పెళ్లింట విషాదం ..
*పెళ్లికుమార్తె సహా నలుగురు మృతి
*మరో మహిళకు సీరియస్
*గురువారం తెల్లవారుజామున గుంటూరులో పెళ్లి
*స్వస్థలం చల్లపల్లి నుంచి వెళుతుండగా ఘోరం
*తోట్లవల్లూరు మండలం రొయ్యూరు కరకట్ట వద్ద ఘటన
అప్పటివరకు మేళతాళాలు, బాజాభజంత్రీలు, పెళ్లిసందడితో కళకళలాడిన ఆ ఇంట్లో విషాదం అలముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన తరుణంలో కారు ప్రమాదం రూపంలో పెళ్లి కూతురు సహా నలుగురిని మృత్యువు కబళించింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరిన గంట సేపటికే ఈ దుర్ఘటన జరిగిందన్న వార్త విన్న కుటుంబ
సభ్యులు, బంధువులు నిశ్చేష్టులయ్యారు.
తోట్లవల్లూరు : మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువతిని మృత్యువు కబళించింది. అప్పటివరకు బంధుమిత్రులతో ఆనందోత్సాహాలు నిండిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన ఓ పెళ్లిబృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న పెళ్లికూతురు బాలాకుమారి, ఆమె స్నేహితురాలు నాగచంద్రిక అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారు నడిపిన సోమశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కారు నడుపుతున్న వ్యక్తి కుమారుడు సన్నీ కాలువలో పడి గల్లంతవగా, ఆ తర్వాత అదేచోట మృతదేహం లభించింది. కారు నడుపుతున్న వ్యక్తి భార్య పద్మ చావుబతుకుల్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె బాలాకుమారి (అమ్ములు) వివాహం గుంటూరుకు చెందిన ఆనంద్‌తో నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది.
ముందురోజు బుధవారం రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు సమీప బంధువు పామర్తి సోమశేఖర్‌కు చెందిన కారులో కృష్ణా కరకట్టపై పెళ్లికుమార్తె బాలాకుమారి (26), ఆమె స్నేహితురాలు నాగచంద్రిక (34), సోమశేఖర్ భార్య పద్మ, కుమారుడు రోహన్ అలియాస్ సన్నీ (8)తో కలిసి బుధవారం సాయంత్రం గుంటూరుకు బయలుదేరారు. 4.30 గంటల సమయంలో కారు తోట్లవల్లూరు మండలం రొయ్యూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి కుడివైపున ఉన్న కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్‌కెనాల్ (కేఈబీ) కాలువలోకి దూసుకుపోయింది.
కారు దూసుకుపోతూ పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న పెళ్లికూతురు, ఆమె స్నేహితురాలు మృత్యువాతపడ్డారు. కారు నీటిలో మునగటంతో బాలుడు సన్నీ గల్లంతయ్యాడు. గాయపడ్డ సోమశేఖర్, ఆయన భార్య పద్మను హుటాహుటిన అంబులెన్స్‌లో కానూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సోమశేఖర్ విజయవాడలోని ఆర్మ్‌డ్ రిజర్వులో కానిస్టేబుల్‌గా ఉన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు.
హుటాహుటిన సహాయక చర్యలు...
ప్రమాదంస్థలంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చటంతో పాటు గాయపడిన వారిని కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, తహశీల్దార్ జి.భద్రు, ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్‌ఐ డి.సురేష్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలంలో పరిస్థితి చూసి బంధువులు భోరున విలపించారు. కాళ్లపారాణి ఆరకముందే తమ కుమారతున మృత్యువు కబళించటాన్ని పెళ్లికుమార్తె తండ్రి సాంబయ్య, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనతో వారి రోదనలు మిన్నంటాయి.