరణ వార్త తెలుసుకున్న బంధువులు కొత్తపేట, బొల్లుపల్లి, కంభం, బేస్తవారిపేట నుంచి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలి వచ్చారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. -
పారాణింకా ఆరకముందే..
కర్నూలు, వెల్దుర్తి: పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతిచెందింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం పెండేకల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బేతంచెర్లకు చెందిన అంజుమ్ కౌర్(22), కర్నూలుఅజముద్దీన్ నగర్‌కు చెందిన ఎజాజ్‌కు డిసెంబర్ 30న నిఖా(పెళ్లి) వధువు స్వగృహంలో జరిగింది. కర్నూలులో వలిమా(మరలు పెళ్లి) అనంతరంవధూవరులుబేతంచెర్లకు చేరుకున్నారు. మంగళవారం వెల్దుర్తిలో ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత రాత్రి నూతన వధూవరులు ఒక బైక్‌పై, బంధువులు ఇతర బైక్‌లపై బేతంచెర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. సర్పరాజాపురం మిట్ట అవతల పెండేకల్ సమీపాన మలుపుల వద్ద ఎదురుగా వచ్చిన కౌతాళం ఎంపీడీఓ మురళీమోహన మూర్తి కారు వధూవరుల బైక్‌ను ఢీకొంది. ఆయన సొంతూరైన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి కౌతాళంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన నవవధువు అంజుమ్ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంట బైక్‌లపై వచ్చిన బంధువులు గమనించి వెంటనే ఆమెను కర్నూలు తీసుకెళ్లారు. మొదట ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక అర్ధరాత్రి మృతిచెందింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇస్మాయిల్, మున్ని, ఇరువురు చెల్లెళ్లు, తమ్ముడు, బంధువుల రోదనలుమిన్నంటాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బేతంచెర్లకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ మురళీ మోహన మూర్తిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పులిశేఖర్ తెలిపారు. -
వివాహమైన మూడు నెలలకే..
చెన్నై, తిరువళ్లూరు: వివాహమైన మూడు నెలలకే నవ వధువు అనుమానస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి(29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ సత్తరై గ్రామానికి చెందిన కృష్ణస్వామి నాడార్ కుమారుడు యువరాజ్‌తో గత సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. ఈ క్రమంలో గత దీపావశికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. వివాహమై మొదటి దీపావళి కావడంతో పెళ్లికొడుకుకు బంగారు నగలు ఇవ్వడం సంప్రదాయం. అయితే రూపవతి తల్లిదండ్రులు యువరాజ్‌కు బంగారు నగలు ఇవ్వలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం రూపవతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి దీపావళి కానుకలను వెంటనే తీసుకుని రావాలని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 4.45 గంటలకు మప్పేడు పోలీసులు ఫోన్ చేసి రూపవతి మరణించినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సత్తరైకు వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని కోరారు. ఇందుకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన యువరాజ్ బంధువులు మృతదేహం సవితా వైద్యశాల్లో ఉందని, కడుపునొప్పితో ఉందని వైద్యశాలలో చేరిస్తే మృతి చెందిందని సమాధానం ఇచ్చారు. దీంతో సవిత వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే మప్పేడు పోలీసులు మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం ఉదయం వైద్యశాల వద్దకు చేరుకున్న యువతి బంధువులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని న్యాయం చేయాలని కోరుతూ బోరున విలపించారు. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహమై మూడు నెలలు పూర్తి కాకుండానే నవ వధువు మృతి చెందిన సంఘటనపై ఆర్డీఓ విచారణ చేపట్టనున్నారు. -
పెళ్లి పీటలపై వధువు మృతి
అచ్చంపేట రూరల్: కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి.. తాళి కట్టించుకున్న కొద్దినిముషాలకే పెళ్లిపీటలపై కుప్పకూలి కన్ను మూసింది. తాళి కార్యక్రమం ముగిశాక.. అరుంధతి నక్షత్రాన్ని చూసేందుకు బయటకు రావాలని పురోహితుడు కోరగా, పైకి లేస్తున్న క్రమంలో ఆ యువతి పెళ్లి వేదికపై కింద పడిపోయింది. బంధువులు ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మృతి చెందింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో కొండి నిరంజన్, శంకరమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు కుమారులతో పాటు తండ్రి నిరంజన్ చనిపోయారు. చిన్న కుమార్తె లక్ష్మి అలియాస్ నిరంజనమ్మ(20)కు వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్ కుమారుడు బాగాడి వెంకటేశ్‌తో కుటుంబీకులు వివాహం నిశ్చయించారు. శనివారం ఉదయం 11 గంటలకు వధువు ఇంటి వద్ద మహేంద్రనగర్ కాలనీలోనే పెళ్లి వేడుక నిర్వహించారు. వరుడు తాళి కట్టిన అనంతరం అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి బయటకు రావాలని నూతన జంటను పురోహితుడు పిలిచాడు. వధువు లక్ష్మి పైకి లేవడానికి ప్రయత్నించి అకస్మాత్తుగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న లక్ష్మి కుప్పకూలవడంతో బంధువులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వధువు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పరశురాం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, కోట కిషోర్, హుస్సేన్ తదితరులు పరామర్శించారు. -
పెళ్ళి జరిగిన కాసేపటికే వధువు మృతి
-
అరుంధతీ నక్షత్రం చూస్తూ కుప్పకూలిన వధువు!
సాక్షి, నాగర్‌కర్నూల్ : పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు బాజా భజంత్రీలు.. వింధు భోజనాలతో ఆహ్లాదకరంగా సాగిన ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విచారక ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివాహమనంతరం ఆనవాయితీగా వరుడు అరుంధతి నక్షత్రాన్ని వధువుకు చూపిస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బంధువులు వధువు బుజ్జి(23)ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ వధువు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ ఇరుకుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోయాయి. గుండెపోటుతోనే నవ వధువు మరణించిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంలో అసలేం జరిగిందనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే అమ్మాయి ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అరుంధతీ చూస్తూ భర్త కాళ్ల మీద పడి కుప్పకూలిపోవడం పలువుర్ని కంటతడిపెట్టిస్తోంది. -
పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్తూ..
మరో ఐదు రోజుల్లో ఆ ఇంట వివాహం జరగాల్సి ఉంది. ఆ ఆనందంలో ఇటు వరుడు, అటు వధువు ఇళ్లల్లో సందడి నెలకొంది. పెళ్లి పనుల్లో భాగంగా వరుడే తన వివాహ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టేందుకు సోమవారం బయలుదేరాడు. మార్గంలో శునకం రూపంలో మృత్యువు అడ్డుపడింది.అంతే వరుడు నడుపుతున్న మోటారుబైక్ పల్టీ కొట్టింది. పెళ్లి కావాల్సిన వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనతో ఇటు వరుడింట..అటు వధువు ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...మక్కువ/సీతానగరం: మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడెక్కాడు. మృత్యువు శునకం రూపంలో ఎదురొచ్చి పెళ్లి కొడుకు ప్రాణాలను హరించింది. దీంతో పెళ్లి జరగాల్సిన రెండు కుటుంబాల్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్లే...మండలంలోని శాంతేశ్వరం గ్రామానికి చెందిన మరిశర్ల మాధవరావు(27) బొబ్బిలి పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని, పార్వతీపురం మండలం కృష్ణాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి మాధవరావు తల్లిదండ్రులు వెళ్లడంతో, మాధవరావు కూడా వారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి సోమవారం తన పెళ్లి కార్డులను పంపిణీ చేసేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా శునకం అడ్డంగా రావడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయాడు.వెంటనే గుర్తు తెలియని వాహనం మాధవరావును బలంగా ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. విజయనగరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా మాధవరావు మృతి చెందాడు. ఎస్ఐ డి.సాయికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లింట విషాదం...మాధవరావు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఈ నెల 30న వివాహం జరగాల్సి ఉంది. కొమరాడ మండల కేంద్రానికి చెందిన రేణుకతో వివాహం నిశ్చయమైంది. ఒక్కగానొక్క కుమారుడు వివాహాన్ని ఘనంగా జరపాలని, కళ్లారా చూసి ఆనందించాలని ఎదురు చూసిన తల్లిదండ్రులకు మాధవరావు మృతి చెందాడన్న వార్త అశనిపాతమైంది.దీంతో తల్లిదండ్రులు సీతంనాయుడు, పైడితల్లిమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ ఇంట విషాదం నెలకొంది. మరోవైపు పెళ్లి కూతురింట కూడా విషాదం అలముకొంది. రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిలిపోయింది. -
నవవధువును కిరాతకంగా..
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగివస్తున్న జంటపై దోపిడీ ముఠా దాడిలో 18 ఏళ్ల నవవధువు ప్రాణాలు కోల్పోయింది. దౌరెలా ప్రాంతంలోని మథోర్ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఊరేగింపుగా తిరిగివస్తున్న క్రమంలో వారి వాహనంపై దుండగులు దాడి చేశారు. అతిసమీపం నుంచి కాల్పులు జరపడంతో వధువు మెహ్వీష్ పర్వీన్ ఘటనా స్థలంలోనే మరణించారు. భర్త మహ్మద్ షజెబ్, ఇతర కుటుంబ సభ్యులు దాడి నుంచి తప్పించుకున్నారు. దుండగులు కారు, నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. తాము జాతీయ రహదారి 58పై ప్రయాణిస్తుండగా ఘజియాబాద్ సమీపంలో దోపిడీదారుల ముఠా తమ వాహనాన్ని ఆపి తనపై తుపాకీ గురిపెట్టిందని, దీంతో తన భార్య భయంతో కేకలు పెట్టగా దుండగులు ఆమె ఛాతీపై కాల్పులు జరిపారని బాధితురాలి భర్త షజిబ్ చెప్పారు. రెండు కార్లలో ఆరుగురు సాయుధ దుండగులు వివాహ బృందం వాహనాన్ని అడ్డగించి దోపిడీకి యత్నించారని, వారిని ప్రతిఘటించిన పర్వీన్‌ను కాల్చిచంపారని సీనియర్ ఎస్పీ మంజిల్ సైనీ తెలిపారు. పెళ్లి బృందం నుంచి కారుతో పాటు రూ లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారని చెప్పారు. సాక్షుల స్టేట్మెంట్లతో పాటు టోల్‌ప్లాజాల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదం.. నవవరుడు మృతి
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడు సమీపంలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నవ వరుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలివి.. అనకాపల్లి శారదానగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తికి మూడు రోజుల క్రితం వివాహం అయినట్లు తెలుస్తోంది. దంపతులు ఇద్దరు సియాజ్ కారులో అనకాపల్లి నుంచి పాసర్ల వైపు బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న దంపతుల కారు గోకులపాడు సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వరుడు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి పార్టీలో కాల్పులు.. వధువు మృతి
చంఢీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్లో గత శనివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన చరణ్‌జిత్ తన కూతురు సాక్షి అరోరా వివాహం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకను వధువు భవనంపై నుంచి తిలకిస్తోంది. ఇంతలో పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఒకరు అత్యుత్సాహంతో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోని ఓ బుల్లేట్ భవనంపై ఉన్న వధువు తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతురాలి తండ్రి చరణ్‌జిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేశారు. చరణ్ జిత్ స్నేహితుడు, నిందితుడైన ఖోస్లాను అరెస్టు చేసి లైసెన్స్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. ఇక వివాహ వేడుకల్లో గన్ కల్చర్ శృతి మించుతోంది. గతంలో హర్యానాలోని ఓ పెళ్లి సంగీత్‌లో ఇలానే అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో వరుడు మృతి చెందాడు. -
లారీ,ఆటో ఢీ: ఇద్దరి మృతి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు సహా మరొకరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఐరాల మండలం బొబ్బాయివారిపల్లె వద్ద చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నవ వధూవరుల ఆత్మహత్యాయత్నం.. వధువు మృతి
అనంతపురం(తాడెపత్రి): పెళ్లి అయి మూడు రోజుల కూడా కాకుండానే నూతన వధూవరులు ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన జంటలో వ ధువు మృతిచెందగా వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి లోని నంద్యాల రోడ్డు కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రికి చెందిన పకీరప్ప(25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి(20)తో ఈ నెల 8న వివాహమైంది. అయిత బుధ వారం నూతన వధూవరులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో పడిఉన్న జంట కనిపించింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే నూతన వధువు విజయలక్ష్మి చనిపోగా.. వరుడు పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
పెళ్లింట విషాదం ..
*పెళ్లికుమార్తె సహా నలుగురు మృతి *మరో మహిళకు సీరియస్ *గురువారం తెల్లవారుజామున గుంటూరులో పెళ్లి *స్వస్థలం చల్లపల్లి నుంచి వెళుతుండగా ఘోరం *తోట్లవల్లూరు మండలం రొయ్యూరు కరకట్ట వద్ద ఘటన అప్పటివరకు మేళతాళాలు, బాజాభజంత్రీలు, పెళ్లిసందడితో కళకళలాడిన ఆ ఇంట్లో విషాదం అలముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన తరుణంలో కారు ప్రమాదం రూపంలో పెళ్లి కూతురు సహా నలుగురిని మృత్యువు కబళించింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరిన గంట సేపటికే ఈ దుర్ఘటన జరిగిందన్న వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు నిశ్చేష్టులయ్యారు. తోట్లవల్లూరు : మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువతిని మృత్యువు కబళించింది. అప్పటివరకు బంధుమిత్రులతో ఆనందోత్సాహాలు నిండిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన ఓ పెళ్లిబృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న పెళ్లికూతురు బాలాకుమారి, ఆమె స్నేహితురాలు నాగచంద్రిక అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారు నడిపిన సోమశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కారు నడుపుతున్న వ్యక్తి కుమారుడు సన్నీ కాలువలో పడి గల్లంతవగా, ఆ తర్వాత అదేచోట మృతదేహం లభించింది. కారు నడుపుతున్న వ్యక్తి భార్య పద్మ చావుబతుకుల్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె బాలాకుమారి (అమ్ములు) వివాహం గుంటూరుకు చెందిన ఆనంద్‌తో నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. ముందురోజు బుధవారం రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు సమీప బంధువు పామర్తి సోమశేఖర్‌కు చెందిన కారులో కృష్ణా కరకట్టపై పెళ్లికుమార్తె బాలాకుమారి (26), ఆమె స్నేహితురాలు నాగచంద్రిక (34), సోమశేఖర్ భార్య పద్మ, కుమారుడు రోహన్ అలియాస్ సన్నీ (8)తో కలిసి బుధవారం సాయంత్రం గుంటూరుకు బయలుదేరారు. 4.30 గంటల సమయంలో కారు తోట్లవల్లూరు మండలం రొయ్యూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి కుడివైపున ఉన్న కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్‌కెనాల్ (కేఈబీ) కాలువలోకి దూసుకుపోయింది. కారు దూసుకుపోతూ పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న పెళ్లికూతురు, ఆమె స్నేహితురాలు మృత్యువాతపడ్డారు. కారు నీటిలో మునగటంతో బాలుడు సన్నీ గల్లంతయ్యాడు. గాయపడ్డ సోమశేఖర్, ఆయన భార్య పద్మను హుటాహుటిన అంబులెన్స్‌లో కానూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సోమశేఖర్ విజయవాడలోని ఆర్మ్డ్ రిజర్వులో కానిస్టేబుల్‌గా ఉన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు... ప్రమాదంస్థలంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చటంతో పాటు గాయపడిన వారిని కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, తహశీల్దార్ జి.భద్రు, ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్ఐ డి.సురేష్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలంలో పరిస్థితి చూసి బంధువులు భోరున విలపించారు. కాళ్లపారాణి ఆరకముందే తమ కుమారతున మృత్యువు కబళించటాన్ని పెళ్లికుమార్తె తండ్రి సాంబయ్య, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనతో వారి రోదనలు మిన్నంటాయి. -
కాళ్లపారాణి ఆరకముందే..
ముషీరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ నవవధువు మృతిచెందింది. కాళ్లపారాణి ఆరకముందే కూతురు మృతి చెందడంతో తల్లిదండులు కన్నీరుమున్నీరయ్యారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, బంధువుల కథనం ప్రకారం... తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఆవుల శంకర్‌కు నార్కట్‌పల్లికి చెందిన లక్ష్మీప్రసన్న (21)తో 2014, మే 11న పెళ్లైంది. కట్నకానులకు కింద మొత్తం రూ.14.5 లక్షలు ముట్టజెప్పారు. శంకర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్. నవదంపతులు రాంనగర్ రామాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆ ఇంట్లో పది రోజులు ఉన్నాక.. చుట్టుపక్కల వారు ఆ ఇంట్లో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇదే సమయంలో తమకు ఎప్పుడో ఏదో ఆందోళనగా ఉంటోందని, భయమేస్తోందని చెప్పిన భార్యాభర్త.. ఆ ఇంటిని ఖాళీ చేసి బర్కత్‌పురలో ఉంటున్న లక్ష్మీప్రసన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ పది రోజులుండి ఆదివారం మధ్యాహ్నం రాంనగర్లో గతంలో తాముండే ప్రాంతంలోనే మరో ఇంట్లో అద్దెకు దిగారు. రాత్రి పది గంటల వరకు సామగ్రి సర్దుకొని పడుకున్నారు. రాత్రి ఒంటి గంటకు, మళ్లీ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య మూత్ర విసర్జనకు లేవడంతో ఆమెను బాత్రూంకు తీసుకెళ్లాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మీప్రసన్న అపస్మారకస్థితికి జారుకోవడంతో భర్త వెంటనే అమ్మమ్మకు, మేనమామకు ఫోన్ చేసి సమీపంలోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీప్రసన్న మృతి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు, గాంధీ మార్చురీకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.