సాయిలక్ష్మీరత్న(ఫైల్)
యడ్లపాడు: మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్ద జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీరత్న(24) బీకాం పూర్తిచేసి స్థానికంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆధార్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమెకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.
మంగళవారం మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి తల్లి నాగలక్ష్మితో కలిసి స్కూటీపై సాయిలక్ష్మీ రత్న బయలుదేరింది. యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్దకు వచ్చేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు కింద, స్కూటీకి మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సాయిలక్ష్మీరత్న అక్కడే దుర్మరణం చెందింది. వెనుక కూర్చున్న తల్లి నాగలక్ష్మి తల, నుదురు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. కళ్లముందే రక్తపు మడుగులో కూతురు పడి ఉండడాన్ని చూసి నాగలక్ష్మి అపస్మారక స్థితికి వెళ్లింది.
పోలీసులు చేరుకుని బస్సుకింద ఇరుక్కుపోయిన సాయిలక్ష్మీరత్నను క్రేన్ సాయంతో వెలికితీశారు. నాగలక్ష్మిని 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్‌ఐ పైడి రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. హైవేపే దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొని ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment