
అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం
పర్చూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాకతో చిలకలూరిపేట- యద్దనపూడి రోడ్డు జనసంద్రమైంది. రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన వేలాదిమంది ప్రజలు తమ అభిమాన నేతకు ఆత్మీయస్వాగతం పలికారు. ఆయన్ను తనివితీరా చూసి పులకించిపోయారు. చిన్నాపెద్దా తేడా లేకుండా జగన్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఉరుకులు పెట్టారు. ‘జై జగన్’అంటూ నినదించారు. ఆయన కాన్వాయ్ వెంట కొంతదూరం వరకు పరుగులు తీశారు. ‘అన్నా జగనన్నా...’అంటూ చేయెత్తిన ప్రతి ఆడపడుచునూ జగన్ పలకరించారు. రోడ్డు పక్కన ఆశగా నిలబడిన వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఓదార్చి ‘మీ అందరికీ నేనున్నానంటూ’ ధైర్యం చెప్పారు. చెమర్చిన కళ్లతో పలకరించే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు.
పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు శనివారం మృతిచెందారు. నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు వై.ఎస్.జగన్ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి చేరుకుని చిలకలూరిపేట వచ్చారు. అక్కడ నుంచి ఉదయం 10గంటలకు గొట్టిపాటి నరసింహారావు స్వగ్రామం యద్దనపూడికి బయలుదేరారు. ఆయన ఐదో నెంబరు జాతీయ రహదారి దిగి యద్దనపూడి రోడ్డులోనికి ప్రవేశించగానే ఆ మార్గంలోని చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి గ్రామాల అభిమానులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన చేరారు. జగన్ కాన్వాయ్ దగ్గరకు రాగానే వందల చేతులు పైకి లేచి ఆగాలంటూ అభ్యర్థించాయి. అంతే...అందరి దగ్గరా ఐదేసి నిమిషాల చొప్పున ఆగిన వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు.
అందరి అభ్యర్థనల్నీ మన్నిస్తూ...
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డేగరమూడి చేరుకోగానే పొలాల్లో ఉన్న మహిళలు, కూలీలు రోడ్డు మీదకు పరుగులు తీశారు. చింతపల్లిపాడు సమీపంలోకి రాగానే తమ నేతను చూడాలనే తపనతో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఆయన కాన్వాయ్‌ను నిలువరించారు. అభిమానుల కోరిక మేరకు వై.ఎస్.జగన్ చింతపల్లి పాడు పాఠశాల వద్ద దిగి అందరికీ అభివాదం చేశారు. ‘అయ్యా...ఒక్కసారి కారు దిగి ముసలాయన్నంట పలకరించయ్యా...నీకు పుణ్యముంటుంది’ అంటూ రోడ్డు పక్క నిలబడి ముకుళిత హస్తాలతో అభ్యర్థించిన డెబ్బయ్యేళ్ల ముసలావిడను చూసి జగన్ కరిగిపోయారు. వెంటనే కారు దిగారు. ‘అవ్వా.. పద’ అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఒక్కసారి ఈలలు..కేరింతలు పెద్ద ఎత్తున హోరెత్తాయి. కాలనీలోని ఓ పూరి గుడిసె దగ్గర ఆగి అక్కడ నడవలేని స్థితిలో కూర్చున్న పెద్దాయన ప్రభుదాసును పలకరించారు. ‘ఏయ్యా... బాగున్నావా?’ అంటూ అమాయకంగా అడిగిన ఆయన ముఖాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దాడిన జగన్ అవ్వ అన్నపూర్ణమ్మకు ధైర్యాన్ని చెప్పారు. ‘అవ్వా...మన ప్రభుత్వం కోసం దేవునికి మొక్కు. ఆ తరువాత అన్నీ మంచే జరుగుతాయి’అని కాన్వాయ్‌ను చేరుకున్నారు. యనమదల గ్రామంలో తనను పలకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఊరడిస్తూ, ‘అమ్మా...ఎవ్వరూ ఏడ్వొద్దు...కొద్ది కాలం ఓపిక పట్టండి. ఆపైన అన్నీ మంచిరోజులే’అని ధైర్యం చెప్పారు. ‘జగనన్నా ఇటు చూడన్నా’అని ఆడపడుచులు తన చేతుల్లో పెట్టిన ప్రతి చంటిపాపను ప్రేమగా ముద్దాడారు. చింతపల్లిపాడుకాలనీకి చెందిన పులిపాటి రాజమ్మ కుమార్తె అర్చనను ఎత్తుకుని లాలించారు.
స్కూలు యూనిఫాంలతో పరుగులు తీస్తూ వచ్చిన విద్యార్థినుల్ని దగ్గరకు తీసుకుని బాగా చదువుకోండంటూ వారి తలలపై ఆప్యాయంగా నిమిరారు. చెట్లు, గోడలు, మిద్దెలు, వాటర్ ట్యాంకులెక్కి కేరింతలు కొడుతూ గాలిలో చేతులూపే యువత వైపు చూసి అభివాదం చేశారు. చింతపల్లిపాడు, యనమదల గ్రామాల్లోని చర్చిల్లో పాస్టర్ ఇస్రాయిల్ ప్రార్థనలు నిర్వహించి యెహోవా ఆశీస్సుల్ని యువనేతకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జనం ‘జై జగన్..జైజై వైఎస్సార్’ అంటూ చెవులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. చిలకలూరిపేట నుంచి యద్దనపూడికి ఉన్న 17 కి.మీ. ప్రయాణించడానికి రెండుగంటల సమయం పట్టిందంటే దారిపొడుగునా ప్రజలు ఎంతగా పోటెత్తారో తెలుస్తోంది. ఆ మార్గమధ్యంలో మొత్తం 16 చోట్ల ఆగిన వైఎస్ జగన్ ఎవ్వరినీ నిరుత్సాహ పరచకుండా అందరినీ పలకరిస్తూ, చెరగని చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ యద్దనపూడి చేరుకున్నారు. గొట్టిపాటి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన వై.ఎస్.జగన్ తిరుగు ప్రయాణంలోనూ ప్రజలు దారిపొడుగునా తమ అభిమాన నేత కోసం నిరీక్షించారు. వారిని నిరాశపర్చడం ఇష్టంలేక ఆయన మళ్లీ పలుచోట్ల తన వాహనాన్ని ఆపి అందర్నీ పలకరించారు.