రషీద మృతదేహం
మోహిద్దీన్‌పురం (అర్థవీడు): ట్రాక్టర్ ప్రమాదంలో నవ వధువు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మోహిద్దీన్‌పురం–నాగులవరం మధ్య ఆదివారం జరిగింది. వివరాలు.. అర్థవీడు మండలం బొల్లుపల్లికి చెందిన షేక్ ఇబ్రహీం సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ రషీద (19)తో గత నెల 15వ తేదీన వివాహం జరిగింది. కంభంలోని బంధువుల ఇంట విందుకు హాజరయ్యేందుకు భార్యతో కలిసి బైక్‌పై బయల్దేరాడు.
బొల్లుపల్లె నుంచి మొద్దుల లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ వెనుక వైపు నుంచి బైకును ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చొని ఉన్న రషీద ట్రాక్టర్ కింద పడింది. తీవ్రంగా గాయపడిన రషీద అక్కడికక్కడే మృతి చెందింది. ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
నవ దంపతుల ఇంట విషాదం
పెళ్లి జరిగి 20 రోజులు కాక ముందే నవ వధువును మృత్యువు కబళించింది. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో భర్త గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు మూడో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి పంపించారు. నవ దంపతులు తమ ఇంటికొస్తారని వారి కోసం వంటల వండి సిద్ధం చేసిన బంధువులకు వధువు చనిపోయిందన్న వార్త తెలియడంతో వారి ఇంట విషాదం నెలకొంది. మరణ వార్త తెలుసుకున్న బంధువులు కొత్తపేట, బొల్లుపల్లి, కంభం, బేస్తవారిపేట నుంచి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలి వచ్చారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment