ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్: మైనర్ చిన్నారులపై మృగాళ్ల అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఒడిశాలో 24 గంటల్లో ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నారులకు భద్రత కోసం ఆ రాష్ట్ర పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దారుణాలు వెలుగులోకి రావటం గమనార్హం.
నబరంగ్‌పూర్‌లో... ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని బుధవారం ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక ‘మా ఘర’ అనే ఎన్జీవో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఒకడు పోలీసుల సమక్షంలో బాలికకు వివాహం చేసుకుంటానని చర్చలు జరపగా.. విషయం తెలుసుకున్న మా ఘర సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టింది. ఇప్పటివరకు నిందితులను ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు.
బాలాసోర్‌లో... 15 ఏళ్ల బాలికను సవతి తల్లి వేధించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. రెండేళ్లుగా 40 ఏళ్ల ఓ వ్యక్తితో బాలికపై ఆ సవతి తల్లి లైంగిక దాడి చేయిస్తోంది. దీంతో ఆ బాలిక మానసికంగా కుంగిపోయింది. చివరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆమె ఆశ్రయించగా.. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాలికను కౌన్సిలింగ్‌కు పంపించి.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సవతి తల్లి కోసం గాలింపు చేపట్టారు.
10 ఏళ్ల బాలికపై... బాలాసోర్ జిల్లాలోనే ఘోరం చోటుచేసుకుంది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న పదేళ్ల బాలికపై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చిన్నారి నాన్నమ్మ తిరిగొచ్చే సరికి, ఆమెను చూసి నిందితుడు పరారయ్యాడు. బాలిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
కటక్‌లో.. కేంద్రపారా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు మృగచేష్టలకు పాల్పడ్డాడు. 15 రోజుల క్రితం ఐస్ క్యూబ్‌ల కోసం దగ్గర్లోని దుకాణానికి వెళ్లిన చిన్నారిని.. ఆ షాపు యాజమాని ఇంట్లోకి లాక్కెల్లి దారుణానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది. బుధవారం రాత్రి మరోసారి ఆ చిన్నారిపై కన్నేయగా.. తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. గురువారం ఉదయం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్జీవో ఫిర్యాదుతో... కటక్‌లో ఓ మైనర్ చిన్నారిపై బంధువుల వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఈ ఘటనను అవమానంగా భావించి గప్‌చుప్‌గా ఉండగా.. ఓ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గంజమ్ జిల్లాలో.. 15 ఏళ్ల బాలికపై బంధువుల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేయటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
‘పరి పెయిన్ కథాటి’ పేరిట ఒడిశా పోలీసులు ఓ ప్రత్యేక క్యాంపెయిన్ బుధవారం ప్రకటించారు. చిన్నారుల్లో భద్రతా భావం పెంపొందించేందుకు మే 28 నుంచి జూన్ 12వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించదలిచారు. ఇంతలోనే వరుస ఘటనలు వెలుగులోకి రావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment