ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. రైళ్లలో దొంగలు కనిపిస్తే కాల్చివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయని నెల్లూరు రైల్వే డీఎస్పీ ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం రైల్వే డీఎస్పీ నూతన కార్యాలయ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేసవి దృష్ట్యా రైళ్లలో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ ముఠాలు కనిపిస్తే కాల్చివేస్తామన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను సైతం డివిజన్‌కు కేటాయించారన్నారు. బృందాలు నెల్లూరు, ఒంగోలులోని జీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి రైళ్లల్లో గస్తీలు నిర్వహిస్తారని తెలిపారు.
నెల్లూరు మీదుగా ప్రయాణించే ప్రతి రైల్లో రాత్రి వేళల్లో ఈ బృందాలు ఎక్కి బోగీలన్ని పరిశీలిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటాయన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో తలమంచి, మనుబోలు, వెందోడు, ప్రకాశం జిల్లాలో సూరారెడ్డిపాళెం, ఉప్పగుంటూరు, సింగరాయకొండ, తెట్టు ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అందుకు రైలుమార్గం ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండటమేకారణమన్నారు.
దొంగలు దొంగతనాలకు పాల్పడి రహదారులపైకి చేరుకుని పరారవుతున్నారన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. ప్రయాణికుల రక్షణ బాధ్యత రైల్వే పోలీసులపై అధికంగా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులకు పూరిస్థాయి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే రైళ్లలో జరుగుతున్న నేరాలను కట్డడి చేశామన్నారు. పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలనీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తలు సంచరిస్తే డయల్ 100కు లేదా రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో జీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జి.దశరథరామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment