పిచ్చోళ్ల సిటీ కూడా ఇలా ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ నగరాన్ని ఒకడు నేనే కట్టానంటాడు.. ఒకడు హైటెక్ సిటీ అంటడు.. ఇంకోడు ఏదో అంటడు.. పిచ్చోళ్ల సిటీ కూడా ఇలా ఉండదు. గవర్నమెంటు, మున్సిపాలిటీ దీన్ని నడపడం లేదు. ఏదో ధర్మం మీద నడుత్తాంది. సచ్చిపోతే కాల్చేం దుకు శ్మశాన వాటిక లేదు.. బొంద పెట్టేందుకు బరియల్ గ్రౌండ్ లేదు. ఒక్క వానొస్తే సీఎం ఉండే బేగంపేట వద్ద నడుముల్లోతు నీళ్లు.. గవర్నర్ ఉండే రాజ్‌భవన్ వద్ద మోకాల్లోతు నీళ్లు.. అసెంబ్లీ ముందు నడుముల్లోతు నీళ్లు.. ఒక్కటంటే ఒక్కటి సక్కంగ లేదు. నన్నొకాయన అడిగిండు.. మీ నగరం అట్లేందని. నేను ఆయనతో చెప్పిన.. మాది హైటెక్ సిటీ అని. వానాకాలంలో మా కార్లు పడవలు అయితయని’ అని హైదరాబాద్ నగర దుస్థితిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొంపల్లిలో మంగళవారం జరిగిన పార్టీ విస్తతస్థాయి సమావేశంలో హైదరాబాద్ గురించి సీఎం ప్రస్తావించారు. దాదాపు కోటి మంది ఆధారపడిన రాజధానిలో అనువైన సౌకర్యాలు లేవని కేసీఆర్ అన్నారు. తగినన్ని కూరగాయల మార్కెట్లు, బస్సు షెల్టర్లు, శ్మశాన వాటికలు, దోబీఘాట్లు లేవన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రపంచంలో ఎవరూ ఊహించనిరీతిలో ‘గ్లోబల్ సిటీ’గా మారుస్తామన్నారు. ఎక్కడ అందుబాటులో స్థలాలు ఉన్నాయో వెదుకతం, పంజాగుట్టలో ఎకరంలో మార్కెట్ కడతం, మలక్‌పేటలో మార్కెట్ కడతం. ఎర్రమంజిల్‌లో జాగాలున్నయ్. ప్రజల భూములను ఎలా వాడాలో మీకు తెలియలేదు.
మేం చేసి చూపిస్తం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న చోటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి పట్టాలు ఇస్తోందని, 2.80 లక్షల మంది పేదలకు 150 గజాలకు ఉచితంగా పట్టాలు ఇవ్వనుందని, ఈ నెల 20 నుంచి పంపిణీ చేపడతామని సీఎం వివరించారు. అన్ని జిల్లాల్లోనూ ఇది అమలవుతుందన్నారు. జీహెచ్‌ఎంసీలో ఒక్కో వార్డులో ఒక్కో విధంగా ఓట్లున్నాయని, వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలుంటాయన్నారు.
ముందుగా ఆకుపచ్చ తెలంగాణ
బంగారు తెలంగాణను సుసాధ్యం చేసి చూపించాలని సీఎం కే సీఆర్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు వానలు వాపస్ రావాలి. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వస్తే, ఒక సారి కాలమైతే మూడేళ్లు సాగునీటికి కొదవ ఉండదు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఙంలా చేపట్టాలి. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. హరిత హారం, మిషన్ కాకతీయ ఇతర కార్యక్రమాల గురించి సాంస్కృతిక బృందాలు ప్రచారం చేస్తాయని, త్వరలోనే 500 మంది కళాకారులను తీసుకుంటామని, సాంస్కృతిక సారథి రసమయి నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ‘ప్రజలే కేంద్ర బిందువుగా టీఆర్‌ఎస్ కదులుతుంది. మన అభివృద్ధిపై మనకు సోయి ఉంది. గరీబ్ గాళ్లు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు.