జైల్లో స్నేహం చేసి.. జట్టు కట్టి.. | Robbery Gang Arrest in PSR Nellore | Sakshi
Sakshi News home page

జైల్లో స్నేహం చేసి.. జట్టు కట్టి..

Published Wed, Oct 2 2019 1:29 PM | Last Updated on Wed, Oct 2 2019 1:29 PM

Robbery Gang Arrest in PSR Nellore - Sakshi

మాట్లాడుతున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి

నెల్లూరు(క్రైమ్‌): దొంగతనం కేసులో ఒకరు. హత్య కేసులో మరొకరు జైలుకు వెళ్లారు. అక్కడ స్నేహితులయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడ్డారు. రెండేళ్లుగా నాలుగు జిల్లాల్లో ఇళ్లలో చోరీలు, కార్ల దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరిగారు. పోలీసులు వారిని ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపారు. నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి వివరాలను వెల్లడించారు.

ఇలా బయటపడింది
ఇందుకూరుపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని మైపాడులో ఈ ఏడాది శివకుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి పది బంగారుగాజులు, కొంతనగదు అపహరించారు. కొద్దిరోజులకే మరో దొంగతనం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్‌ సీఐ కె.రామకృష్ణ, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌సైదాలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని (టవర్‌ డంప్‌) వినియోగించి నేరస్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఏఏ నెట్‌వర్క్‌ల కింద ఫోన్‌ కాల్స్‌ మాట్లాడారో జాబితాను సేకరించి దాని ఆధారంగా నిందితుడు పాతనేరస్తుడు, మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ అయిన ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనుకల గ్రామానికి చెందిన పెద్దినేని తిరుపతిస్వామి అలియాస్‌ వంశీ, అతని అనుచరుడైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం సంక్రాంతి పల్లి గ్రామానికి చెందిన లేదోటి లక్ష్మీపతిగా గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచారు. మంగళవారం నిందితులు నెల్లూరు నగరంలోని సంతపేట నాలుగుకాళ్ల మండపం వద్ద ఉన్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జైలులో పరిచయం  
తిరుపతిస్వామి దొంగతనం కేసులో, లక్ష్మీపతి హత్యకేసులో చిత్తూరు జిల్లాలోని ఓ సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈక్రమంలో ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఆర్థిక ఇబ్బందులున్నాయని లక్ష్మీపతి వెల్లడించడంతో తిరుపతిస్వామి «తనతో వస్తే సమస్యలు తీరుతాయని చెప్పాడు. దానికి లక్ష్మీపతి అంగీకరించాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు రెండేళ్లుగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో నేరా>లకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు.  

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌
వంశీ చిన్నతనం నుంచే తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం దొంగగా మారాడు. 2005 నుంచి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. పొదిలి పోలీసులు అతడిపై సస్పెక్టెడ్‌ షీట్‌ తెరిచారు. 2017లో నంద్యాల వద్ద, ప్రకాశం జిల్లా మేదరమిట్ల వద్ద ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. 2005 నుంచి ఇప్పటివరకు నిందితుడు సుమారు 80 నేరాలకు పాల్పడ్డాడు. 17 వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రకాశం జిల్లా గుడ్లూరులో రోడ్‌ యాక్సిడెంట్‌ కేసులో సైతం నిందితుడిపై కేసు ఉంది. రెండేళ్లుగా పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారాడు. 

గుప్తనిధుల్లో నగదు పోగొట్టుకుని..
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లి గ్రామానికి చెందిన లెదోటి లక్ష్మీపతి అతని స్నేహితులు గుప్త నిధుల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో లక్ష్మీపతిని అతని స్నేహితుడు మోసం చేయడంతో రూ.10 లక్షలు అప్పులయ్యాడు. దీంతో లక్ష్మీపతి తన స్నేహితుడిని హత్య చేశాడు. అతడిపై చిత్తూరు గంగవరం పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. 

సిబ్బందికి అభినందన  
ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌సైదా, నెల్లూరు రూరల్‌ సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్సైలు పి.నరేష్, పి.సుబ్రహ్మణ్యం, సీసీఎస్‌ ఎస్సై కె.వేణుగోపాల్, ఏఎస్సై కె.గిరధర్, హెడ్‌కానిస్టేబుల్స్‌ జీవీ రమేష్, సి.విశ్వనాథం, ఎస్‌కే అమీన్, నెల్లూరు రాము, షేక్‌ ఇస్మాయిల్, ఎస్‌.యానాదయ్య, కానిస్టేబుల్స్‌ పి.సతీష్, పీవీ సాయిఆనంద్, ఆర్‌.హరీష్‌రెడ్డి, దారా వినోద్, ఎం.గురునాథ్, కె.వెంకటేశ్వర్లు, ఎన్‌.దేవకిరణ్, రత్నంలను ఎస్పీ అభినందించారు. నగదు ప్రోత్సాహకాలు అందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించేందుకు కృషిచేసిన దారా వినోద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

నాలుగు జిల్లాల్లో 23 నేరాలు 
నిందితులు కార్లను దొంగలించి వాటిలో రెక్కీ వేస్తారు. అనువుగా ఉన్న ఇంటిని ఎంచుకుని దొంగతనాలు చేస్తారు. జిల్లాలోని ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ఏఎస్‌పేట, బాలాయపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు నేరాలు, ప్రకాశం జిల్లాలోని మేదరమిట్ల, కొనకలమిట్ల, జరుగుమల్లి, గుడూర్లు, సీఎస్‌పురం, లింగసముద్రం పోలీసుస్టేషన్ల పరిధిలో ఆరునేరాలు, గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులో ఒకటి, చిత్తూరు జిల్లా తవణంపల్లి, ఏర్పేడు, బంగారుపాళెం, వాయల్పాడు, సోమల, చౌడేపల్లి, ఎస్‌ఆర్‌పురం పోలీసుస్టేషన్ల పరిధిలో తొమ్మిది నేరాలు చేశారు. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో మూడు కార్లను దొంగలించినట్లు నేరం అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షలు విలువచేసే 1.403 కేజీల బంగారు ఆభరణాలు, 3.560 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అందులో నెల్లూరు జిల్లాలోని కేసులకు సంబంధించి 230 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 గ్రాముల వెండి ఆభరణాలు, ప్రకాశం జిల్లాకు సంబంధించి 475 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కేజీల వెండి ఆభరణాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 698.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,000 గ్రామలు వెండి ఆభరణాలున్నాయి. కార్లలో ఓ కారును గుడ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో అక్కడి పోలీసులు సీజ్‌ చేయగా, ఇటీవల బంగారుపాళెంలో మిగిలిన రెండు కార్లను అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement