రాజేంద్రనగర్: దర్జాగా కారులో వచ్చి రెండు ఇళ్ల ను కొల్లగొట్టిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదర్షాకోట్ భాగ్యనగర్ కాలనీ భవానీమాడల్ స్కూల్ పక్క వీధిలో సత్యనారాయణ కుటుంబం నివాసం ఉంటోంది. అతని భార్య సుజాత మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న షాపునకు వెళ్ళింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఐ–20 కారు పార్కు చేసి ఉన్నట్లు గుర్తించింది.
కొద్ది సేపటి తరువాత ఇంటికి తిరిగి రాగా తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆందోళనకు గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మారాలో ఉన్న రూ.45 వేల నగదు, 17 తులాల బంగారం కనిపించకపోవడంతో నార్సింగి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో టీఎస్01ఏడీ0656 నంబర్ కారులో నుంచి నలుగురు వ్యక్తులు దిగి ఇంట్లోకి వెళ్లినట్లు రికార్డు అయి ఉంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ జీవి రమణాగౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మరో ఇంట్లోనూ..
ఇదే ప్రాంతంలోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న శివశంకర్ భార్య స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చేలోగా గుర్తుతెలియని తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ.55 వేల నగదు 23 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు చోరీలు ఐ–20లో వచ్చిన నిందితులే చేసినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన వాహనం టిపుఖాన్ బ్రిడ్జీ నుంచి హైదర్షాకోట్‌కు వచ్చినట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment