దొరికితేనే దొంగ. దొరక్కపోతే దొర. చీకటి మాటున దొరలోని దొంగ బయటకు వస్తాడు.నిశ్శబ్దం చాటున దొంగ దొరలా మారిపోతాడు. దొరలా ఉండే దొంగ తను దొరకననే ధీమాతో దొంగవేషాలేస్తాడు. ఎదిరించనంత వరకే దొంగకి దొరతనం. అలాంటి ఓ దొరదొంగను నిలదీసింది ఒక ధీశాలి.
గత వారం ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ వెళ్తున్న ఫ్లైట్‌లో ఒక నడివయస్కుడు తన ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకురాలిని అసభ్యంగా తాకాడు. ఛీ ఛీ అని చీదరించుకుని ఆ అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్లిపోయి ఉంటే అది మన వరకూ చేరని మరో సాధారణ సన్నివేశం అయి ఉండేది. ఆ మౌనం మరోసారి అదే సంఘటన మరోచోట జరిగే అవకాశం కల్పించేది. కాని, ఇక్కడ ఆ అమ్మాయి నిశ్శబ్దాన్ని ఛేదించింది. కెమెరా ఎక్కుపెట్టి మరీ తనకు జరిగిన వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఆ దొరదొంగ సిగ్గుతో కుంచించుకుపోయాడు. దొరకనంత వరకు ఇలా ఎందరిని వేధించాడో కానీ, మరోసారి ఇలా ప్రవర్తించడానికి భయపడేలా బుద్ధి చెప్పింది ఆ అమ్మాయి.
అదిగో దొంగ..
ఈ సంఘటన చాలా అంశాలను తెరపైకి తెచ్చింది. మొదటిది.. లైంగిక వేధింపులకు.. వర్గ, ఆర్థిక, సామాజిక భేదాలు లేవు. విమానాల్లో తిరిగే చదువుకున్న సంపన్న వర్గాల్లో కూడా కీచక దొరలుంటారు. రెండోది.. స్త్రీల నిశ ్శబ్దాన్ని నిస్సహాయతగా భావించబట్టే వేధింపులకు అవకాశం తీసుకుంటున్నారు. మూడోది.. ఇలాంటి నీచకులను ఎదిరించి నిలదీయటమే కాదు సమాజానికి ప్రకటించి నలుగురిలో తలదించుకునేలా చేయాలి.. అప్పుడే మరో దొరదొంగ తయారుకాడు.
ఇదిగో సాక్ష్యం..
వయసుతో సంబంధం లేకుండా ప్రతి పది మంది స్త్రీలలో కనీసం 8 మంది జీవితంలో ఒక్కసారైనా మృగాడి వెకిలి చూపులు, అసభ్య చేష్టలు.. ఎదుర్కొంటున్నారు. నేను కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఎక్కువ శాతం స్త్రీలు ఇటువంటి వేధింపులు ఎదురైతే సిగ్గు, పరువు పేరుతో మౌనాన్ని ఆశ్రయిస్తారు. మరికొంత మంది, చిన్న విషయానికి పెద్ద గొడవెందుకని సమస్య తీవ్రతను నీరుగారుస్తారు. ఇక నాలాంటి కొందరు వెంటనే ఎదిరించి.. గట్టిగా పోరాటం చేస్తారు. ఫ్లైట్‌లో ఆ అమ్మాయి పోరాటానికి ఎంచుకున్న మార్గం నాకు నచ్చింది. అసభ్య ప్రవర్తన ఎదుర్కొన్న వెంటనే స్పందించింది. అరిచి రభస చేయడంతో పాటు సమయస్ఫూర్తితో తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించింది.
దొరికిపోయిన ఆ దొంగ ముఖంలో నెత్తుటి చుక్క లేదు. తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఎదురు నిలిచి వాదించేవాడేమో ! కాని, వీడియో చిత్రీకరణ మొదలవగానే.. సారీ సారీ అంటూ ముఖం దాచేసుకునే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయడానికి ఆ అమ్మాయి బలమైన ఆధారం స్వయంగా ఏర్పాటు చేసుకుంది. ఆ సమయస్ఫూర్తి మనకు ఆదర్శం కావాలి. ధైర్యంగా మాట్లాడటమే కాదు.. పరువు, సిగ్గు అంటూ దాక్కోకుండా సామాజిక నెట్‌వర్క్స్‌లో కూడా తన వీడియోను షేర్ చేసి ఆ సంఘటనను ప్రపంచానికి తెలియజేసింది. నిజమే సిగ్గుపడాల్సింది వేధించిన వాడు కానీ.. వే దనకు గురైన స్త్రీ కాదు.
ఎక్కడ ధర్మం..
ఆ వీడియో ఆసాంతం చూశాక ఓ పక్క అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే.. మరో పక్క మన సమాజం నిస్తేజం చూసి కోపం భగ్గుమంది. ఫ్లైట్‌లో ఇంత హడావిడి జరుగుతున్నా చుట్టుపక్కల ప్రయాణీకులు సినిమా చూస్తున్నట్టు నిలుచున్నారు. ఆ అమ్మాయికి అండగా ఏ ఒక్కరూ పెదవి మెదపలేదు. చదువుకున్న నాగరికత అడ్డొంచిందేమో మరి ! వెనుక సీట్లోనే ఉన్న ఇద్దరైతే చలో చలో.. అంటూ దాటి వెళ్లిపోవడమూ కనిపించింది. ఇదీ మన భారతీయ నైతికత. ఇటువంటి సందర్భాల్లో నిశ్శబ్దం వల్ల సత్యం బయటకు రాకపోవం ఒక ఎత్తయితే.. నైతిక మద్దతు లభించకపోవడం మరో ఎత్తు.
ఇక్కడ మారాలి..
భువనేశ్వర్ ఇండిగో ఫ్లైట్ మాలెస్టేషన్ కేస్ నా దృష్టిలో చరిత్రాత్మకం. ఎందుకంటే ఇది మనకు కొత్త తరం పాఠం చెబుతోంది. వేధింపులను సహించం, సంఘటనను బహిర్గతం చేయడానికి సంకోచించం. ఇది ఇప్పటి తరం మహిళ మనోగతం కావాలి. టెక్నాలజీని మన రక్షణ కోసం ఉపయోగించగలిగే సామర్థ్యం మనందరం పెంచుకోవాలి. పేరు తెలియని ఆ సాహసికి సలాం చేస్తూ, అమ్మాయిలందరికీ పిలుపునిస్తున్నా.. నిశ్శబ్దాన్ని ఛేదించండి.
facebook.com/anchorjhansi
కీచకానికి కీలెరిగిన వాత
Published Fri, Feb 6 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement