డబుల్ బెడ్‌రూమ్ పథకం కోసం పటాన్‌చెరుకు వెళ్లాల్సిన ఇసుకను గజ్వేల్‌లో డంప్ చేస్తున్న డ్రైవర్
గజ్వేల్ : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల మీదుగా నిత్యం వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. నిబంధనలకు పాతరేస్తూ.. ఓవర్‌లోడ్, వే బిల్లులతో ప్రమేయం లేకుండా దందా సాగుతోంది. అధికారులను మాముళ్ల మత్తులో ముంచుతూ.. అక్రమార్కులు రాజీవ్ రహదారిపై చెక్‌పోస్టులను దాటిస్తూ హైదరాబాద్‌కు ఇసుక చేరవేస్తున్నారు. తాజాగా ఈ ‘దందా’ కొత్తరూపు దాల్చింది. డబుల్ బెడ్‌రూమ్ పథకం అనుమతుల పేరిట హైదరాబాద్‌కే కాకుండా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట లాంటి ప్రధాన పట్టణాలకు కూడా ఇసుక తరలిస్తున్నారు.
ఇసుక దందా అక్రమార్కులకు కాసులను కురిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి ఎంతోమంది ఈ వ్యాపారంలో హల్‌చల్ చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకను జిల్లాలు దాటిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని మోయతుమ్మెద వాగు, కరీంనగర్ మండలం ఆరెపల్లిలోని మానేరువాగు, జిల్లాలోని ఆరెపల్లిలో గల క్వారీల నుంచి నిత్యం ఇసుక అక్రమంగా తరలిపోతోంది.
నిజానికి 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నుల ఇసుక నింపాల్సి ఉంటుంది. కానీ, 10 నుంచి 15 టన్నులకు పైగా అదనంగా ఇసుక నింపి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రహదారులు దెబ్బతింటాయని తెలిసి కూడా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల్లో టన్నును రూ.600 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో నాలుగు రెట్ల చొప్పున ధర పెంచి అమ్ముకుంటున్నారు.
నిజానికి ప్రతి లారీలోనూ నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక నింపి.. వే బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా ఇసుక వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. ఇసుకను తరలించే క్రమంలో కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు సుమారు 170 కిలోమీటర్ల పొడవునా పదికి పైగా చెక్‌పోస్టులున్నా... వీటిని సునాయసంగా దాటేస్తున్నారు. ఎప్పుడైనా అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తే ముందుగా సమాచారం అందుకొని.. రాజీవ్ రహదారిపై వందల సంఖ్యలో నిలిపి లారీలు నిలిపివేస్తూ.. తర్వాత వెళ్తున్నారు.
అధికారుల అండదండలు ఇసుక వ్యాపారం ఇష్టానుసారంగా సాగడం వెనుక అధికారుల అండదండలు ఉన్నట్టు సమాచారం. రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ, పోలీసు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. రాజీవ్ రహదారిపై ఉన్న పోలీస్‌స్టేషన్లు, చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తున్నట్టు తెలిసింది. కేంద్రాల వారీగా మాముళ్లు ముట్టజెబుతూ తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగకుండా అక్రమార్కులు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలకు రూ.1000–రూ.1,500, వే బిల్లు లేకపోతే రూ.1000–రూ.2000తో పాటు పోలీస్‌స్టేషన్‌లకు కూడా మాముళ్లు ఇస్తున్నట్టు సమాచారం.
‘డబుల్ బెడ్‌రూమ్’ పథకం ముసుగులో..
తాజాగా ఇసుక వ్యాపారం కొత్త తరహాలో సాగుతోంది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇసుక అనుమతులు ఇస్తుండగా.. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డు సమీపంలో పటాన్‌చెరు ప్రాంతంలో ‘డబుల్ బెడ్‌రూమ్’ పథకం కోసం అనుమతి ఉన్న టిప్పర్ ఇసుక డంప్ చేస్తూ కనిపించింది. రోజు ఇదే రకంగా పెద్ద సంఖ్యలో టిప్పర్లు, లారీలు ఇక్కడికి వస్తున్నాయి.
ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, లారీకి రూ.30 వేల నుంచి రూ.35 వేలు పలుకుతోంది. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తరలించే ఇసుక.. సాధారణ ఇసుకలో సగం ధరకే లభిస్తుంది. ఈ లెక్కన ఇసుక వ్యాపారులు భారీ ఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం 1 క్యూబిక్ మీటర్(1.9 టన్నులు) ఇసుకను రూ.72 ఆన్‌లైన్‌లో డీడీ చెల్లించి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొడిముంజ స్టాక్ పాయింట్ల నుంచి తీసుకొస్తూ.. దీనిని నాలుగు రెట్ల ధరకు అమ్ముకుంటున్నారు. గజ్వేల్‌కే కాదు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాట ఇతర ప్రధాన పట్టణాలకు ఇదే రకంగా ఇసుక వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment