శ్రీకాకుళం బుజ్జిలి: పురుషోత్తపురం ఇసుక ర్యాంపు వ్యవహారం నీరు గార్చేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక వ్యాపారంతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడెక్కడో దాక్కుక్కున్నారు. ఏపాపం ఎరుగని లారీ డ్రైవర్లు, క్లీనర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారనే విమర్శలున్నాయి.
వంశధారకు వరద వచ్చి.. ఇసుక కోసం వెళ్లి అందులో లారీలు చిక్కుకున్న సంఘటన జరిగి 6 రోజులు గడుస్తున్న కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. ఇసుక వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినా అసలైన దొంగలను విడిపెట్టి, అమాయకుల వైపుదృష్టిసారించడంతో ప్రజల నుంచి పలు విమర్శలువ్యక్త మవుతున్నాయి.
ఒడిశాలో దాక్కున్న నిర్వాహకుడు!
పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కీలకపాత్రధారి తమ్మినేని సంతోష్‌కుమార్ (సంతు)సంఘటన జరిగిన కొద్ది గంటల్లో ఒడిశాకు పరారైపోయినట్టు సమాచారం. అధికార పక్షానికి చెందిన ప్రధాననేతకు ఇసుకనుంచి రోజువారీ వసూళ్లను చేరవేసే ప్రధాన వ్యక్తి ఇతనే కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇసుక ర్యాంపులోపనిచేసినందుకు 45 ట్రాక్టర్లకు కూడా సుమారు రూ. 20 లక్షల వరకు నగదు చెల్లించాలి. అలాగే పగలంతాపని చేసిన సుమారు 600 మందికూలీలకు వేతనం కూడా బకాయి ఉన్నట్లు తెలిసింది.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో పొక్లయిన్..
జలుమూరు మండలం అ«ంధవరం వద్ద వద్దపట్టుబడిన పొక్లయిన్‌ను సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉంచారు. వాహనంపై ఎటువంటి నంబర్ లేకపోవడంతో వాహన యజమానుల వివరాలు బయటకు రాలేదు.
నదిలో 25 లారీలు..
వంశధార ఇసుక ర్యాంపులో 23 లారీలు వరదలో చిక్కకున్నట్లు భావించారు. అయితే శుక్రవారం సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నదిలో ఈతకొట్టుకొని వెళ్లి లారీలను పరిశీలించారు. వరద నీటిలో 25 లారీలు ఉన్నాయి. వాటినంబర్లు కూడా గుర్తించారు. కాగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంశధార మరోసారి వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో లారీల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment