week meti kathanalu-1
-
కీచకానికి కీలెరిగిన వాత
దొరికితేనే దొంగ. దొరక్కపోతే దొర. చీకటి మాటున దొరలోని దొంగ బయటకు వస్తాడు.నిశ్శబ్దం చాటున దొంగ దొరలా మారిపోతాడు. దొరలా ఉండే దొంగ తను దొరకననే ధీమాతో దొంగవేషాలేస్తాడు. ఎదిరించనంత వరకే దొంగకి దొరతనం. అలాంటి ఓ దొరదొంగను నిలదీసింది ఒక ధీశాలి. గత వారం ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ వెళ్తున్న ఫ్లైట్‌లో ఒక నడివయస్కుడు తన ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకురాలిని అసభ్యంగా తాకాడు. ఛీ ఛీ అని చీదరించుకుని ఆ అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్లిపోయి ఉంటే అది మన వరకూ చేరని మరో సాధారణ సన్నివేశం అయి ఉండేది. ఆ మౌనం మరోసారి అదే సంఘటన మరోచోట జరిగే అవకాశం కల్పించేది. కాని, ఇక్కడ ఆ అమ్మాయి నిశ్శబ్దాన్ని ఛేదించింది. కెమెరా ఎక్కుపెట్టి మరీ తనకు జరిగిన వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఆ దొరదొంగ సిగ్గుతో కుంచించుకుపోయాడు. దొరకనంత వరకు ఇలా ఎందరిని వేధించాడో కానీ, మరోసారి ఇలా ప్రవర్తించడానికి భయపడేలా బుద్ధి చెప్పింది ఆ అమ్మాయి. అదిగో దొంగ.. ఈ సంఘటన చాలా అంశాలను తెరపైకి తెచ్చింది. మొదటిది.. లైంగిక వేధింపులకు.. వర్గ, ఆర్థిక, సామాజిక భేదాలు లేవు. విమానాల్లో తిరిగే చదువుకున్న సంపన్న వర్గాల్లో కూడా కీచక దొరలుంటారు. రెండోది.. స్త్రీల నిశ ్శబ్దాన్ని నిస్సహాయతగా భావించబట్టే వేధింపులకు అవకాశం తీసుకుంటున్నారు. మూడోది.. ఇలాంటి నీచకులను ఎదిరించి నిలదీయటమే కాదు సమాజానికి ప్రకటించి నలుగురిలో తలదించుకునేలా చేయాలి.. అప్పుడే మరో దొరదొంగ తయారుకాడు. ఇదిగో సాక్ష్యం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి పది మంది స్త్రీలలో కనీసం 8 మంది జీవితంలో ఒక్కసారైనా మృగాడి వెకిలి చూపులు, అసభ్య చేష్టలు.. ఎదుర్కొంటున్నారు. నేను కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఎక్కువ శాతం స్త్రీలు ఇటువంటి వేధింపులు ఎదురైతే సిగ్గు, పరువు పేరుతో మౌనాన్ని ఆశ్రయిస్తారు. మరికొంత మంది, చిన్న విషయానికి పెద్ద గొడవెందుకని సమస్య తీవ్రతను నీరుగారుస్తారు. ఇక నాలాంటి కొందరు వెంటనే ఎదిరించి.. గట్టిగా పోరాటం చేస్తారు. ఫ్లైట్‌లో ఆ అమ్మాయి పోరాటానికి ఎంచుకున్న మార్గం నాకు నచ్చింది. అసభ్య ప్రవర్తన ఎదుర్కొన్న వెంటనే స్పందించింది. అరిచి రభస చేయడంతో పాటు సమయస్ఫూర్తితో తన ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించింది. దొరికిపోయిన ఆ దొంగ ముఖంలో నెత్తుటి చుక్క లేదు. తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఎదురు నిలిచి వాదించేవాడేమో ! కాని, వీడియో చిత్రీకరణ మొదలవగానే.. సారీ సారీ అంటూ ముఖం దాచేసుకునే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయడానికి ఆ అమ్మాయి బలమైన ఆధారం స్వయంగా ఏర్పాటు చేసుకుంది. ఆ సమయస్ఫూర్తి మనకు ఆదర్శం కావాలి. ధైర్యంగా మాట్లాడటమే కాదు.. పరువు, సిగ్గు అంటూ దాక్కోకుండా సామాజిక నెట్‌వర్క్స్‌లో కూడా తన వీడియోను షేర్ చేసి ఆ సంఘటనను ప్రపంచానికి తెలియజేసింది. నిజమే సిగ్గుపడాల్సింది వేధించిన వాడు కానీ.. వే దనకు గురైన స్త్రీ కాదు. ఎక్కడ ధర్మం.. ఆ వీడియో ఆసాంతం చూశాక ఓ పక్క అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే.. మరో పక్క మన సమాజం నిస్తేజం చూసి కోపం భగ్గుమంది. ఫ్లైట్‌లో ఇంత హడావిడి జరుగుతున్నా చుట్టుపక్కల ప్రయాణీకులు సినిమా చూస్తున్నట్టు నిలుచున్నారు. ఆ అమ్మాయికి అండగా ఏ ఒక్కరూ పెదవి మెదపలేదు. చదువుకున్న నాగరికత అడ్డొంచిందేమో మరి ! వెనుక సీట్లోనే ఉన్న ఇద్దరైతే చలో చలో.. అంటూ దాటి వెళ్లిపోవడమూ కనిపించింది. ఇదీ మన భారతీయ నైతికత. ఇటువంటి సందర్భాల్లో నిశ్శబ్దం వల్ల సత్యం బయటకు రాకపోవం ఒక ఎత్తయితే.. నైతిక మద్దతు లభించకపోవడం మరో ఎత్తు. ఇక్కడ మారాలి.. భువనేశ్వర్ ఇండిగో ఫ్లైట్ మాలెస్టేషన్ కేస్ నా దృష్టిలో చరిత్రాత్మకం. ఎందుకంటే ఇది మనకు కొత్త తరం పాఠం చెబుతోంది. వేధింపులను సహించం, సంఘటనను బహిర్గతం చేయడానికి సంకోచించం. ఇది ఇప్పటి తరం మహిళ మనోగతం కావాలి. టెక్నాలజీని మన రక్షణ కోసం ఉపయోగించగలిగే సామర్థ్యం మనందరం పెంచుకోవాలి. పేరు తెలియని ఆ సాహసికి సలాం చేస్తూ, అమ్మాయిలందరికీ పిలుపునిస్తున్నా.. నిశ్శబ్దాన్ని ఛేదించండి. facebook.com/anchorjhansi -
105 ఏళ్ల అత్త... 77 ఏళ్ల కోడలు
ఈ ఇంటికి దీపం ఇన్-లాలు ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణమంతురాలు’ అంటారు. కానీ అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు, కోడలున్న అత్త గుణమంతురాలు.. అని తిరగరాస్తున్నారీ అత్తాకోడళ్లు. పెళ్లయిన కొన్నాళ్లకే వేరే కాపురం వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతున్న రోజుల్లో ఏకంగా 63 ఏళ్ల పాటు అత్తతోనే ఉంటున్న ఉత్తమురాలు స్వర్ణకుమారి. అప్పట్నుంచి ఆమె చేతి వంటకాలనే తింటూ, ఆమె చెంతనే ఉంటున్న గుణవంతురాలు మల్లికాంబ. ఆమె వయసు 105 ఏళ్లు, కోడలి వయసు 77 ఏళ్లు కావడం మరో విశేషం! విశాఖపట్నంలో ఐదు తరాలుగా కొనసాగుతున్న ఈ ఆదర్శ కుటుంబం గురించి అత్తగారి మాటల్లో... బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం మాది వ్యవసాయ కుటుంబం. 30 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి విశాఖ వచ్చాం. నేను, నా భర్త (వీరరాఘవయ్య) స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు విశాఖలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. కొడుకు, కోడలు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, అని మనవళ్లతో కలిసి మా సంతతి 42 మంది. పెద్ద కుమార్తె సీతారామమ్మకు 86, కుమారుడు రామ్మోహనరావుకు 84, చిన్న కుమార్తె సరోజాదేవికి 77 ఏళ్లు. కొడుకు, కోడలు తప్ప మిగిలిన వారంతా వేర్వేరు ప్రాంతాల్లోను, విదేశాల్లోనూ ఉంటున్నారు. మా కుటుంబ సభ్యులు శుభకార్యానికో, పండగలకో మా ఇంటికొస్తుంటారు. కొన్నాళ్ల క్రితం అని మనవడు (ఐదో తరం) రేయమ్స్ (2 సం.లు) అన్నప్రాశన వేడుకకు మా వాళ్లంతా వచ్చారు. నా కొడుక్కి, కోడలికి సమ్మోహనం (60 ఏళ్ల వైవాహిక జీవితం నిండిన సందర్భం) జరిపించారు. కొల్లేరు చేపలు, గేదెపాలు మేం ముగ్గురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. మా చిన్నప్పుడు మానాన్నగారు కొల్లేరు నుంచి చేపలు తెచ్చి వండించేవారు. ఆ చేపలెంత రుచిగా ఉండేవో! గేదె పాలు పుష్కలంగా ఉండేవి. పెద్దలంటే గౌరవం ఉండేది. అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకునేవారు. ఉమ్మడి కుటుంబాలుండేవి. అంతా కలిసిమెలసి ఉండే వారు. ఆ రోజులే బాగుండేవి. అప్పట్లో మా అబ్బాయి రామ్మోహన రావుకు పాము కరిస్తే కోడెల శివప్రసాదరావు (నేటి ఏపీ స్పీకర్) వాడికి వైద్యం చేశారు. ఎల్లుండి మునిమనవరాలి పెళ్లి నా కోడలు... పేరుకు తగ్గట్టు స్వర్ణమేనయ్యా. మా కోడలికి కోడలు, ఆ కోడలికి మరో కోడలు కూడా వచ్చారు. అయినా కోడలు స్వర్ణకుమారి (77) ఇంకా కోడలి పాత్రే పోషిస్తోంది. అరవై మూడేళ్ల నుంచి నాతోనే ఉంటూ సేవ చేస్తోంది. కూతురిలా చూసుకుంటుంది. నా కోసం ఎన్నో ఇబ్బందులు పడుతోంది పాపం! కోడలితో సహా అందరూ నాకేలోటూ రానీయడం లేదు. కూర్చోబెట్టి చూస్తున్నారయ్యా. అప్పుడప్పుడు మనవలు, మనవరాళ్లు, మునిమనవలు వచ్చి చూసి వెళ్తారు. ఏ ఇబ్బందీ లేదు.. తృప్తిగా ఉంది. అందరి పెళ్లిళ్లూ చూశాను. నా చిన్న మనవడి కూతురు (మునిమనవరాలు ప్రవల్లిక) నిశ్చితార్థానికెళ్లా. ఆమె పెళ్లి కూడా చూడాలనుంది. (ఫిబ్రవరి 8న విజయవాడలో ప్రవల్లిక పెళ్లి.) నువ్వు లేకపోతే నేనుండలేనంటారు ‘మా అత్తగారు నువ్వు లేకపోతే నేనుండలేనమ్మా.. బెంగ పెట్టుకుంటానంటారు. అందుకని నేను ఆమెను వదిలి ఎక్కడికీ వెళ్లలేను. ఆమె మాట కాదనలేక ఎక్కడికీ వెళ్లడానికి ఇష్టపడను. ఇలా 63 ఏళ్ల నుంచి మా బంధం కొనసాగుతూ వస్తోంది. నాకు కోడలు, ఆమెకు కోడలూ వచ్చారు. మనవళ్లు పుట్టారు. ఎవరి కాపురాలు వారు చేసుకుంటున్నారు. మా అత్తగారికి చేసేది సేవ అనుకోను.. కోడలిగా నా బాధ్యత అని భావిస్తున్నా. ఎప్పుడూ ఆమె మంచి మాటలు చెబుతుంటారు. కొన్నాళ్ల క్రితం అనిమనవడు రేయమ్స్ గడపలు దాటే పండక్కి మా అత్తగారు పాటలు కూడా పాడారు. అనిమనవడిని ఎత్తినందుకు ఎంత సంబరపడి పోయారో! మా ఆడపడచులు, మేమూ ఆపేక్షగా ఉంటాం. ఏ రోజూ ఏమీ అనుకోలేదు. మాలాగే అన్ని కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. - స్వర్ణకుమారి, కోడలు -
ఆ పైలట్ హీరో అయ్యాడు!
తైపీ: విమాన ప్రమాదాలు జరిగిన అనంతరం పైలట్లు ప్రశంసలు అందుకోవడం అరుదుగా జరిగే విషయం. అయితే బుధవారం తైవాన్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో పైలట్ హీరో అయ్యాడు. విమాన ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన తీరు ప్రశంసలను అందుకొంటోంది. ఆ సమయంలో పైలట్ 'మేడే-మేడే(ఆపదలో ఉన్నాం రక్షించండి) అనే సంకేతాలు ఇవ్వడం సర్వత్రా పొగడ్తలను కురిపిస్తోంది. అలా అప్రమత్తం చేయడంతో భారీ సంఖ్యలో ప్రాణం నష్టం జరగకుండా చూసి ఆ పైలట్ దేశంలో హీరోగా మారిపోయాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాద సంకేతాలను అందజేస్తూనే పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం 58 ప్రయాణికులతో వెళుతున్న ట్రాన్స్ ఏసియా ఏటీఆర్ 72-600 విమానం కూలిన ఘటనలో 31 మంది మృతి చెందగా, 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ వీరి కోసం వందల సంఖ్యలు బోట్లు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో నడిపోయింది. -
భవిష్యత్‌లో భర్తలు దొరకడం కష్టమే!
లండన్: యూనివర్సిటీ, కాలేజీ స్థాయి చదువు పూర్తిచేసిన భారతీయ యువతులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం కనుగొన్నారు. లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల చేసిన సర్వేలో ఓ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్‌లో భారతీయ యువతులకు భర్తలు దొరకడం కష్టమేనని ఓ సర్వే తేల్చింది. యూనివర్సిటీ, కాలేజీ వరకు చదివిన యువతులకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కోవడం 2050 నుంచి కష్టతరం కానుందని సర్వేలో తేలింది. 2050 నుంచి మగవారు తమకంటే తక్కువగా చదువుకున్న వారినే జీవిత భాగస్వాములుగా ఎంపిక చేసుకుంటారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ది సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ స్టడీస్ (బార్సిలోనా), మిన్నెసోటా పాపులేషన్ సెంటర్ (అమెరికా)లు ఈ సర్వేలో భాగం పంచుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పద్ధతులు, ఇతర పరిస్థితులను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. 45-49 ఏళ్ల వయసున్న అవివాహిత మహిళలు 2010లో 0.07 శాతం ఉండగా, అది 2050కి 9 శాతానికి చేరుకుంటుందని పరిశోధకులు తెలిపారు. చదువుకన్న మహిళలదే ఇందులో అగ్రభాగమని చెప్తున్నారు. తమ కంటే తక్కువగా చదువుకున్న వారినే వివాహం చేసుకోవాలని మగవారు భావించడంతో అవివాహిత మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్ని సర్వేలలో వెల్లడైంది. జాతీయ కుటంబ ఆరోగ్య సర్వే (భారత్) 2005-06, భారత సామాజిక-ఆర్థిక సర్వే (1999, 2004) వివరాలను పూర్తిగా విశ్లేషించిన ఈ బృందం 50 ఏళ్ల వరకు అవివాహితులైన పురుషులు 1.2 శాతం ఉండగా, మహిళలు 0.6 శాతంగా ఉందని గుర్తించారు. ఈ సర్వేలతో పాటు పురుషులు, మహిళల వయసు, చదువు ఆధారంగా చేసుకుని 2050లో ఉండబోయే పరిస్థితులను తెలిపారు. 2010లో యూనివర్సిటీలో చదువుతున్న పురుషులు 151 మందికి గానూ మహిళలు 100 మంది మాత్రమే ఉన్నరని ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్ అనాలిసిస్, వియన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫీ సంస్థలు పేర్కొన్నాయి. 2050 ఏడాదికి పురుషులు 92 మాత్రమే ఉండాగా కాలేజీలో చదువుతున్న యువతులు 100 మంది ఉంటారని అంచనాలు వేశారు. -
పెళ్లింట విషాదం ..
*పెళ్లికుమార్తె సహా నలుగురు మృతి *మరో మహిళకు సీరియస్ *గురువారం తెల్లవారుజామున గుంటూరులో పెళ్లి *స్వస్థలం చల్లపల్లి నుంచి వెళుతుండగా ఘోరం *తోట్లవల్లూరు మండలం రొయ్యూరు కరకట్ట వద్ద ఘటన అప్పటివరకు మేళతాళాలు, బాజాభజంత్రీలు, పెళ్లిసందడితో కళకళలాడిన ఆ ఇంట్లో విషాదం అలముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన తరుణంలో కారు ప్రమాదం రూపంలో పెళ్లి కూతురు సహా నలుగురిని మృత్యువు కబళించింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరిన గంట సేపటికే ఈ దుర్ఘటన జరిగిందన్న వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు నిశ్చేష్టులయ్యారు. తోట్లవల్లూరు : మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువతిని మృత్యువు కబళించింది. అప్పటివరకు బంధుమిత్రులతో ఆనందోత్సాహాలు నిండిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. చూపరుల హృదయాలను ద్రవింపచేసే ఈ దుర్ఘటన తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కృష్ణా కరకట్టపై బుధవారం సాయంత్రం జరిగింది. చల్లపల్లి నుంచి గుంటూరుకు కారులో బయల్దేరిన ఓ పెళ్లిబృందం విజయవాడ వైపు కరకట్టపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న పెళ్లికూతురు బాలాకుమారి, ఆమె స్నేహితురాలు నాగచంద్రిక అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారు నడిపిన సోమశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కారు నడుపుతున్న వ్యక్తి కుమారుడు సన్నీ కాలువలో పడి గల్లంతవగా, ఆ తర్వాత అదేచోట మృతదేహం లభించింది. కారు నడుపుతున్న వ్యక్తి భార్య పద్మ చావుబతుకుల్లో ఉంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె బాలాకుమారి (అమ్ములు) వివాహం గుంటూరుకు చెందిన ఆనంద్‌తో నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. ముందురోజు బుధవారం రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు సమీప బంధువు పామర్తి సోమశేఖర్‌కు చెందిన కారులో కృష్ణా కరకట్టపై పెళ్లికుమార్తె బాలాకుమారి (26), ఆమె స్నేహితురాలు నాగచంద్రిక (34), సోమశేఖర్ భార్య పద్మ, కుమారుడు రోహన్ అలియాస్ సన్నీ (8)తో కలిసి బుధవారం సాయంత్రం గుంటూరుకు బయలుదేరారు. 4.30 గంటల సమయంలో కారు తోట్లవల్లూరు మండలం రొయ్యూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి కుడివైపున ఉన్న కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్‌కెనాల్ (కేఈబీ) కాలువలోకి దూసుకుపోయింది. కారు దూసుకుపోతూ పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న పెళ్లికూతురు, ఆమె స్నేహితురాలు మృత్యువాతపడ్డారు. కారు నీటిలో మునగటంతో బాలుడు సన్నీ గల్లంతయ్యాడు. గాయపడ్డ సోమశేఖర్, ఆయన భార్య పద్మను హుటాహుటిన అంబులెన్స్‌లో కానూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సోమశేఖర్ విజయవాడలోని ఆర్మ్డ్ రిజర్వులో కానిస్టేబుల్‌గా ఉన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు... ప్రమాదంస్థలంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చటంతో పాటు గాయపడిన వారిని కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, తహశీల్దార్ జి.భద్రు, ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్ఐ డి.సురేష్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలంలో పరిస్థితి చూసి బంధువులు భోరున విలపించారు. కాళ్లపారాణి ఆరకముందే తమ కుమారతున మృత్యువు కబళించటాన్ని పెళ్లికుమార్తె తండ్రి సాంబయ్య, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనతో వారి రోదనలు మిన్నంటాయి. -
పిచ్చోళ్ల సిటీ కూడా ఇలా ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ నగరాన్ని ఒకడు నేనే కట్టానంటాడు.. ఒకడు హైటెక్ సిటీ అంటడు.. ఇంకోడు ఏదో అంటడు.. పిచ్చోళ్ల సిటీ కూడా ఇలా ఉండదు. గవర్నమెంటు, మున్సిపాలిటీ దీన్ని నడపడం లేదు. ఏదో ధర్మం మీద నడుత్తాంది. సచ్చిపోతే కాల్చేం దుకు శ్మశాన వాటిక లేదు.. బొంద పెట్టేందుకు బరియల్ గ్రౌండ్ లేదు. ఒక్క వానొస్తే సీఎం ఉండే బేగంపేట వద్ద నడుముల్లోతు నీళ్లు.. గవర్నర్ ఉండే రాజ్‌భవన్ వద్ద మోకాల్లోతు నీళ్లు.. అసెంబ్లీ ముందు నడుముల్లోతు నీళ్లు.. ఒక్కటంటే ఒక్కటి సక్కంగ లేదు. నన్నొకాయన అడిగిండు.. మీ నగరం అట్లేందని. నేను ఆయనతో చెప్పిన.. మాది హైటెక్ సిటీ అని. వానాకాలంలో మా కార్లు పడవలు అయితయని’ అని హైదరాబాద్ నగర దుస్థితిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంపల్లిలో మంగళవారం జరిగిన పార్టీ విస్తతస్థాయి సమావేశంలో హైదరాబాద్ గురించి సీఎం ప్రస్తావించారు. దాదాపు కోటి మంది ఆధారపడిన రాజధానిలో అనువైన సౌకర్యాలు లేవని కేసీఆర్ అన్నారు. తగినన్ని కూరగాయల మార్కెట్లు, బస్సు షెల్టర్లు, శ్మశాన వాటికలు, దోబీఘాట్లు లేవన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రపంచంలో ఎవరూ ఊహించనిరీతిలో ‘గ్లోబల్ సిటీ’గా మారుస్తామన్నారు. ఎక్కడ అందుబాటులో స్థలాలు ఉన్నాయో వెదుకతం, పంజాగుట్టలో ఎకరంలో మార్కెట్ కడతం, మలక్‌పేటలో మార్కెట్ కడతం. ఎర్రమంజిల్‌లో జాగాలున్నయ్. ప్రజల భూములను ఎలా వాడాలో మీకు తెలియలేదు. మేం చేసి చూపిస్తం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న చోటే టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి పట్టాలు ఇస్తోందని, 2.80 లక్షల మంది పేదలకు 150 గజాలకు ఉచితంగా పట్టాలు ఇవ్వనుందని, ఈ నెల 20 నుంచి పంపిణీ చేపడతామని సీఎం వివరించారు. అన్ని జిల్లాల్లోనూ ఇది అమలవుతుందన్నారు. జీహెచ్ఎంసీలో ఒక్కో వార్డులో ఒక్కో విధంగా ఓట్లున్నాయని, వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలుంటాయన్నారు. ముందుగా ఆకుపచ్చ తెలంగాణ బంగారు తెలంగాణను సుసాధ్యం చేసి చూపించాలని సీఎం కే సీఆర్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు వానలు వాపస్ రావాలి. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వస్తే, ఒక సారి కాలమైతే మూడేళ్లు సాగునీటికి కొదవ ఉండదు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఙంలా చేపట్టాలి. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. హరిత హారం, మిషన్ కాకతీయ ఇతర కార్యక్రమాల గురించి సాంస్కృతిక బృందాలు ప్రచారం చేస్తాయని, త్వరలోనే 500 మంది కళాకారులను తీసుకుంటామని, సాంస్కృతిక సారథి రసమయి నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ‘ప్రజలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ కదులుతుంది. మన అభివృద్ధిపై మనకు సోయి ఉంది. గరీబ్ గాళ్లు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. -
వీడియోతో బుద్ధి చెప్పింది...
స్త్రీలపై వేధింపులు రోజుకోజుకు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బస్సులు, రైళ్లలోనే కాదు...విమానాల్లో కూడా వేధింపులు తప్పటం లేదు. తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి ఏకంగా విమానంలోనే ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్‌కు చెందిన ఓ యువతి ప్రయాణికురాలు ఇండిగో విమానంలో భువనేశ్వర్ వెళ్తుంది. ఆమె వెనుక సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. చూడడానికి డీసెంట్‌గా ఉన్నా...బుద్ధి మాత్రం గడ్డి తింది. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆ యువతిని తాకడానికి ప్రయత్నించాడు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది. ఆ తర్వాత ఒక్కసారిగా కేకలు వేసింది.. అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు. తోటివారి సహాయంతో ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మహిళలు ప్రతిఘటించడానికి భయపడతారు. కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది. తన విషయానికి వస్తే చట్టాలు ఏం చేయలేవని నాకు తెలుసు అందుకే అందరి ముందు అతడిని అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని' యువతి తెలిపింది. కాగా సదరు 'పెద్ద' మనిషి భువనేశ్వర్‌కు చెందిన పలు కంపెనీలకు ఛైర్మన్. అయితే జున్‌జున్‌వాలా పోలీసులు మాత్రం అతడిని కొద్దిసేపు కస్టడీలోకి తీసుకుని వదిలేయటం గమనార్హం. -
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్‌బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి జీవిత కాలాన్ని గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఈ జీవ గడియారం వయసుకు మనిషి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వారు ఓ నమూనా తయారు చేశారు. 5 వేల మంది వృద్ధుల జీవన విధానాన్ని 14 ఏళ్ల పాటు గమనించి దీన్ని రూపొందించారు. దీని ప్రకారం జీవగడియారం వయసుతో సమానంగా ఉన్న వారితో పోలిస్తే వ్యక్తి వయసు కన్నా జీవగడియారం వయసు ఎక్కువగా ఉన్న వారు మరణానికి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో పాటు ధూమపానం, మధుమేహం, హృద్రోగ వ్యాధుల ద్వారా సంభవించే మరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవ గడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని మారియోని అనే శాస్త్రవేత్త తెలిపారు. -
సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలాడు
జైపూర్: సర్పంచ్ పదవికి కోసం రూ. 2 కోట్ల ఉద్యోగాన్నే వదిలేశాడు ఓ ఎన్ఆర్ఐ. 27 ఏళ్ల హనుమాన్ చౌదరి అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని ఓ రిసార్ట్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేసేవాడు. అతని వార్షిక వేతనం దాదాపు రూ.2 కోట్ల రూపాయలు. అయితే తండ్రి భురాం అతన్ని స్వస్థలానికి త్వరతగతిన రావాలని ఫోన్ చేశాడు. అందుకు కారణం మాత్రం సర్పంచ్ పదవికి పోటీ చేయడమే. రాజస్తాన్ లోని నగౌర్కి చెందిన హనుమాన్ తన తండ్రి మాట పట్టుకుని ఆగమేఘాల మీద ఇండియాకు వచ్చేశాడు. ఇందులో భాగంగానే తండ్రి మాటకు గౌరవం ఇస్తూ సర్పంచ్ పోటీలో నిలుచుని గెలుపొందాడు. అయితే తండ్రి ఆస్ట్రేలియా నుంచి చౌదరిని తిరిగి రమ్మడానికి ఓ కారణం కూడా ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి కనీస విద్యార్హతని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులని ఇచ్చింది. దీని ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎనిమిదో తరగతి, పంచాయితీ సమితిలో సభ్యులుగా ఉండడానికి 10వ తరగతి చదివి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులతో ఆ ఉళ్లోని 85 శాతం ప్రజలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్నవారందరూ అనర్హులు. ''8 వతరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మా ఊళ్లోని చాలా మంది నన్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ విషయమై మా అన్నయ్యని సంప్రదించగా సమాజ సేవా చేయాలనుకుంటే తిరిగి రావొచ్చు అన్నారు. అయన ప్రోత్సాహంతోనే ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాను'' అని చౌదరి అన్నారు.