సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పేరు చెబితేనే నియోజకవర్గ ఉద్యోగులు హడలిపోతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి కావడంతో వెంకాయమ్మ చెప్పిందే వేదంగా నడిచింది. ఇందులో భాగంగా చిలకలూరిపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో పనిచేస్తున్న సిబ్బంది తనను కలవలేదని.. ఒకేసారి 14 మందిని బదిలీ చేయించింది.
తన భర్తను పట్టుపట్టి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేనిపై ఒత్తిడి తెప్పించి ఆస్పత్రి సిబ్బందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయించింది. ఎవరైనా సరే నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులు తనను కలవాలని లేదంటే ఆస్పత్రి సిబ్బంది తరహాలోనే బదిలీ కావాల్సి ఉంటుందని, ఆమె ఉద్యోగులు, సిబ్బందిని హెచ్చరించినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గంలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వెంకాయమ్మ పేరు చెబితే చాలు భయపడిపోతున్నారు.
అదేవిధంగా వెంకాయమ్మ అగ్రిగోల్డ్ భూములను కొనుగోలుచేసి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, పుల్లారావు మంత్రి అయితే వెంకాయమ్మ దూకుడు మామూలుగా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment