సాక్షి, అమరావతి బ్యూరో : సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇంట్లో జరిగిన చోరీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రూ. కోటికిపైగా నగదు, బంగారు ఆభరణాలను ఇంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీగార్డు దోచుకెళ్లాడు. ఆ తర్వాత అత్యంత నాటకీయంగా విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులుఛేదించిన ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు అసలు ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీనే జరగలేదని, ఇంట్లో వ్యక్తులే అతనికి డబ్బు అందజేశారని తెలుస్తోంది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం చోరీ జరిగినట్లు నమోదు చేయడం గమనార్హం.
ఇంట్లో వాళ్ల పనేనా..!
ఎంతో నమ్మకంగా ఇంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీగార్డు బిస్వాస్.. ఐఏఎస్ అధికారి నివాసంలో నిజంగా చోరీకి పాల్పడ్డాడా? లేదా? లేక ఇంట్లో వాళ్లే నిందితుడికి డబ్బులిచ్చి పంపించారా? ఒకవేళ నిజంగా చోరీ జరిగి ఉంటే ఎంత సొమ్ము, నగదు పోయింది? పోలీసులు ఈ కేసును ఎందుకంత రహస్యంగా విచారించాల్సి వచ్చింది? నిందితుడి అరెస్టు చేసిన విషయంలోనూ గోప్యత ఎందుకు పాటించారు? అసలు కేసును నమోదు చేసుకున్న సూర్యరావుపేట పోలీసులు అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పరువు పోతుందనేనా..?
ఇంట్లో భారీ ఎత్తున చోరీ జరగడం.. అది కూడా ఇంట్లో వాళ్లే సహకరించారని తేలడంతో బాధితులు ఈ కేసును మూడోకంటికి తెలియకుండా డీల్ చేయమని పోలీసులను వేడుకొన్నట్లు తెలిసింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాలను వెల్లడించేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ ఈ కేసు విషయం బయటకు పొక్కకూడదన్న ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంట్లో వాళ్ల ప్రోత్బలంతోనే ఐఏఎస్ అధికారి ఇంట్లో నుంచి డబ్బులు, నగదుతో ధైర్యంగా బయటకు వెళ్లినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 23న కేసు నమోదు..
తన ఇంట్లో చోరీ జరిగినట్లు ఐఏఎస్ అధికారి శశిభూషణ్‌కుమార్ సూర్యరావుపేట పోలీసు స్టేషన్‌లో గత నెల 23న ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే స్టేషన్ పోలీసు ఉన్నతాధికారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసు బాస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బిస్వాస్ ఆచూకీ కోసం యత్నించారు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్‌లోని సిరిగురి గ్రామంలో అతడు ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి బిస్వాస్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. గత నెలాఖరు 30న బిస్వాస్‌ను నగరానికి తెచ్చి వారం పాటు విచారించి.. నిందితుడి వద్ద నుంచి రూ. 14.50 లక్షలను రికవరీ చేశారు. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన బిస్వాస్‌ను అరెస్టు చేసినట్లు చూపి రిమాండ్‌కు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే బాధితుడు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దాని కంటే పదుల రెట్లు ఎక్కువగా నగదు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment