మ్యూజియంలో దొంగలు పడ్డారు.. | Robbery in the Nizam museum | Sakshi
Sakshi News home page

మ్యూజియంలో దొంగలు పడ్డారు..

Published Tue, Sep 4 2018 1:23 AM | Last Updated on Tue, Sep 4 2018 1:23 AM

Robbery in the Nizam museum - Sakshi

పురానీహవేలిలోని హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియం.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హిజ్‌ ఎక్సాల్టెడ్‌ హైనెస్‌(హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అత్యంత విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానీహవేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో నిజాం పాలకులు వాడిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. ప్రతిరోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని సిబ్బంది మూసివేశారు. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గ్యాలరీలకు తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మ్యూజియాన్ని తెరిచి చూడగా దొంగతనం వెలుగు చూసింది. రెండో గ్యాలరీలో ఉన్న డైమండ్‌ టిఫిన్‌ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్‌లు కనిపించలేదు.

ఈ విషయంపై మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ షౌకత్‌ హుస్సేన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ్యూజియం వెనుకాల ఉన్న వెంటిలేటర్లను విరగ్గొట్టి లోనికి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లు మ్యూజియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించాయి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మ్యూజియాన్ని సోమవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. మ్యూజియానికి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు.  

విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులు...
ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో రాజ్యాధికారం చేపట్టాడు. 1936లో తన పాతికేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఈ రజతోత్సవాలకు దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరై బహుమతులు అందజేశారు. నిజాం కోరిక మేరకు ప్రజల సందర్శనార్థం వీటితో మ్యూజియం ఏర్పాటు చేశారు. నిజాం పరిపాలనలో ఉపయోగించిన అనేక వస్తువులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. అప్పటి నిజాం నవాబ్‌ పురానీహవేలీలో నిర్మించుకున్న మెుదటి రాజమహాల్లాలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఆరు, ఏడో నిజాం నవాబుల వరకు వాడిన వస్తువులను సందర్శనార్థం ఉంచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement