మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు | Sexual Attacks On Minors Ongoing | Sakshi
Sakshi News home page

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు

Published Thu, Oct 10 2019 8:23 AM | Last Updated on Thu, Oct 10 2019 8:23 AM

Sexual Attacks On Minors Ongoing - Sakshi

‘‘సిద్దిపేట పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న యువకుడు పొన్నాల గ్రామంలోని ఓ కుటుంబంతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ యువకుడు తరుచూ ఆ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు.  ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉన్న అమాయకురాలైన బాలికపై కన్ను పడింది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు.. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో సిద్దిపేట్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు’’. 

సాక్షి, సిద్దిపేట: ఇలా జిల్లాలో రోజూ ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేసి నేరస్తులపై కేసులు నమోదు చేసేలా చేస్తున్నారు. మరికొందరు పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని గుట్టచప్పుడు కాకుండా ఉంటున్నారు. మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోజు రోజుకు పెరిగి పోతున్న కామాందుల అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందుగా విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలి. ఆత్మరక్షణకోసం అనుసరించాల్సిన ప్యూహాలపై ప్రత్యేక శిక్షణ అవసరం. జనవరి నుంచి జిల్లాలో నమోదైన కేసుల వివరాలతో  ప్రత్యేక కథనం.

42 మంది అరెస్ట్‌..
మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, ఈవ్‌టీజింగ్‌ వంటి సంఘటనలపై ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 51కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. తాగిన మైకంలో మానసిక వికలాంగులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు కొందరుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయి మనుమరాలు వయస్సున్న వారిపై అత్యాచారాలకు ఒడిగట్టిన ప్రబుద్దులు కూడా ఉండటం శోచనీయం. ఇలా ఈ ఏడాది జనవరిలో 07, ఫిబ్రవరి 06, మార్చి 08, ఏప్రిల్‌ 07, మే 06, జూన్‌ 05, జులై 07, ఆగస్టు 03, సెప్టెంబర్‌ 03 కేసులు నమోదు చేశారు. ఇందులో 42 కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసి అరెస్టు  చేశారు. మరో 10 కేసులు ఇంకా విచారణ దశలో ఉండటం గమనార్హం.

అవగాహనే కీలకం 
మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం అవసరమని మహిళా సంఘాల నాయకులు చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వం జిల్లా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పలు పద్ధతుల ద్వారా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఐసీడీఎస్‌ అధికారులు నిర్వహించిన కార్యక్రమాల్లో ఓ మహిళ వేధింపులకు గురవుతున్న విషయం చెప్పడం గమనార్హం. అదేవిధంగా ప్రతీ మంగళవారం పాఠశాలలు, కళాశాలల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని మహిళలు కోరుతున్నారు. 

ఆకతాయి ఆటకట్టు
సిద్దిపేట పట్టణానికి చెందిన విద్యార్థిని స్థానిక ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. సిద్దిపేట పట్టణానికి చెందిన అకతాయి యువకుడు తరుచూ.. విద్యార్థిని వెంబడించడం, సూటిపోటీ మాటలతో ఇబ్బందులకు గురిచేసేవాడు.. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మఫ్టీలోని పోలీసులు అకతాయిని పట్టుకొని దేహశుద్ధి చేయడమే కాకుండా.. కౌన్సెలింగ్‌ నిర్వహించి యువకుడిని పంపించారు.

కఠినంగా శిక్షించాలి
మైనర్‌ బాలికలనే కాదు.. ముక్కుపచ్చలారని చిన్న పిల్లలను కూడా చిధిమేస్తున్న దుర్మార్గులు సమాజంలో ఉండటం సిగ్గుచేటు. వారికి తల్లి, అక్క, చెల్లి ఉంటారు కదా.. కామంతో కళ్లు మూసుకపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించించాలి. ప్రభుత్వం ఇప్పటికే మహిళల రక్షణకు అనేక చట్టాలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు.
–బూర విజయ, మహిళ శిశుసంక్షేమ శాఖ కో–ఆర్డీనేటర్‌ 

ఫోక్సో చట్టం అమలు చేస్తున్నాం
మైనర్‌ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపై పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. వీరికోసం ప్రత్యేకంగా ఫోక్సో చట్టం అమలు చేస్తున్నాం. ఫిర్యాదులు రాగానే విచారణ చేసి కేసు నమోదు, అరెస్టులు చేస్తున్నాం.  పాఠశాలలు, కళాశాలల్లో ప్రతీ మంగళవారంమ రక్షణ చట్టాలపై అవగాహన కల్సిస్తున్నాం.. నిర్భయంగా 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేస్తే చాలు..                
  –జోయల్‌ డేవీస్, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement