మృతి చెందిన మాధవరావు
మరో ఐదు రోజుల్లో ఆ ఇంట వివాహం జరగాల్సి ఉంది. ఆ ఆనందంలో ఇటు వరుడు, అటు వధువు ఇళ్లల్లో సందడి నెలకొంది. పెళ్లి పనుల్లో భాగంగా వరుడే తన వివాహ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టేందుకు సోమవారం బయలుదేరాడు. మార్గంలో శునకం రూపంలో మృత్యువు అడ్డుపడింది.
అంతే వరుడు నడుపుతున్న మోటారుబైక్ పల్టీ కొట్టింది. పెళ్లి కావాల్సిన వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనతో ఇటు వరుడింట..అటు వధువు ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...
మక్కువ/సీతానగరం: మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడెక్కాడు. మృత్యువు శునకం రూపంలో ఎదురొచ్చి పెళ్లి కొడుకు ప్రాణాలను హరించింది. దీంతో పెళ్లి జరగాల్సిన రెండు కుటుంబాల్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్లే...మండలంలోని శాంతేశ్వరం గ్రామానికి చెందిన మరిశర్ల మాధవరావు(27) బొబ్బిలి పట్టణంలోని గ్రోత్ సెంటర్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని, పార్వతీపురం మండలం కృష్ణాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి మాధవరావు తల్లిదండ్రులు వెళ్లడంతో, మాధవరావు కూడా వారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి సోమవారం తన పెళ్లి కార్డులను పంపిణీ చేసేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా శునకం అడ్డంగా రావడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయాడు.
వెంటనే గుర్తు తెలియని వాహనం మాధవరావును బలంగా ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. విజయనగరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా మాధవరావు మృతి చెందాడు. ఎస్‌ఐ డి.సాయికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లింట విషాదం...
మాధవరావు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఈ నెల 30న వివాహం జరగాల్సి ఉంది. కొమరాడ మండల కేంద్రానికి చెందిన రేణుకతో వివాహం నిశ్చయమైంది. ఒక్కగానొక్క కుమారుడు వివాహాన్ని ఘనంగా జరపాలని, కళ్లారా చూసి ఆనందించాలని ఎదురు చూసిన తల్లిదండ్రులకు మాధవరావు మృతి చెందాడన్న వార్త అశనిపాతమైంది.
దీంతో తల్లిదండ్రులు సీతంనాయుడు, పైడితల్లిమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ ఇంట విషాదం నెలకొంది. మరోవైపు పెళ్లి కూతురింట కూడా విషాదం అలముకొంది. రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment