ఒంగోలు క్రైం:ఒంగోలు శివారు ప్రాంతాలతో పాటు పరిసర మండలాల్లో దారిదోపిడీలు చేసి, దంపతులను, జంటలను వేధించిన దారిదోపిడీ ముఠాను ఒంగోలు సీసీఎస్, ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారని ఏఎస్పీ ఏబిటిఎస్.ఉదయరాణి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దారి దోపిడీలతో పాటు మహిళలు, యువతులపై అత్యాచారాలకు ఈ ముఠా పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగు చూసిందని వివరించారు. ముఠా నాయకుడు పాలపర్తి ఏసుతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. వాళ్లలో ఒకరు బాలనేరస్తుడు కూడా ఉన్నారని వివరించారు. పాలపర్తి ఏసు చీమకుర్తి శిద్దానగర్‌కాలనీకి చెందిన వ్యక్తి. అతనితో పాటు చీమకుర్తి వెంకటేÔశ్వర కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు, చీమకుర్తి శిద్దానగర్ కాలనీకి చెందిన కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గా ప్రసాదు, మన్నెం అంకమరావు, మన్నెం నరిశింహారావు, మన్నె గంగయ్య, తుపాకుల అంజయ్యలను అరెస్టు చేశామన్నారు.
17 నేరాలు చేసినట్లు అంగీకారం:పాలపర్తి ఏసు ముఠా మొత్తం మీద 17 నేరాలు చేసినట్లు అంగీకరించారని ఏఎస్పీ వెల్లడించారు. అందులో భాగంగా మొత్తం ఐదు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సంతనూతలపాడు, టంగుటూరు పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేసినట్లు వివరించారు. ముద్దాయిల నుంచి బంగారపు రింగులు రెండు, బంగారు చైన్‌లు, ఇతర బంగారు ఆభరణాలు, మోటారు సైకిళ్లు ఐదు, సెల్‌ఫోన్లు 12 స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం వాటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందన్నారు. దారిదోపిడీలు, మహిళలను, యువతులపై అత్యాచారాలకు కూడా పాల్పడి ఆయా ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు.
శివారు ప్రాంతాలు, సాగర్ కాలువ గట్లు లక్ష్యంగా...
పాలపర్తి ఏసు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి శ్రీనివాసులు, కొండయ్యలను గ్రూపులుగా ఏర్పాటు చేసి దారిదోపిడీలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడటం వృత్తిగా పెట్టుకున్నారన్నారు. వీళ్లు ఒంగోలు నగర శివారు ప్రాంతాలు, సాగర్ కాలువ గట్లపై జంటగా వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, అత్యాచారాలు చేశారన్నారు. వెంగముక్కపాలెం, ముంగమూరు రోడ్డు, కొణిజేడు, లింగంగుంట శివారు, కొప్పోలు, మద్దులూరు, పొందూరు, చీమకుర్తి శివారు ప్రాంతాలతో పాటు మల్లవరం డ్యాం ప్రాంతాల్లో వీరు నేరాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. సీసీఎస్ పోలీసులు రామకృష్ణ, అంజిబాబుతో పాటు మరికొందరికి వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. మొత్తం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయని మరో 12 కేసులు నమోదు కావాల్సి ఉందన్నారు.
బాధిత మహిళలు ముందుకు రావాలి....
ఈ ముఠా బారిన పడి ఇబ్బందులు పడిన బాధిత మహిళలు, యువతులు ముందుకు రావాలని అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఏఎస్పీ ఉదయరాణి పేర్కొన్నారు. నేరుగా న్యాయమూర్తి ముందే వాంగ్మూలం నమోదు చేస్తారని వివరించారు. ఒకసారి వస్తే చాలని తరువాత ఎప్పుడు కూడా అటు కోర్టుకు కాని, ఇటు పోలీస్ స్టేషన్‌కు కాని రావాల్సిన పనిలేదన్నారు. అందుకోసం మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. అత్యంత క్లిష్టమైన కేసులను చాకచక్యంగా చేధించిన ఒంగోలు సబ్ డివిజన్, సీసీఎస్ పోలీసులను జిల్లా ఏఎస్పీ ఏబిటిఎస్ ఉదయరాణి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఎస్సై వివి.నారాయణ, ఏఎస్సై వి.వెంకటేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలాంజనేయులు, చంద్రశేఖర్, సురేష్, కోటయ్య, వెంకయ్య, కానిస్టేబుళ్లు అంజిబాబు, రామకృష్ణ, ఖాదర్, సాయి, శాంతకుమార్, శేషు, తాలూకా పోలీసులు శివ, మౌలాలి, సంధాని బాషలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment