
ఇన్‌సెట్‌లో వధువు బుజ్జి
సాక్షి, నాగర్‌కర్నూల్ : పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు బాజా భజంత్రీలు.. వింధు భోజనాలతో ఆహ్లాదకరంగా సాగిన ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విచారక ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివాహమనంతరం ఆనవాయితీగా వరుడు అరుంధతి నక్షత్రాన్ని వధువుకు చూపిస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బంధువులు వధువు బుజ్జి(23)ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ వధువు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ ఇరుకుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోయాయి.
గుండెపోటుతోనే నవ వధువు మరణించిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంలో అసలేం జరిగిందనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే అమ్మాయి ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అరుంధతీ చూస్తూ భర్త కాళ్ల మీద పడి కుప్పకూలిపోవడం పలువుర్ని కంటతడిపెట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment