విచారణ నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. సక్రమంగా మార్గంలో పిల్లలను నడిపించాల్సిన ఉపాధ్యాయుడు తానే వక్రమార్గం ఎంచుకున్నాడు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ మోడల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అదే స్కూల్‌కు చెందిన సైన్స్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సాగుతోంది.
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని ఏపీ మోడల్ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకొచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సామాన్య శాస్త్ర అధ్యాపకుడు గేరా క్రాంతికిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. యడ్లపాడు మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గదిలోకి రావాలంటూ ఉపాధ్యాయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. పోలీసులు విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. నాలుగేళ్లుగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న క్రాంతికిరణ్‌పై సాతులూరు, నాదెండ్ల, చిలకలూరిపేట తదితర గ్రామాలకు చెందిన విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ వద్ద వివరాలు తీసుకున్నారు. క్రాంతికిరణ్ వికృత చేష్టలపై ఏడాది క్రితమే ప్రిన్సిపాల్‌కు పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అతను తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment