makkuva
-
పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్తూ..
మరో ఐదు రోజుల్లో ఆ ఇంట వివాహం జరగాల్సి ఉంది. ఆ ఆనందంలో ఇటు వరుడు, అటు వధువు ఇళ్లల్లో సందడి నెలకొంది. పెళ్లి పనుల్లో భాగంగా వరుడే తన వివాహ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టేందుకు సోమవారం బయలుదేరాడు. మార్గంలో శునకం రూపంలో మృత్యువు అడ్డుపడింది. అంతే వరుడు నడుపుతున్న మోటారుబైక్ పల్టీ కొట్టింది. పెళ్లి కావాల్సిన వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనతో ఇటు వరుడింట..అటు వధువు ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... మక్కువ/సీతానగరం: మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు పాడెక్కాడు. మృత్యువు శునకం రూపంలో ఎదురొచ్చి పెళ్లి కొడుకు ప్రాణాలను హరించింది. దీంతో పెళ్లి జరగాల్సిన రెండు కుటుంబాల్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్లే...మండలంలోని శాంతేశ్వరం గ్రామానికి చెందిన మరిశర్ల మాధవరావు(27) బొబ్బిలి పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని, పార్వతీపురం మండలం కృష్ణాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి మాధవరావు తల్లిదండ్రులు వెళ్లడంతో, మాధవరావు కూడా వారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి సోమవారం తన పెళ్లి కార్డులను పంపిణీ చేసేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా శునకం అడ్డంగా రావడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయాడు. వెంటనే గుర్తు తెలియని వాహనం మాధవరావును బలంగా ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. విజయనగరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా మాధవరావు మృతి చెందాడు. ఎస్ఐ డి.సాయికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట విషాదం... మాధవరావు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. ఈ నెల 30న వివాహం జరగాల్సి ఉంది. కొమరాడ మండల కేంద్రానికి చెందిన రేణుకతో వివాహం నిశ్చయమైంది. ఒక్కగానొక్క కుమారుడు వివాహాన్ని ఘనంగా జరపాలని, కళ్లారా చూసి ఆనందించాలని ఎదురు చూసిన తల్లిదండ్రులకు మాధవరావు మృతి చెందాడన్న వార్త అశనిపాతమైంది. దీంతో తల్లిదండ్రులు సీతంనాయుడు, పైడితల్లిమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ ఇంట విషాదం నెలకొంది. మరోవైపు పెళ్లి కూతురింట కూడా విషాదం అలముకొంది. రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిలిపోయింది. -
ఆనాటి ఆ స్నేహమానందగీతం
1992–93 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ 23 ఏళ్ల అనంతరం కలిసిన పూర్వ విద్యార్థులు మక్కువ :ఎదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..ఈ గాలిలో.. ఈ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి.. అంటూ బాల్యం మిగిల్చిన మధురానుభవాలను ఒక కవి అక్షరీకరించాడు. బాల్యం ఎన్నో మధునుభవాల సమాహారం. ఎన్నో అద్భుతాల సమ్మేళనం. ఎన్నేళ్లయినా మరిచిపోలేని జ్ఞాపకం. ఎక్కడెక్కడో స్థిరపడిన వారినీ లాక్కొచ్చే తారకమంత్రం. కాబట్టే సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. చిన్ననాటి స్నేహితుల్ని చూసి మురిసిపోయారు. అక్షరాలు నేర్పిన గురువుల్ని సన్మానించుకున్నారు. 23 ఏళ్ల క్రితం పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం కలుసుకున్నారు. దానికి వేదికైంది మక్కువలోని సాయి భగవాన్ కల్యాణ మండపం. ఆద్యంతం ఆకట్టుకుంది మక్కువ జెడ్పీ పాఠశాలలో 1992–93 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల అరుదైన సమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. అప్పటి బ్యాచ్ విద్యార్థులైన నాని, ప్రసాద్, సత్యనారాయణ కషితో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి నాటి మిత్రులంతా ఎక్కడెక్కడినుంచో తరలి వచ్చారు. అప్పటి గురువులు లలిత, యర్రా సింహాచలం, రెడ్డి సత్యమూర్తి, వి.హరిమాస్టార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గురువులు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్నేహితులను ఆదుకోవాలని సూచించారు. 2019లో సిల్వర్ జూబ్లీ వేడుక తమ బ్యాచ్ విద్యార్థులతో 2019లో 25ఏళ్ల సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. అంతకుముందు పూర్వవిద్యార్థులంతా తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ప్రస్తుత విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పించారు. పాఠశాలలో వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు. స్నేహితులను ఆదుకుంటా: బత్తుల వెంకట లోకేష్, సైంటిస్ట్, యూఎస్ఏ యూఎస్ఏలో ఎమ్డీ ఆండర్స్సన్ క్యాన్సర్ సెంటర్లో సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. మక్కువ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1992–93 బ్యాచ్ స్నేహితుల జాబితా సేకరిస్తా. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తా. నాకు తోచిన సాయం చేస్తా. పాఠశాలలో సదుపాయాలు కల్పిస్తాం:జన్ని నాని, ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి మేం చదువుకున్న పాఠశాలలో సదుపాయాల కల్పనకు కషి చేస్తాం. మేం చేయబోయే అంశాలను త్వరలో ప్రకటిస్తాం. ఉపాధ్యాయిని కావడం అదష్టం: మేళాపు కాంచన, క్రాఫ్ట్ టీచర్, జెడ్పీ హైస్కూల్, మక్కువ చదువుకున్న పాఠశాలలోనే క్రాఫ్ట్ టీచర్‌గా పనిచేయడం పూర్వ జన్మసుకతం. ఈరోజు మేమంతా ఇలా ఉన్నామంటే మా గురువులే పుణ్యమే. మిత్రుల కష్టసుఖాలను పంచుకోవాలి: వి.ఉమాదేవి, ఫిజిక్స్ లెక్చరర్, ఎస్టీ గురుకుల పాఠశాల, పి.కోనవలస ఎక్కడున్నా మిత్రుల కష్టసుఖాలను పంచుకోవాలి. ఫిజిక్స్ లెక్చరర్‌గా స్థిరపడేందుకు అప్పటి గురువుల బోధనే కారణం. ఒకే వేదికపై గురువులు, పూర్వవిద్యార్థులం కలుసుకోవడం ఆనందంగా ఉంది. -
రేషన్ బియ్యం స్వాధీనం
మక్కువ: శ్రీదేవి థియేటర్ సమీపంలోని మూడు రోడ్ల కూడలి వద్ద శనివారం అర్థరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పీఎస్ఐ పి.రమేష్‌నాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తోటవలస గ్రామం నుంచి సీతానగరం మండలానికి రేషన్ బియ్యాన్ని మేక్స్వ్యాన్లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో మాటువేసి పట్టుకున్నారు. వ్యాన్‌లో 50 కేజీల సంచుల్లో సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నింపి టార్పాలిన్ కప్పి తరలిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని తహసీల్దార్‌కు అప్పగిస్తామని పీఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట
మక్కువ (విజయనగరం): నీటి సంఘం ఎన్నికల విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఏ.వెంకంపేట గ్రామంలో నీటి సంఘం అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడింది. దీంతో వాయిదా తీర్మానం చేస్తుండగా ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. -
మక్కువలో చోరీ
మక్కువ (విజయనగరం) : ఓ ఇంట్లో చొరబడిన వ్యక్తులు బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన విజయనగరం జిల్లా మక్కువలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత స్టేట్ బ్యాంకు వీధిలో నివాసముండే బంగారయ్య.. పని నిమిత్తం శనివారం కుటుంబంతో కలసి బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి తులం బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
దంపతుల అనుమానాస్పద మృతి
-
భార్యాభర్తల అనుమానాస్పద మృతి
మక్కువ మండలం ఎస్.పెద్దవలసలో జంట హత్యలు జరిగాయి. భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వారిని కొట్టి చంపారని బంధువులు అంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. డబ్బు కోసమో, లేదా మరేదైనా కారణం చేతనో ఈ హత్యలు జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. పాచిపెంట మండలంలో పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్‌కు హాజరై, తిరిగి రాత్రి పూట ఇంటికి వస్తుండగా గ్రామ శివార్లలోనే వీరిద్దరిపైన ఇనుప రాడ్లతో దాడిచేసి కొట్టి చంపారని అంటున్నారు. అయితే వీరివద్ద ఏమైనా నగలు గానీ, నగదు గానీ పోయాయా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ ఇది ఎవరైనా చేసిన హత్యా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం చెప్పలేమని పోలీసులు అంటున్నారు.