కాళ్లపారాణి ఆరకముందే..
ముషీరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ నవవధువు మృతిచెందింది. కాళ్లపారాణి ఆరకముందే కూతురు మృతి చెందడంతో తల్లిదండులు కన్నీరుమున్నీరయ్యారు. ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి, బంధువుల కథనం ప్రకారం... తిప్పర్తి మండలం ఇండ్లూరుకు చెందిన ఆవుల శంకర్‌కు నార్కట్‌పల్లికి చెందిన లక్ష్మీప్రసన్న (21)తో 2014, మే 11న పెళ్లైంది. కట్నకానులకు కింద మొత్తం రూ.14.5 లక్షలు ముట్టజెప్పారు. శంకర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్. నవదంపతులు రాంనగర్ రామాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆ ఇంట్లో పది రోజులు ఉన్నాక.. చుట్టుపక్కల వారు ఆ ఇంట్లో గతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఇదే సమయంలో తమకు ఎప్పుడో ఏదో ఆందోళనగా ఉంటోందని, భయమేస్తోందని చెప్పిన భార్యాభర్త.. ఆ ఇంటిని ఖాళీ చేసి బర్కత్‌పురలో ఉంటున్న లక్ష్మీప్రసన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ పది రోజులుండి ఆదివారం మధ్యాహ్నం రాంనగర్‌లో గతంలో తాముండే ప్రాంతంలోనే మరో ఇంట్లో అద్దెకు దిగారు. రాత్రి పది గంటల వరకు సామగ్రి సర్దుకొని పడుకున్నారు. రాత్రి ఒంటి గంటకు, మళ్లీ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య మూత్ర విసర్జనకు లేవడంతో ఆమెను బాత్‌రూంకు తీసుకెళ్లాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మీప్రసన్న అపస్మారకస్థితికి జారుకోవడంతో భర్త వెంటనే అమ్మమ్మకు, మేనమామకు ఫోన్ చేసి సమీపంలోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీప్రసన్న మృతి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు, గాంధీ మార్చురీకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.