105 ఏళ్ల అత్త... 77 ఏళ్ల కోడలు
ఈ ఇంటికి దీపం ఇన్-లాలు
‘అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణమంతురాలు’ అంటారు. కానీ అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు, కోడలున్న అత్త గుణమంతురాలు.. అని తిరగరాస్తున్నారీ అత్తాకోడళ్లు. పెళ్లయిన కొన్నాళ్లకే వేరే కాపురం వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతున్న రోజుల్లో ఏకంగా 63 ఏళ్ల పాటు అత్తతోనే ఉంటున్న ఉత్తమురాలు స్వర్ణకుమారి. అప్పట్నుంచి ఆమె చేతి వంటకాలనే తింటూ, ఆమె చెంతనే ఉంటున్న గుణవంతురాలు మల్లికాంబ. ఆమె వయసు 105 ఏళ్లు, కోడలి వయసు 77 ఏళ్లు కావడం మరో విశేషం! విశాఖపట్నంలో ఐదు తరాలుగా కొనసాగుతున్న ఈ ఆదర్శ కుటుంబం గురించి అత్తగారి మాటల్లో...
బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం
మాది వ్యవసాయ కుటుంబం. 30 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి విశాఖ వచ్చాం. నేను, నా భర్త (వీరరాఘవయ్య) స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు విశాఖలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. కొడుకు, కోడలు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, అని మనవళ్లతో కలిసి మా సంతతి 42 మంది. పెద్ద కుమార్తె సీతారామమ్మకు 86, కుమారుడు రామ్మోహనరావుకు 84, చిన్న కుమార్తె సరోజాదేవికి 77 ఏళ్లు. కొడుకు, కోడలు తప్ప మిగిలిన వారంతా వేర్వేరు ప్రాంతాల్లోను, విదేశాల్లోనూ ఉంటున్నారు. మా కుటుంబ సభ్యులు శుభకార్యానికో, పండగలకో మా ఇంటికొస్తుంటారు. కొన్నాళ్ల క్రితం అని మనవడు (ఐదో తరం) రేయమ్స్ (2 సం.లు) అన్నప్రాశన వేడుకకు మా వాళ్లంతా వచ్చారు. నా కొడుక్కి, కోడలికి సమ్మోహనం (60 ఏళ్ల వైవాహిక జీవితం నిండిన సందర్భం) జరిపించారు.
కొల్లేరు చేపలు, గేదెపాలు
మేం ముగ్గురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. మా చిన్నప్పుడు మానాన్నగారు కొల్లేరు నుంచి చేపలు తెచ్చి వండించేవారు. ఆ చేపలెంత రుచిగా ఉండేవో! గేదె పాలు పుష్కలంగా ఉండేవి. పెద్దలంటే గౌరవం ఉండేది. అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకునేవారు. ఉమ్మడి కుటుంబాలుండేవి. అంతా కలిసిమెలసి ఉండే వారు. ఆ రోజులే బాగుండేవి. అప్పట్లో మా అబ్బాయి రామ్మోహన రావుకు పాము కరిస్తే కోడెల శివప్రసాదరావు (నేటి ఏపీ స్పీకర్) వాడికి వైద్యం చేశారు.
ఎల్లుండి మునిమనవరాలి పెళ్లి
నా కోడలు... పేరుకు తగ్గట్టు స్వర్ణమేనయ్యా. మా కోడలికి కోడలు, ఆ కోడలికి మరో కోడలు కూడా వచ్చారు. అయినా కోడలు స్వర్ణకుమారి (77) ఇంకా కోడలి పాత్రే పోషిస్తోంది. అరవై మూడేళ్ల నుంచి నాతోనే ఉంటూ సేవ చేస్తోంది. కూతురిలా చూసుకుంటుంది. నా కోసం ఎన్నో ఇబ్బందులు పడుతోంది పాపం! కోడలితో సహా అందరూ నాకేలోటూ రానీయడం లేదు. కూర్చోబెట్టి చూస్తున్నారయ్యా. అప్పుడప్పుడు మనవలు, మనవరాళ్లు, మునిమనవలు వచ్చి చూసి వెళ్తారు. ఏ ఇబ్బందీ లేదు.. తృప్తిగా ఉంది. అందరి పెళ్లిళ్లూ చూశాను. నా చిన్న మనవడి కూతురు (మునిమనవరాలు ప్రవల్లిక) నిశ్చితార్థానికెళ్లా. ఆమె పెళ్లి కూడా చూడాలనుంది. (ఫిబ్రవరి 8న విజయవాడలో ప్రవల్లిక పెళ్లి.)
నువ్వు లేకపోతే నేనుండలేనంటారు
‘మా అత్తగారు నువ్వు లేకపోతే నేనుండలేనమ్మా.. బెంగ పెట్టుకుంటానంటారు. అందుకని నేను ఆమెను వదిలి ఎక్కడికీ వెళ్లలేను. ఆమె మాట కాదనలేక ఎక్కడికీ వెళ్లడానికి ఇష్టపడను. ఇలా 63 ఏళ్ల నుంచి మా బంధం కొనసాగుతూ వస్తోంది. నాకు కోడలు, ఆమెకు కోడలూ వచ్చారు. మనవళ్లు పుట్టారు. ఎవరి కాపురాలు వారు చేసుకుంటున్నారు. మా అత్తగారికి చేసేది సేవ అనుకోను.. కోడలిగా నా బాధ్యత అని భావిస్తున్నా. ఎప్పుడూ ఆమె మంచి మాటలు చెబుతుంటారు. కొన్నాళ్ల క్రితం అనిమనవడు రేయమ్స్ గడపలు దాటే పండక్కి మా అత్తగారు పాటలు కూడా పాడారు. అనిమనవడిని ఎత్తినందుకు ఎంత సంబరపడి పోయారో! మా ఆడపడచులు, మేమూ ఆపేక్షగా ఉంటాం. ఏ రోజూ ఏమీ అనుకోలేదు. మాలాగే అన్ని కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష.
- స్వర్ణకుమారి, కోడలు