మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్
నేరేడ్‌మెట్: జల్సాల కోసం చోరీల బాట పట్టారు. నాలుగేళ్లలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. క్యాబ్‌లో తిరుగుతూ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళా హాస్టల్‌లోకి చొరబడి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అగంతుకుడు చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 28.8తులాల బంగారం, 37 తులాల వెండి వస్తువులు, ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లు, కత్తి, కటింగ్ ప్లేయర్, రూ.7,970 నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, చెదురవెల్లి గ్రామానికి చెందిన పొటేల్ రమేష్ బోడుప్పల్‌లోని అంబేడ్కర్ నగర్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు. వనపర్తి జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన గుండూరి కిరణ్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ బొడుప్పల్‌లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నాడు.
ఇద్దరికి పరిచయం ఉండటంతో చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాందించేందుకు చోరీల బాట పట్టారు. 2013 నుంచి రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్‌లలోని పలు ఠాణాల పరిధిలో 15 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పలుసార్లు అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. క్యాబ్ బుక్ చేసిన ప్రయాణికుల కదలికలను గుర్తించి ఆయా ఇళ్లను లూటీ చేసేవారు. చోరీ సమయంలో ఒంటరి మహిళలను కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించేవారు. ప్రధాన నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం బోడప్పల్ కమాన్ వద్ద అతడిని అదుపులోకి మారుతీ డిజైర్ కారును తనిఖీ చేయగా కత్తి, రాడ్, కట్టింగ్ ప్లేయర్ లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహిళా హాస్టల్ ఘటనతోపాటు ఇళ్ల చోరీలు వెలుగులోకి వచ్చినట్లు సీపీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కేసు చేధించిన పోలీసు అధికారులకు సీపీ రివార్డులు అందజేశారు. సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment