chilakaluri peta
-
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
‘సోనియా, చంద్రబాబు ద్రోహాన్ని ఎవరూ క్షమించరు’
పల్నాడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని తెలిపారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏపీకి చేసిన ద్రోహానికి ఆమెను ఎవరు క్షమించరని అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు. ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబడి వారిని గెలిపిస్తారని తెలిపారు. ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేశ్ నాయుడు పోటీ చేస్తారని తెలిపారు. ఇక్కడ రాజేష్ నాయుడును గెలిపించాలని ఆయన కోరారు. చదవండి: వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు దుర్మరణం.. తల్లి కళ్లెదుటే ఘోరం
యడ్లపాడు: మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్ద జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీరత్న(24) బీకాం పూర్తిచేసి స్థానికంగా బీఎస్ఎన్ఎల్ ఆధార్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమెకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. మంగళవారం మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి తల్లి నాగలక్ష్మితో కలిసి స్కూటీపై సాయిలక్ష్మీ రత్న బయలుదేరింది. యడ్లపాడు సమీపంలోని సుబాబుల్ తోట వద్దకు వచ్చేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు కింద, స్కూటీకి మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సాయిలక్ష్మీరత్న అక్కడే దుర్మరణం చెందింది. వెనుక కూర్చున్న తల్లి నాగలక్ష్మి తల, నుదురు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. కళ్లముందే రక్తపు మడుగులో కూతురు పడి ఉండడాన్ని చూసి నాగలక్ష్మి అపస్మారక స్థితికి వెళ్లింది. పోలీసులు చేరుకుని బస్సుకింద ఇరుక్కుపోయిన సాయిలక్ష్మీరత్నను క్రేన్ సాయంతో వెలికితీశారు. నాగలక్ష్మిని 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్ఐ పైడి రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. హైవేపే దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొని ఉండవచ్చని భావిస్తున్నారు. -
విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. సక్రమంగా మార్గంలో పిల్లలను నడిపించాల్సిన ఉపాధ్యాయుడు తానే వక్రమార్గం ఎంచుకున్నాడు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ మోడల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అదే స్కూల్‌కు చెందిన సైన్స్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సాగుతోంది. సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని ఏపీ మోడల్ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకొచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సామాన్య శాస్త్ర అధ్యాపకుడు గేరా క్రాంతికిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. యడ్లపాడు మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గదిలోకి రావాలంటూ ఉపాధ్యాయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. పోలీసులు విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. నాలుగేళ్లుగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న క్రాంతికిరణ్‌పై సాతులూరు, నాదెండ్ల, చిలకలూరిపేట తదితర గ్రామాలకు చెందిన విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ వద్ద వివరాలు తీసుకున్నారు. క్రాంతికిరణ్ వికృత చేష్టలపై ఏడాది క్రితమే ప్రిన్సిపాల్‌కు పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అతను తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదైంది. -
ఓటమి భయంతో అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చిలకలూరిపేట : ఓటమి భయంతో మతి భ్రమించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు సభ విఫలం కావడంతో సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలకు దిగజారారని విమర్శించారు. తనను మహానటి అని పుల్లారావు విమర్శించటాన్ని తప్పు పట్టారు. తనకు తాను మహానాయకుడని చెప్పుకొనే ఆయన ఆ సినిమా ఎంత ప్లాప్ అయ్యిందో గుర్తించాలన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పుల్లారావు మట్టికరవటం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలందరినీ మోసగించే కపటనటుడు మంత్రి ప్రత్తిపాటి అని నియోజకవరంలో అందరికీ తెలుసన్నారు. అసలు మీ గురించి, మీ జీవితం గురించి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మీరు చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, హత్యలు తప్ప మీ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని ధ్వజమెత్తారు. రేషన్ డీలర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పుల్లారావు.. ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేటకు వచ్చి, వ్యాపారం పేరుతో ఆర్యవైశ్యుల దగ్గర కోట్లాది రూపాయలు అప్పు చేసి వారికి ఎగనామం పెట్టారని ఆరోపించారు. కన్న తండ్రికి తలకొరివి పెట్టాల్సి వస్తుందని, మీరు ఊరు విడిచి పారిపోతే వేరొకరు మీ తండ్రి చితికి నిప్పు పెట్టిన విషయం బహుశా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియక పోవచ్చన్నారు. కన్న తల్లికి మీరు ఇప్పటికీ అన్నం పెట్టకపోతే, ఆమె ఒంటరిగానే జీవిస్తున్న సంగతి మీ నిజనైజానికి అద్దం పడుతుందన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి అన్నదానం చేసేటప్పుడు, ఆ ఫొటోలకు ఫోజులిచ్చేటప్పడు మీ అమ్మానాన్నలు ఎప్పుడైనా గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాంటి ప్రత్తిపాటి పుల్లారావుకు తన కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆరోపణలకు ఆధారం ఉందా? తన భర్త విడదల కుమారస్వామిని తానే అమెరికా పంపినట్లు మంత్రి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. తన భర్త 20 ఏళ్ల నాడు అమెరికా వెళ్లినప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గుడ్డి పత్తి వ్యాపారం చేసుకుంటూ, రైతులకు డబ్బులు చెల్లించకుండా దాక్కొనే పరిస్థితులు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో విదేశాల్లో విరాళాలు వసూలు చేస్తున్నారని నీతి లేని ఆరోపణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాక పౌండేషన్ స్థాపించామని, దాని రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉందని, దీనికి విరుద్ధంగా ఒక్క ఆధారం ఉన్నా పుల్లారావు నిరూపించాలని సవాలు విసిరారు. మా మామయ్య విడదల లక్ష్మీనారాయణకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇప్పించానని చెబుతున్న మంత్రి పుల్లారావు, ఆ పదవి కోసం ఎంత డబ్బులు తీసుకుంది, మీ లోకేష్ బాబుకు ఎన్ని కోట్లు ఇప్పించింది ఆధారాలతో సహా తన కుటుంబ సభ్యులు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మల్లెల రాజేష్ నాయుడు డబ్బులు ఇస్తే గాని ప్రత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైద్యశిబిరాలు నిర్వహించలేని మీరు కూడా కాకమ్మ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎడ్ల పందాలు కూడా రాజేష్ నాయుడు డబ్బులతోనే నిర్వహించింది వాస్తవం కదా అని ప్రశ్నించారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో మేము పేదలకు సాయం చేయాలని వచ్చామని తెలిపారు. కాని మీరు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను దారుణంగా మోసగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యాపారులకు అండగా ఉంటాం ఇప్పటికీ మీ భార్య పేరున వెంకాయమ్మ ట్యాక్స్ వసూలు చేస్తున్న మీరు, ఇతరులు గెలిస్తే పన్ను వసూలు చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. మీలాగా రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దానికి పదింతలు సంపాదించాలన్న దుర్భుద్ధితో రాజకీయాల్లోకి రాలేదని, మాకు ఉన్నదాంట్లో సేవ చేద్దామనే వచ్చామని చెప్పారు. తాము వ్యాపారులకు అండగా ఉంటామని వివరించారు. -
వామ్మో... వెంకాయమ్మ..!
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పేరు చెబితేనే నియోజకవర్గ ఉద్యోగులు హడలిపోతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి కావడంతో వెంకాయమ్మ చెప్పిందే వేదంగా నడిచింది. ఇందులో భాగంగా చిలకలూరిపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో పనిచేస్తున్న సిబ్బంది తనను కలవలేదని.. ఒకేసారి 14 మందిని బదిలీ చేయించింది. తన భర్తను పట్టుపట్టి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేనిపై ఒత్తిడి తెప్పించి ఆస్పత్రి సిబ్బందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయించింది. ఎవరైనా సరే నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులు తనను కలవాలని లేదంటే ఆస్పత్రి సిబ్బంది తరహాలోనే బదిలీ కావాల్సి ఉంటుందని, ఆమె ఉద్యోగులు, సిబ్బందిని హెచ్చరించినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గంలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వెంకాయమ్మ పేరు చెబితే చాలు భయపడిపోతున్నారు. అదేవిధంగా వెంకాయమ్మ అగ్రిగోల్డ్ భూములను కొనుగోలుచేసి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, పుల్లారావు మంత్రి అయితే వెంకాయమ్మ దూకుడు మామూలుగా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పేటలో కొత్తవారికే అందలం
సాక్షి, చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గం 2004 వరకు ఎన్నికల ఫలితాల్లో నూతన విశిష్టత చాటుకునేది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కొత్తగా పోటీ చేసే వారికే అనుకూలంగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి సారి పొటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన కరణం రంగారావు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పి.నాగయ్యపై గెలిచారు. పదేళ్ల పాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్టూరులోకి వెళ్లింది. తిరిగి 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి కందిమళ్ల బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసిన కందిమళ్ల బుచ్చయ్యపై తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బాల సత్యనారాయణ గెలిచారు. 1978లో తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్య, జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కాజా కృష్ణమూర్తి రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆ తదుపరి జరిగిన రెండు ఎన్నికల్లో మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుతం 2019లో టీడీపీ తరుఫున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజని బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తొలిసారి పోటీ చేసిన అభ్యర్థులకే అండగా నిలుస్తున్న నియోజకవర్గం సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, రజనికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
ప్రతి కులానికి రూ.10 లక్షల పంపిణీ
గుంటూరు: చిలకలూరిపేటలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కులానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపై విచ్చలవిడిగా కరపత్రాల అంటించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. -
తీరిన చివరి కోరిక
చిలకలూరిపేట, ఓటు హక్కు వినియోగించుకొన్న ఓ వృద్ధురాలు కొద్దినిమిషాల వ్యవధిలోనే మరణించిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ వార్డుకు చెందిన షేక్ మౌలాబీ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాను ఓటు వేయాలని అభ్యర్థించటంతో బంధువులు వార్డు పరిధిలో శ్రీశారద ప్రాథమిక పాఠశాలకు తీసుకువెళ్లారు. ఓటు వేసి ఇంటికి వచ్చిన మౌలాబీ కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఆమె ఆఖరి కోరిక తీరినట్టయింది -
అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం
పర్చూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాకతో చిలకలూరిపేట- యద్దనపూడి రోడ్డు జనసంద్రమైంది. రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన వేలాదిమంది ప్రజలు తమ అభిమాన నేతకు ఆత్మీయస్వాగతం పలికారు. ఆయన్ను తనివితీరా చూసి పులకించిపోయారు. చిన్నాపెద్దా తేడా లేకుండా జగన్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఉరుకులు పెట్టారు. ‘జై జగన్’అంటూ నినదించారు. ఆయన కాన్వాయ్ వెంట కొంతదూరం వరకు పరుగులు తీశారు. ‘అన్నా జగనన్నా...’అంటూ చేయెత్తిన ప్రతి ఆడపడుచునూ జగన్ పలకరించారు. రోడ్డు పక్కన ఆశగా నిలబడిన వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఓదార్చి ‘మీ అందరికీ నేనున్నానంటూ’ ధైర్యం చెప్పారు. చెమర్చిన కళ్లతో పలకరించే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు శనివారం మృతిచెందారు. నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు వై.ఎస్.జగన్ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి చేరుకుని చిలకలూరిపేట వచ్చారు. అక్కడ నుంచి ఉదయం 10గంటలకు గొట్టిపాటి నరసింహారావు స్వగ్రామం యద్దనపూడికి బయలుదేరారు. ఆయన ఐదో నెంబరు జాతీయ రహదారి దిగి యద్దనపూడి రోడ్డులోనికి ప్రవేశించగానే ఆ మార్గంలోని చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి గ్రామాల అభిమానులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన చేరారు. జగన్ కాన్వాయ్ దగ్గరకు రాగానే వందల చేతులు పైకి లేచి ఆగాలంటూ అభ్యర్థించాయి. అంతే...అందరి దగ్గరా ఐదేసి నిమిషాల చొప్పున ఆగిన వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అందరి అభ్యర్థనల్నీ మన్నిస్తూ... వై.ఎస్.జగన్మోహన్రెడ్డి డేగరమూడి చేరుకోగానే పొలాల్లో ఉన్న మహిళలు, కూలీలు రోడ్డు మీదకు పరుగులు తీశారు. చింతపల్లిపాడు సమీపంలోకి రాగానే తమ నేతను చూడాలనే తపనతో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఆయన కాన్వాయ్‌ను నిలువరించారు. అభిమానుల కోరిక మేరకు వై.ఎస్.జగన్ చింతపల్లి పాడు పాఠశాల వద్ద దిగి అందరికీ అభివాదం చేశారు. ‘అయ్యా...ఒక్కసారి కారు దిగి ముసలాయన్నంట పలకరించయ్యా...నీకు పుణ్యముంటుంది’ అంటూ రోడ్డు పక్క నిలబడి ముకుళిత హస్తాలతో అభ్యర్థించిన డెబ్బయ్యేళ్ల ముసలావిడను చూసి జగన్ కరిగిపోయారు. వెంటనే కారు దిగారు. ‘అవ్వా.. పద’ అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఒక్కసారి ఈలలు..కేరింతలు పెద్ద ఎత్తున హోరెత్తాయి. కాలనీలోని ఓ పూరి గుడిసె దగ్గర ఆగి అక్కడ నడవలేని స్థితిలో కూర్చున్న పెద్దాయన ప్రభుదాసును పలకరించారు. ‘ఏయ్యా... బాగున్నావా?’ అంటూ అమాయకంగా అడిగిన ఆయన ముఖాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దాడిన జగన్ అవ్వ అన్నపూర్ణమ్మకు ధైర్యాన్ని చెప్పారు. ‘అవ్వా...మన ప్రభుత్వం కోసం దేవునికి మొక్కు. ఆ తరువాత అన్నీ మంచే జరుగుతాయి’అని కాన్వాయ్‌ను చేరుకున్నారు. యనమదల గ్రామంలో తనను పలకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఊరడిస్తూ, ‘అమ్మా...ఎవ్వరూ ఏడ్వొద్దు...కొద్ది కాలం ఓపిక పట్టండి. ఆపైన అన్నీ మంచిరోజులే’అని ధైర్యం చెప్పారు. ‘జగనన్నా ఇటు చూడన్నా’అని ఆడపడుచులు తన చేతుల్లో పెట్టిన ప్రతి చంటిపాపను ప్రేమగా ముద్దాడారు. చింతపల్లిపాడుకాలనీకి చెందిన పులిపాటి రాజమ్మ కుమార్తె అర్చనను ఎత్తుకుని లాలించారు. స్కూలు యూనిఫాంలతో పరుగులు తీస్తూ వచ్చిన విద్యార్థినుల్ని దగ్గరకు తీసుకుని బాగా చదువుకోండంటూ వారి తలలపై ఆప్యాయంగా నిమిరారు. చెట్లు, గోడలు, మిద్దెలు, వాటర్ ట్యాంకులెక్కి కేరింతలు కొడుతూ గాలిలో చేతులూపే యువత వైపు చూసి అభివాదం చేశారు. చింతపల్లిపాడు, యనమదల గ్రామాల్లోని చర్చిల్లో పాస్టర్ ఇస్రాయిల్ ప్రార్థనలు నిర్వహించి యెహోవా ఆశీస్సుల్ని యువనేతకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జనం ‘జై జగన్..జైజై వైఎస్సార్’ అంటూ చెవులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. చిలకలూరిపేట నుంచి యద్దనపూడికి ఉన్న 17 కి.మీ. ప్రయాణించడానికి రెండుగంటల సమయం పట్టిందంటే దారిపొడుగునా ప్రజలు ఎంతగా పోటెత్తారో తెలుస్తోంది. ఆ మార్గమధ్యంలో మొత్తం 16 చోట్ల ఆగిన వైఎస్ జగన్ ఎవ్వరినీ నిరుత్సాహ పరచకుండా అందరినీ పలకరిస్తూ, చెరగని చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ యద్దనపూడి చేరుకున్నారు. గొట్టిపాటి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన వై.ఎస్.జగన్ తిరుగు ప్రయాణంలోనూ ప్రజలు దారిపొడుగునా తమ అభిమాన నేత కోసం నిరీక్షించారు. వారిని నిరాశపర్చడం ఇష్టంలేక ఆయన మళ్లీ పలుచోట్ల తన వాహనాన్ని ఆపి అందర్నీ పలకరించారు. -
ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసే యత్నం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనను మరవక ముందే .... రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటనలు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరు పేటలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆటో డ్రైవర్ కిడ్నాప్‌కు యత్నించిన ఘటన స్థానికంగా సంచలం సృష్టించింది. నాదెండ్ల మండలం గణపవరంకు చెందిన మోక్ష చిలకలూరిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఆమె ఆటోలో కళాశాలకు వెళుతోంది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం మోక్ష కళాశాలకు ఆటోలో వెళుతుండగా డ్రైవర్ కాలేజీ దగ్గర ఆపకుండా ముందుకు తీసుకువెళ్లాడు. దాంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోవటంతో నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు ఆటోను వెంబడించినా ఫలితం లేకపోయింది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ యత్నం జరిగింది. చింతలపూడి మండలం సమ్మెటవారిగూడానికి చెందిన సురేష్, టి.నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన ఓ యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. రెండేళ్ల వీరి ప్రేమ మనస్పర్థలతో ముగిసింది. అనంతరం ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో కక్ష కట్టిన సురేష్... ఆ యువతిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. అందుకు... మరో ఐదుగురితో కలిసి కిడ్నాప్ చేసేందుకు పథకం వేశాడు. యువతిని ఇంటికి వెళ్లి దాహమంటూ... క్లోరోఫాంతో కిడ్నాప్ చేయాలని భావించారు. ఆతర్వాత యువతిని కిడ్నాప్ చేయటానికి యత్నించగా... స్థానికులు గమనించి... పట్టుకున్నారు. నలుగురు చిక్కగా... కిడ్నాప్‌కు మూలసూత్రధారి.. మరొకతను పారిపోయాడు. కిడ్నాపర్లను చెట్టుకు కట్టేసి చితకొట్టిన స్థానికులు ఆ తరువాత పోలీసులకు అప్పగించారు.