రసూల్ సయ్యద్
సాక్షి, ముంబై : దినసరి కూలీ అయిన అతగాడు నాలుగేళ్ల క్రితం మరికొందరితో కలిసి దోపిడీకి ఒడిగట్టాడు. విచారణ తుది దశలో ఉన్న ఈ కేసులో అతడికి శిక్ష పడటం దాదాపు ఖరారైంది. దీంతో తన మాదిరిగానే ఉన్న ఓ వ్యక్తిని హతమార్చిన నిందితుడు తన వస్తువుల్ని శవం వద్ద ఉంచి పరారయ్యాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగాయ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అక్కడ పోలీసులు గురువారం నగరంలో పట్టుకున్నారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ సహకారంతో సంతోష్‌నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడకు తరలించారు. మహారాష్ట్రలోని హంగార్గ్ ప్రాంతంలోని షోలాపూర్ రోడ్‌కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్ హాల్‌లో దినసరి కూలీగా పని చేసేవాడు. డబ్బును తేలిగ్గా సంపాదించే మార్గాల కోసం అన్వేషించాడు.
ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరితో కలిసి 2016లో దోపిడీకి పాల్పడ్డాడు. పెట్రోల్ బంక్‌లో పని చేసే ఉద్యోగి తన సంస్థ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ. 3.2 లక్షలు తీసుకుని ఉడాయించారు. ఈ దోపిడీకి సంబంధించి అంబజోగాయ్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేరాన్ని సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు పగడ్బందీగా దర్యాప్తు చేసి అనేక సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. బీడ్ కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు శిక్ష పడుతుందని భావించిన రసూల్ దాన్ని తప్పించుకోవడానకి అనేక మార్గాలు అన్వేషించాడు.
హత్య చేసి ముఖం ఛిద్రం
అంబజోగాయ్ ప్రాంతానికే చెందిన అలీం ఇస్మాయిల్ షేక్‌తో ఇతడికి పరిచయం ఉంది. ఒడ్డు, పొడుగు తన మాదిరిగానే ఉండటంతో రసూల్‌కు ఓ ఆలోచన వచ్చింది. అలీంను చంపేసి తానే చనిపోయినట్లు నమ్మించాలని పథకం వేశాడు. ఈ నెల 17న మద్యం తాగుదామంటూ అలీంకు ఎర వేసిన రసూల్ అక్కడి రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పథకం ప్రకారం అలీం చేత ఎక్కువగా తాగించాడు. మద్యం మత్తులో ఉన్న అతడి తలపై బండరాయితో మోది హత్య చేసి ముఖం ఆనవాళ్లు చిక్కకుండా ఛిద్రం చేశాడు. తన వస్త్రాలను ఆ శవానికి కట్టి, తన సెల్‌ఫోన్, పర్సు ఇతర వస్తువుల్ని శవం వద్ద పడేశాడు.
ఈ విషయం తన భార్యకు చెప్పి కొన్నాళ్లపాటు ఇతర ప్రాంతంలో తలదాచుకుంటానని ఇంటి నుంచి వచ్చేశాడు. నేరుగా అంబజోగాయ్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రసూల్ అక్కడ కనిపించిన తన పరిచయస్తుడి వద్ద సెల్‌ఫోన్ తీసుకుని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన పరిచయస్తుడికి కాల్ చేశాడు. తాను హైదరాబాద్ వస్తున్నానని, తనకో చిన్న ఉద్యోగం సైతం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. అతడు అంగీకరించడంతో రైలులో హైదరాబాద్‌కు చేరుకున్న రసూల్ రాజేంద్రనగర్ వెళ్లి అతగాడిని కలిశాడు. అతడి సిఫార్సుతో సంతోష్‌నగర్ పరిధిలోని రియాసత్‌నగర్ గ్రేవ్‌యార్డ్ సమీపంలోని షాన్‌బాగ్ ఫంక్షన్ హాల్‌లో పనికి చేరాడు.
ఇదిలా ఉండగా... ఈ నెల 18న అంబజోగాయ్ పోలీసులకు అక్కడి రైల్వేస్టేషన్ సమీపంలో పడి ఉన్న శవానికి సంబంధించి సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు శవంపై ఉన్న వస్త్రాలు, వస్తువుల ఆధారంగా అది రసూల్‌దిగా భావించారు. అతడి భార్యను పిలిపించిన పోలీసులు శవాన్ని చూపించారు. విషయం ముందే తెలిసిన ఆమె అది తన భర్తదే అంటూ పోలీసులకు చెప్పింది. పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన అధికారులు శవాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో అంతా రసూల్ చనిపోయాడని భావించాడు. ఇది జరిగిన రెండు రోజులకు అలీ ఇస్మాయిల్ షేక్ కనిపించట్లేదంటూ అంబజోగాయ్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీనికి తోడు భర్తను కోల్పోయిన బాధ రసూల్ భార్యలో కనిపించకపోవడంతో అంబజోగాయ్ ఇన్‌స్పెక్టర్ హర్ష పోద్దార్‌కు అనుమానం వచ్చింది. ఆ శవం లభించింది రైల్వేస్టేషన్ సమీపంలో కావడంతో స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం అర్ధమైంది. దీంతో రైల్వేస్టేషన్‌లో రసూల్‌కు ఫోన్ ఇచ్చిన వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ రోజు రైల్వేస్టేషన్ నుంచి రసూల్ కాల్ చేసిన నంబర్ గుర్తించారు. అది హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలడంతో ఓ ప్రత్యేక టీమ్ బుధవారం సిటీకి చేరుకుంది. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తిని కలిసిన అధికారులు సహాయం కోరారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని టీమ్ రాజేంద్రనగర్‌లోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా గురువారం రియాసత్‌నగర్‌కు వెళ్లి రసూల్‌ను పట్టుకున్నారు.
ఇతడిని అంబజోగాయ్ తరలించిన పోలీసులు శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపర్చగా న్యాయ స్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది. రసూల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా ఓ ప్రముఖ హిందీ చానల్‌లో వచ్చిన సీరియల్‌లోని సన్నివేశాలే తనకు స్ఫూర్తి ఇచ్చాయని, వాటిలో చూసినట్టే అలీంను చంపి తన స్థానంలో ఉంచానని బయటపెట్టాడు. ఇతడిని పట్టుకోవడానికి సహకరించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీమ్‌కు అంబజోగాయ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment