మృతికి కొద్ది నిమిషాల ముందు వెంకటేశ్‌తో లక్ష్మి
అచ్చంపేట రూరల్: కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి.. తాళి కట్టించుకున్న కొద్దినిముషాలకే పెళ్లిపీటలపై కుప్పకూలి కన్ను మూసింది. తాళి కార్యక్రమం ముగిశాక.. అరుంధతి నక్షత్రాన్ని చూసేందుకు బయటకు రావాలని పురోహితుడు కోరగా, పైకి లేస్తున్న క్రమంలో ఆ యువతి పెళ్లి వేదికపై కింద పడిపోయింది. బంధువులు ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మృతి చెందింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో కొండి నిరంజన్, శంకరమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు కుమారులతో పాటు తండ్రి నిరంజన్ చనిపోయారు.
చిన్న కుమార్తె లక్ష్మి అలియాస్ నిరంజనమ్మ(20)కు వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్ కుమారుడు బాగాడి వెంకటేశ్‌తో కుటుంబీకులు వివాహం నిశ్చయించారు. శనివారం ఉదయం 11 గంటలకు వధువు ఇంటి వద్ద మహేంద్రనగర్ కాలనీలోనే పెళ్లి వేడుక నిర్వహించారు. వరుడు తాళి కట్టిన అనంతరం అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి బయటకు రావాలని నూతన జంటను పురోహితుడు పిలిచాడు. వధువు లక్ష్మి పైకి లేవడానికి ప్రయత్నించి అకస్మాత్తుగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న లక్ష్మి కుప్పకూలవడంతో బంధువులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వధువు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ పరశురాం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ తులసీరాం, టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహగౌడ్, కోట కిషోర్, హుస్సేన్ తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment