వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో: అతనో ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ(హెచ్‌ఆర్) గోల్డ్ మెడలిస్ట్. జల్సాలకు అలవాటుపడిన అతను చోరీలు ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. నాలుగుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మర్చుకోలేదు. గతేడాది ఆగస్టులో చర్లపలి జైలు నుంచి విడుదలైన తర్వాత పది ఇల్లల్లో పంజా విసిరాడు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగను సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1,50,000 నగదు, 80 తులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శినితో కలిసి సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.
పీడీ యాక్ట్ ప్రయోగించినా..
ప్రకాశం జిల్లా, వేటపాలెం ప్రాంతానికి చెందిన చెందిన వంశీ కృష్ణ 2004లో ఎంబీఏ (హెచ్‌ఆర్)లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆర్థికంగా స్థితిమంతుడైనా స్నేహితులతో కలిసి చెడువ్యసనాలకు అలవాటు పడిన అతను విలాసాల కోసం చోరీల బాట పట్టాడు. వీధుల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు. అదను చూసుకుని కటింగ్ ప్లేయర్‌తో తాళాలు పగులగొట్టి ఇల్లల్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేవాడు. 2006లో ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇతను తొలిసారిగా సరూర్‌నగర్ పోలీసులకు చిక్కాడు. 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2009లో మరో 7 కేసుల్లో సరూర్‌నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో 20 నెలల పాటు ఊచలు లెక్కపెట్టాడు. మరోసారి బాలానగర్ పోలీసులకు చిక్కి ఎనిమిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. బయటకి వచ్చిన అనంతరం ఏకంగా 13 చోరీలకు పాల్పడటంతో ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో 21 నెలలు జైల్లోనే ఉన్నాడు. గతేడాది ఆగస్టు 18న జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ కృష్ణపై సస్పెక్ట్ హిస్టరీ షిట్ తెరిచి నిఘా ఉంచారు. దీంతో పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు వివిధ నగరాలకు వెళ్లి అక్కడే ఉంటూ మధ్యలో వచ్చి జీడిమెట్లలో రెండు, నాచారంలో రెండు, చిక్కడపల్లిలో రెండు, ఎస్‌ఆర్‌నగర్‌లో రెండు, మారేడ్‌పల్లిలో ఒకటి, కాచిగూడలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. సంఘటనాస్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో బాలానగర్ సీసీఎస్ పోలీసులను రంగంలోకి దింపారు. బుధవారం నిందితుడిని జీడిమెట్లలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment