ఆసుపత్రి వద్ద రోదిస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, హారిక(ఫైల్)
సుల్తానాబాద్(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్‌కు వెళ్లింది.
పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment