అయ్యప్ప మాలధారులు ప్రయణిస్తున్న కారు
అనంతపురం, కళ్యాణదుర్గం: శబరిమల నుంచి తిరుగుపయనమైన అయ్యప్పభక్తుల కారు తమిళనాడులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఇద్దరు అయ్యప్పమాలధారులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మున్సిపల్ తాత్కాలిక ఎలక్ట్రీషియన్ మల్లికార్జున, ఆయన కుమారుడు రాఘవేంద్ర, గోపాల్, పాపన్న, ఉమాపతి, మరో ఎలక్ట్రీషియన్ రాఘవేంద్ర, గోవిందప్ప, జైలో కారు డ్రైవర్ మల్లికార్జున ఈ నెల ఒకటో తేదీన శబరిమలకు బయల్దేరి వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. శుక్రవారం తమిళనాడు రాష్ట్రం దిండుగల్ చెక్‌పోస్టు వద్దకు రాగానే స్టీరింగ్ విరగడంతో జైలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గోపాల్ (29), రాఘవేంద్ర (12) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి.
♦ మృతుడు గోపాల్(29)ది కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామం. ఏడాది క్రితం కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన వడ్డే కిష్టప్ప కుమార్తె అనూషను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 నెలల కుమారుడు ఉన్నాడు. మామగారి ఇంటిలోనే ఉంటూ బేల్దారి పని చేస్తు జీవనం సాగించే వాడు.
♦ మరొక మృతుడు రాఘవేంద్ర (12) తల్లి రెండేళ్ల కిందట చనిపోయింది. తండ్రి మల్లికార్జున (మున్సిపల్ తాత్కలిక ఎలక్ట్రీషియన్) ఆలనా పాలనా చూసుకునేవాడు. తండ్రీకొడుకులిద్దరూ అయ్యప్ప మాలధరించారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం అయనను మరింత కుంగదీసింది.
♦ ప్రమాద సమాచారం తెలియగానే ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటినా సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment