Jhansi ki vaani
-
కీచకానికి కీలెరిగిన వాత
దొరికితేనే దొంగ. దొరక్కపోతే దొర. చీకటి మాటున దొరలోని దొంగ బయటకు వస్తాడు.నిశ్శబ్దం చాటున దొంగ దొరలా మారిపోతాడు. దొరలా ఉండే దొంగ తను దొరకననే ధీమాతో దొంగవేషాలేస్తాడు. ఎదిరించనంత వరకే దొంగకి దొరతనం. అలాంటి ఓ దొరదొంగను నిలదీసింది ఒక ధీశాలి. గత వారం ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది. భువనేశ్వర్ వెళ్తున్న ఫ్లైట్‌లో ఒక నడివయస్కుడు తన ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకురాలిని అసభ్యంగా తాకాడు. ఛీ ఛీ అని చీదరించుకుని ఆ అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్లిపోయి ఉంటే అది మన వరకూ చేరని మరో సాధారణ సన్నివేశం అయి ఉండేది. ఆ మౌనం మరోసారి అదే సంఘటన మరోచోట జరిగే అవకాశం కల్పించేది. కాని, ఇక్కడ ఆ అమ్మాయి నిశ్శబ్దాన్ని ఛేదించింది. కెమెరా ఎక్కుపెట్టి మరీ తనకు జరిగిన వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఆ దొరదొంగ సిగ్గుతో కుంచించుకుపోయాడు. దొరకనంత వరకు ఇలా ఎందరిని వేధించాడో కానీ, మరోసారి ఇలా ప్రవర్తించడానికి భయపడేలా బుద్ధి చెప్పింది ఆ అమ్మాయి. అదిగో దొంగ.. ఈ సంఘటన చాలా అంశాలను తెరపైకి తెచ్చింది. మొదటిది.. లైంగిక వేధింపులకు.. వర్గ, ఆర్థిక, సామాజిక భేదాలు లేవు. విమానాల్లో తిరిగే చదువుకున్న సంపన్న వర్గాల్లో కూడా కీచక దొరలుంటారు. రెండోది.. స్త్రీల నిశ ్శబ్దాన్ని నిస్సహాయతగా భావించబట్టే వేధింపులకు అవకాశం తీసుకుంటున్నారు. మూడోది.. ఇలాంటి నీచకులను ఎదిరించి నిలదీయటమే కాదు సమాజానికి ప్రకటించి నలుగురిలో తలదించుకునేలా చేయాలి.. అప్పుడే మరో దొరదొంగ తయారుకాడు. ఇదిగో సాక్ష్యం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి పది మంది స్త్రీలలో కనీసం 8 మంది జీవితంలో ఒక్కసారైనా మృగాడి వెకిలి చూపులు, అసభ్య చేష్టలు.. ఎదుర్కొంటున్నారు. నేను కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఎక్కువ శాతం స్త్రీలు ఇటువంటి వేధింపులు ఎదురైతే సిగ్గు, పరువు పేరుతో మౌనాన్ని ఆశ్రయిస్తారు. మరికొంత మంది, చిన్న విషయానికి పెద్ద గొడవెందుకని సమస్య తీవ్రతను నీరుగారుస్తారు. ఇక నాలాంటి కొందరు వెంటనే ఎదిరించి.. గట్టిగా పోరాటం చేస్తారు. ఫ్లైట్‌లో ఆ అమ్మాయి పోరాటానికి ఎంచుకున్న మార్గం నాకు నచ్చింది. అసభ్య ప్రవర్తన ఎదుర్కొన్న వెంటనే స్పందించింది. అరిచి రభస చేయడంతో పాటు సమయస్ఫూర్తితో తన ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించింది. దొరికిపోయిన ఆ దొంగ ముఖంలో నెత్తుటి చుక్క లేదు. తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఎదురు నిలిచి వాదించేవాడేమో ! కాని, వీడియో చిత్రీకరణ మొదలవగానే.. సారీ సారీ అంటూ ముఖం దాచేసుకునే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయడానికి ఆ అమ్మాయి బలమైన ఆధారం స్వయంగా ఏర్పాటు చేసుకుంది. ఆ సమయస్ఫూర్తి మనకు ఆదర్శం కావాలి. ధైర్యంగా మాట్లాడటమే కాదు.. పరువు, సిగ్గు అంటూ దాక్కోకుండా సామాజిక నెట్‌వర్క్స్‌లో కూడా తన వీడియోను షేర్ చేసి ఆ సంఘటనను ప్రపంచానికి తెలియజేసింది. నిజమే సిగ్గుపడాల్సింది వేధించిన వాడు కానీ.. వే దనకు గురైన స్త్రీ కాదు. ఎక్కడ ధర్మం.. ఆ వీడియో ఆసాంతం చూశాక ఓ పక్క అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే.. మరో పక్క మన సమాజం నిస్తేజం చూసి కోపం భగ్గుమంది. ఫ్లైట్‌లో ఇంత హడావిడి జరుగుతున్నా చుట్టుపక్కల ప్రయాణీకులు సినిమా చూస్తున్నట్టు నిలుచున్నారు. ఆ అమ్మాయికి అండగా ఏ ఒక్కరూ పెదవి మెదపలేదు. చదువుకున్న నాగరికత అడ్డొంచిందేమో మరి ! వెనుక సీట్లోనే ఉన్న ఇద్దరైతే చలో చలో.. అంటూ దాటి వెళ్లిపోవడమూ కనిపించింది. ఇదీ మన భారతీయ నైతికత. ఇటువంటి సందర్భాల్లో నిశ్శబ్దం వల్ల సత్యం బయటకు రాకపోవం ఒక ఎత్తయితే.. నైతిక మద్దతు లభించకపోవడం మరో ఎత్తు. ఇక్కడ మారాలి.. భువనేశ్వర్ ఇండిగో ఫ్లైట్ మాలెస్టేషన్ కేస్ నా దృష్టిలో చరిత్రాత్మకం. ఎందుకంటే ఇది మనకు కొత్త తరం పాఠం చెబుతోంది. వేధింపులను సహించం, సంఘటనను బహిర్గతం చేయడానికి సంకోచించం. ఇది ఇప్పటి తరం మహిళ మనోగతం కావాలి. టెక్నాలజీని మన రక్షణ కోసం ఉపయోగించగలిగే సామర్థ్యం మనందరం పెంచుకోవాలి. పేరు తెలియని ఆ సాహసికి సలాం చేస్తూ, అమ్మాయిలందరికీ పిలుపునిస్తున్నా.. నిశ్శబ్దాన్ని ఛేదించండి. facebook.com/anchorjhansi -
సిటీ మస్కటీర్స్
ఝాన్సీ కి వాణీ హైదరాబాద్ టు విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కాను. పక్క సీట్లో ముంబై నుంచి వస్తున్న ప్రయాణికుడు. నేను వస్తూనే గబగబా ముక్కుకి మాస్క్ తగిలించుకున్నాడు. అసలే సీజన్ బాగోలేదు. ఆ మాస్క్ వీరుడిని చూసి జాలేసింది. జలుబు కానీ ఉందేమోనని ! పలకరింపుగా నవ్వి కూర్చున్నాను. మాస్క్ వెనుక అతని కళ్లు మాత్రమే కనబడుతున్నాయి. తిరిగి నవ్వాడో లేదో అర్థం కాలేదు. అతని కళ్లు నన్ను అనుమానాస్పదంగా చూస్తున్నట్టు అనిపించాయి. ఎందుకొచ్చిన గొడవలే అని మేగజైన్ తిరగేయడం మొదలుపెట్టాను. ప్రయాణంలో కనీసం తోటి ప్రయాణికుడిని పలకరించకుండా ఉండలేని వీక్నెస్ నాది. పైగా సారు గారు చూస్తున్న అనుమానపు చూపులు మరింత కుతూహలం రేకెత్తిస్తున్నాయి. ఇక ఉండబట్టలేక మీరు ముంబై నుంచి వస్తున్నారా అని అడిగాను. నేనేదో అడక్కూడనిది ప్రశ్నించినట్టు ఉలిక్కిపడిపోయి ఆయన జేబులు తడిమేసుకున్నాడు. ఊరు మరిచిపోయిన గజిని అయి ఉంటాడా..? లేక విజిటింగ్ కార్డు వెతుక్కుంటున్నాడా అనుకున్నా. ఆయన జేబు నుంచి బయటకు తీసిన వస్తువును చూసి షాకవడం నా వంతు అయింది. నోస్ మాస్క్ !! అది నా చేతికి ఇచ్చి ముఖానికి పెట్టుకోమని సైగ చేసి చేతులను శానిటైజర్‌తో రుద్దుకున్నాడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. ఒకటి మాత్రం అర్థమైంది. అతనప్పటి వరకు నన్ను వైరస్ క్యారియర్‌గా చూశాడని. అది జాగ్రత్త అనాలో, భయం అనాలో తెలీదు. మొత్తానికి మాట పెరిగింది. సారు ముంబై నుంచి వైజాగ్‌కు ఆఫీస్ పని మీద వెళ్తున్నాడట. వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్.. వయా తెలంగాణ. పైగా ఫ్లైట్ హైదరాబాద్‌లో ఆగుతుంది. కాబట్టి ‘తస్మాత్ జాగ్రత్త అని మిత్రులు హెచ్చరించారట. హైదరాబాద్ స్వైన్ ఫ్లూ క్యాపిటల్’ అని అతనిచ్చిన ఈక్వేషన్ విని తెల్లబోయాను. స్వైనం ఛిందంతి శాస్త్రాని.. ఇదా హైదరాబాద్‌కు బయటున్న ఇమేజ్..! నిజమే హెచ్1ఎన్1 కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, తగిన సమయంలో గుర్తించి మందులు వాడాలి. వీటి గురించి తెలిసుంటే స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన చెందక్కర్లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఈ కాంపెయిన్ భుజానికెత్తుకుంది. సమాచారంతో పాటు సంచలనం క్రియేట్ చేసి తద్వారా జనం దృష్టిని ఆకర్షించాలనే ప్రణాళిక వేసిన వారూ లేకపోలేదు. ఆ ప్లాన్ వారికి లబ్ధి చేకూర్చిందో లేదో కానీ, మార్కెట్లో స్వైన్ ఫ్లూ పేరుతో కాసులు పండించుకునే వ్యాపారానికి తెర తీసింది. అవును మరి సమాచారం కంటే భయం తొందరగా పాకుతుంది. అందుకే జనం కూడా మెడికల్ షాప్లకీ, ఆస్పత్రులకూ పరుగులు తీస్తున్నారు. మాస్క్ మస్కా.. సూపర్మార్కెట్లలో హ్యాండ్ శానిటైజర్ల కొరత, మెడికల్ ఫార్మసీలలో మాస్క్‌ల రేటు మోత..! ఫ్లూ వ్యాక్సిన్ కోసం క్యూలు చేంతాడంత ! వ్యాక్సిన్ ధరలు ఎంతున్నా సామాన్యుడికి ఆతృత ! ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పక్కన పెడితే, కార్పొరేట్లతో వైద్యం చుక్కలనంటుతోంది. ఇక సందట్లో సడేమియా ల్యాబ్‌లలో పరీక్షలతో కూడా లాభాలు గడించేసుకోవాలనుకునే వారూ ఉన్నారు. మొత్తానికి స్వైన్ ఫ్లూ పేరుతో వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇది తెలిసి కూడా ఎదురు ప్రశ్నించని తత్వం మనది. రెండు రూపాయల మాస్క్ పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. కానీ, కూరగాయల దగ్గర ఓ రూపాయి తగ్గించుకోమని బేరమాడతాం. భయమేస్తే విలువ పెరుగుతుంది. లొసుగుల ముసుగు ఆరోగ్యంగా ఉన్నవారికి వ్యాక్సిన్ పెద్దగా అవసరం లేదని ఓ పక్కన చెబుతున్నా. ఎంత డబ్బు పోసైనా కొనుక్కుందామనుకునే మన వల్ల నల్లదందాలు మొదలయ్యాయి. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా పాకుతున్న భయానికి, భయాన్ని వ్యాపారంగా మార్చిన వైనానికి, అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా బాధ్యత వహించగలదా..! ఇతర సంచలనాలకీ, భద్రతా సమాచారాలకీ ఇదే విధంగా స్పందించని మన సమాజం మీడియాని, మార్కెట్‌ని నియంత్రించగలదా..! ఎవరి చేతుల్లో ఎవరు ఆడుతున్నట్లో? అవసరమైతే ముసుగు వేస్తాం. లేకపోతే లొసుగు వెతుకుతాం. నా పెదవి విరుపు మీకు కనిపించదు. ప్రస్తుతం నేను మాస్క్ వేసుకున్నా.